పుట:కాశీమజిలీకథలు -04.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

నేరము తన మీదఁ దప్పించుకొని తిలకమీఁదఁ బడునట్టు తాను జెప్పుటయే గాక నితరుల చేతఁగూడ సాక్ష్యమిప్పించినది. రామాభాయి వంటి ప్రోడ యా వీఁటిలో లేదు. అప్పుడా చమూపతి తిలకఁ గూడ నేరములో నున్నదని నిశ్చయించి యపరాధినిగా నెంచి చెఱసాలం బెట్టుమని యాజ్ఞాపించెను.

అంతలో నొకమూల కోలహల ధ్వని యొకటి వినఁబడినది అందఱు దృష్టి ప్రసారము లాదెసకు వ్యాపింపజేసిరి. అప్పు డిరువురు భటులు వచ్చిసలాములు చేయుచు సామీ ! హసాదు పుష్పహాసుఁడను పల్లె వాఁడు చక్రవర్తి కొడుకునుఁ గొట్టి పాఱిపోయి వచ్చి ద్వీంపాంతరమున కరుగుచుండ నోడలోఁ బట్టుకొని మీ యొద్దకుఁ దీసికొని వచ్చుచుండ నా దేవాలయము దాపున మమ్మదలించి తన్ని త్రాళ్ళు తెంపుకొని యా దేవాలయములో దూరి తలుపులు వైచికొనెను. ఆ కోవెల ప్రహరి కోటవలె నున్నది. తలుపులు తీయక దానిలోఁ బ్రవేశించుటకు సామాన్యముగ శక్యముగాదు. దేవర దయచేసి వానిం బట్టికొనవలయునని చెప్పిరి.

ఆ మాటలు విని ఆ దండ నాయకుఁడు అగునగు వాని పేరు పుస్తకములో వ్రాసికొంటిమి వానిం బట్టుకొనిన మంచి పారితోషికము రాఁగలదు. అని పలుకుచు యేదియో యూది ధ్వనిచేసెను. ఆ నిమిషములోఁ బెక్కండ్రు రాజభటు లక్కడికి వచ్చిరి. అప్పుడు చమూపతి యీ నేరములోఁగొంచెము విచారింప వలసియున్నది. వీరి నిట్లే యుండనీయుఁడు. తృటిలో వత్తునని చెప్పి రాజభటులతోఁ గూడ నా దేవాలయము దాపున కరిగెను.

కోవెల ముందర గొప్ప గోపురమున్నది. దాని తలుపులు కోట తలుపులు కన్నఁ బెద్దవి. అవి యుత్సవ దినములలోఁ దక్క తక్కిన సమయములందు మూయఁ బడియుండును. వానిలో నొక తలుపున కమరింపబడియున్న చిన్న ద్వారమునుండి జనులు పోవుచుందురు. పుష్పహాసుం డాతలుపువైచి గడియ బిగించి యున్నవాఁడు. కావునఁ చమూపతి యాలోచించి యంతకు ముందాలోపల నున్నవారి దలుపు తీయుఁడని భటులచే నరపించెను. లోపలవారికిఁ బుష్పహాసుని నిర్బంధమునఁ దలుపు తీయుటకు నవకాశము గలిగినది కాదు.

అప్పుడు చమూపతి వీరభటులఁ గొందర శృంఖలా నిశ్రేణికలనుండి యా గోడ నెక్కి లోపలికి దింపి తలుపులు తీయించి దేవళము ముఖమంటపము దాపునకుం బోయెను. పుష్పహాసుఁడు గనఁబడలేదు. అప్పుడందన్న వారి నదలించుచు నతండా పల్లె వాఁడెందున్న వాఁడని యడిగిన వారిట్ల నిరి.

అయ్యా ! మేము మీ కేకలు విని తలుపులు తీయఁబోయిన గడియ గట్టిగఁ బట్టుకొని తీయనీయడయ్యె. మీరులోనికి వచ్చుసన్నాహము జూచి రెండవవైపుననున్న గోపురము మీదుగా నా గోడ యెక్కి నవ్వలకురికి పాఱిపోయెను. ఇంతలో మీరువచ్చితిరని చెప్పిరి. వాని సాహసమునకు, బలమునకు నందున్న వారెల్ల వెరగపడఁ