పుట:కాశీమజిలీకథలు -04.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోలిశెట్టి కథ

239

కొనుచు నిమిషములోఁ బ్రాణములు వదలెను. అప్పుడు వీరుఁడు దీపము వెలిగించి యా సెట్టి చచ్చుట దెలిసికొని యోహో ! మోసమువచ్చినది. నాతన్నువలన వీఁడు మృతుండయ్యెను ఎవ్వరైనం జూచిన నాకు మాటవచ్చునని తలంచి తనదగ్గిరనున్న తాళముచేవులతోఁ బ్రయత్నముమీఁద నాగుడి తలుపును తెరచి భార్య సాయముపట్ట వాని నాగుడిలోనికి దొరలించి మఱలఁ దలుపులు వైచి యెవ్వరికిం దెలియకుండ రహస్యముగా నింటికిం జనియెను.

ఆ సంగతి యంతయుఁ దిలక రావిమొదలునుండి తిలకించుచునేయున్నది. అంతలో మహిళామణి యప్పిని వెంటబెట్టుకొని యుపహారములతో నాయాలయము దాపునకు వచ్చినది అప్పి కోమటి సెట్టినందు గానక నలుమూలలు తిరుగుచుండెను. మహిళామణి దీపము వెలిగించి పూర్వమువలెనే యుపహారము లమ్మవారికి నై వేద్యముఁ జేసి మఱల నింటికిం బోవలయునని తలంచుచు అప్పిని పిలచినది అప్పి సెట్టిజాడ నరయుటకై దూరముగాఁ బోయినది. కావునఁ బలికినదికాదు. అప్పుడు దానిజాడఁ జూచుచు ద్వారదేశమునఁ గూర్చున్న సమయంబున సెట్టభార్య మగని నింటిలోఁగానక యనుమానముపడి బండియెక్కి వెనుకటి రీతిగానే యక్కడికి వచ్చినది. మహిళ బండిలో వచ్చినవారెవ్వరో యని యాలోచించుచున్న సమయంబున సెట్టిభార్య బండి దిగి దాసి దీపముపట్టుకొని ముందునడువ నమ్మవారి గుమ్మము దగ్గరకుఁ బోయి యందున్న మహిళంగాంచి నీ వెవ్వతెవు ? ఒంటరిగా నిచ్చటికేమిటికి వచ్చితివో చెప్పుమని యడిగిన నామె యేమియు మాటాడినదికాదు. అప్పుడు సెట్టిభార్య మునుపు వోలె తనభర్తయం దెచ్చటనో దాగియున్నాఁడని తలంచుచు రామీ : యాగదిఁజూడు మని చెప్పినది. అప్పుడు వెనుకటిగది తెరచిచూచి యందుఁగానక యది అమ్మా ! యిందులేరు. ఆ లోపల నున్నారేమోయని పలికి గుడితలుపులు త్రోసినది వీరుఁడు గుడితలుపులు మాత్రము జేరవేసెనుగాని మఱఁల దాళము వేయలేదు. కావున నా తలుపులు వచ్చినవి. అప్పుడు రామి లోపలికిఁ బోయి యందొకమూలఁ బడియున్న సెట్టింగాంచి అమ్మాగారూ ! సెట్టిగా రిందున్నారు. రండి. అని పలికిన నాకలికి యలుకతో రామీ ! యిటురా ! అందుండనీ యని పలికి యదివచ్చిన తరువాతఁ జూచితివా ? యీరండ నాకొంప ముంచుచున్నది. దీనిం దగిలికొని సెట్టి ప్రతిదినము రాత్రులయం దిచ్చటికి వచ్చుచున్నాఁడు. మొన్న రాత్రి మనతో బాటసారులమని చెప్పినది. కానిమ్ము. వీరిరువురను దలవరుల కప్పగించి దండింపజేయుదముగాక యని పలుకుచునామెను బలాత్కారముగా నాగుడిలోనికిఁ ద్రోసి రండా ! నీవుకూడ నిందుండుము. రేపు ప్రొద్దుట మీయిరువుర పనిఁ బట్టింతునని పలుకుచుఁ దలుపులు ----------- గొల్లెముఁబెట్టి కూర్చున్నది.

అంతలోఁ దెల్లవాఱినది. సెట్టిభార్య అప్పుడావీధిం దిఱుగుచున్న తలవరులం బిలిపించి యిందొక రంకులాడి నా మగనితోఁ గ్రీడింపుచున్నది. రెండు