పుట:కాశీమజిలీకథలు -04.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

రామాభాయియు ఆహా ! నా తలనొప్పి యెంతలో పోయినదో ! శక్తిమహిమ మిక్కిలి కొనియాడఁ దగినది గదా ? యని స్తోత్రములు సేయుచు దాపుననున్న చిన్న దానితో మహిళామణీ ! నీవు నా నిమిత్తము రేవు కూడ శ్రమపడవలయుం జుమీ యని చెప్పిన నామె యంగీకారము సూచించుచుఁ దల యూచినది.

ఆ సంగతి యంతయు జూచి తిలక మిక్కిలి యాశ్చర్యపడుచు నాహా ! స్త్రీ లిట్టి కార్యమునకైన వెఱువరు గదా. ఒరుల నననేల ? నేను మాత్రము విచిత్రములు పన్న లేదా ? యని తలంచుచుఁ గానిమ్ము. ఈ మహిళామణి యెవ్వతెయో వీరింట నేమిటికి వసించినదో తెలిసికొనవలయు. ఈమె గుణము మంచిదివలెఁ గనంబడుచున్నది. రామాభాయి యీమెను మోసము చేయఁదలంచు చున్నది. ఈ సంగతి యా యజమానుం డెఱుఁగఁడు. ఆయన చాల మంచివాఁడు ఈ రహస్యమాయనతోఁ జెప్పి వెల్లడిచేయుదునా ! యని తలంచి పోనిమ్ము. ఈ గొడవ నా కేల ? రేపాగుడి దగ్గరకుఁబోయి యేమి జరగునో చూచెదంగాక యని నిశ్చయించి యప్పుడు వారితోఁ జెప్పి యనిపించుకొని యెక్కడికోపోయి యమ్మఱునాఁడు రాత్రి యథా ప్రకారము పోయి రావిచెట్టు మొదటనున్న వేదిక పైఁ బండుకొనియెను.

ఆ రాత్రి గొంత ప్రొద్దుపోయిన తరువాతఁ గోమటిసెట్టి నరిసిగాని వెంటఁ బెట్టుకొని మెల్ల గా నా గుడి దగ్గరకు వచ్చి ఓరీ ? ఆలస్యము జేసితివేని నాభార్య యనుమానముపడి మఱల నిచ్చటికి రాఁగలదు. నీవు సాయంకాలముపోయి అప్పితోఁ బెందలకడ దీసికొనిరమ్మని చెప్పితివిగదా ! యింకను రాలేదు. నీవు పోయి యాజాడ గనుంగొనిరమ్ము. ఈవేళ జోడు తొడిగికొని వచ్చితినిలే. తేలు నన్నే మియుజేయలేదనిచెప్పి వానిం బంపి యొకమూల మంటప స్తంభము దాపున గూర్చుండెను. ఆవీఁట వీరుఁడను సాలెవాఁడు కుమారునికి జబ్బుచేసినంత నమ్మ వారి కుపహార మిత్తునని మ్రొక్కికొని యా దివసంబున భార్యచే నయ్యుపహారమునుఁ బట్టించుకొని దాను వెనుక దండమును చేతఁబూని నడుచుచు నయ్యమ్మవారి గుడిదగ్గరకు వచ్చెను.

అందుదాను దూరముగా నిలువఁబడి భార్యను మంటపములోనుండి నై వేద్యము పెట్టిరమ్మని నియోగెంచెను. ఆ యువతియు నమ్మవారి ద్వారమున నిలువెంబడి దీపము వెలిగించి పండ్లనైవేద్యము పెట్టి మ్రొక్కి తిరిగి వెళ్ళఁబోవు సమయంబుగఁ గోమటిసెట్టి యదియే మహిళామణి యనుకొని తమి నిలుపలేక యడ్డమువచ్చి చిగురుబోడీ ! నిలునిలు యెక్కడికిఁ బోయెదవు ? నీ నిమిత్తము రెండు నెలలనుండి వేచియున్నాను నామనోరధము తీర్పుము. నీకుఁ గావలసినంత ధన మిచ్చెదనని పలుకుచుఁ జేయిపట్టుకొని లాఁగదొడంగెను. అప్పు డప్పడఁతి అమ్మయ్యో ! నన్నెవఁడో పట్టుకొనుచున్నాఁడని యరచినది. ఆ ధ్వని విని వీరుఁడు సత్వరంబునం జనుదెంచి యెవఁడవురా నీవు ? అని యదల్చుచు నాసెట్టి పొట్టమీఁద నొక్కతన్ను తన్నెను. ఆ దెబ్బ యాయువుపట్టునఁ దగిలి కోమటి గిలగిలఁ గొట్టు