పుట:కాశీమజిలీకథలు -04.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోలిశెట్టి కథ

237

నిక్కడికి బంపినది వాని మఱియకటి కాదు. సెట్టి భార్య వీనిని భాగుగాఁ గొట్టినది. లోకమున నెట్టి వింతలైన నున్నవని తలంచుకొనుచు నా రాత్రి వేగించినది.

మఱునాఁ డుదయంబునఁ గాలోచి కృత్యంబులు నిర్వర్తించికొని తిలక యా పట్టణములోఁ బ్రవేశించి రాజమార్గంబునఁ బడి నడువఁ దొడంగినది. అది మిక్కిలి గొప్ప పట్టణమగుటచే నెంత సేపు నడిచినను ---------- చివర గనంబడలేదు. దైవికముగా బ్రాహ్మణులున్న వీధి గనంబడుటయు నందెవ్వరేని భోజనము పెట్టుదురేమో యని యిటు నటు దిరుగుచుండ నొకయింటి యరగుపై భోజనముఁ జేసి కూర్చుండి యున్న బ్రాహ్మణుఁడొకండు తిలకం జూచి అమ్మా ! నీ దేయూరు ? పలు మా ఱీవీధిం దిరుగుచున్నావేమని యడిగిన అయ్యా ? మాది చాల దూరదేశము. ద్వీపాంతరమందున్న యమరావతీ పురంబున కరుగుచున్న దాన. మేము శూద్రులము. ఆఁకలి యగుచున్నది పట్టెడన్న మెవ్వరైన నిడుదురేమో యని తిఱుగుచున్న దాననని చెప్పిన నవ్వుచు నా విప్రుం డిట్లనియె.

అమ్మీ ! అడిగినం గాని యమ్మ యైనఁ బెట్టదను సామెత వినలేదా? ఊరక తిరిగినఁ బిలిచి నీ కన్న మెవ్వరు పెట్టుదురు ? పాపమెప్పుడు నొరుల వడిగినదానవు కావు కాఁబోలు, రమ్ము మా యింటఁ గడుపుమని పలుకుచు అప్పీ ! యిటురా యని యొకదానిం బిలిచి యీ యమ్మికిఁ దొడ్డిదారిం దీసికొని పోయి యన్నము పెట్టింపుము అమ్మగారితోఁ జెప్పుము పొమ్మనవుడు నా దాసి తిలకం దొడ్డిదారిని లోపలికిఁ దీసికొనిపోయి యొకచో విస్తరివేసినది. అంతలో మఱియొక కాంతపళ్ళెముతో నన్నము తీసికొని వచ్చి వడ్డించినది. తిలక భుజించుచు నామె చక్కఁదనముఁజూచి యాశ్చర్య మందుచు రాత్రి యమ్మవారి గుడికి వచ్చిన చిన్నది యామె కాదుగద. అప్పి యను నది యీ దాసి గాఁబోలు ఆ కోమటిసెట్టి యీమెం జూచి వలచుట యబ్బురమా ? యని యనేక ప్రకారములఁ దలంచుచు భుజించునది.

సాపడిన పిమ్మట నలసటగా నుండుటచే నా చావడిలోనే పరుండి యచ్చటి వారితో నేదియో ముచ్చటింపుచుండెను అంతలో నా లోపల నుండి మఱియొక స్త్రీ వచ్చి అప్పీ మఱల నేఁడు తలనొప్పి వచ్చుచున్న దేమే ? అయ్యో ? క్రమముగా బలియుచున్న దే. నిలువలేనని నేలఁ జతికిల బడినది అప్పుడు అప్పి తలవిరియఁబోసికొని యిటునటు త్రిప్పుచు శివ మాడఁ దొడంగినది.

నేను మఱిడమ్మను ; నాకు నిన్నఁ బంపిన యుపహారములలోఁ బెరుగు లేకపోయినది. దానంజేసి, నీకీ నొప్పి మఱలఁ గలిగించితిని. మఱల మంగళవారము రాత్రి బెరుగుతోఁ బంపితివేని నీ నొప్పి పోవునని యా శివలోఁబ్రేలుచుండుటయు నా స్త్రీ తల్లీ ! నీ వెట్లుకోరెదవో అట్లు ఱేపురాత్రి నీ గుడి కుపహారము మఱలఁ బంపెదను నా నొప్పి వాయఁ జేయుము. నీ మహిమఁజూతమనుటయు నంతలో నా దాసి శివమాడుటఁ జాలించి కొంతసేపు తలయూచుచుఁ దిరుగ మాట్లాడ దొడంగినది.