పుట:కాశీమజిలీకథలు -04.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

సెట్టి - బాబూ దగ్గిరకే వచ్చినారు.

సెట్టి - కొంప మునిగినదే. నీ వెదురుపోయి యిక్కడ లేరనిచెప్పుము. (అని యందొక చిన్న గదిలో దూరి తలుపులు వై చికొను చున్నాఁడు. నరిసిగాడు గుడి వెనుకకు పోవుచున్నాఁడు.)

అంతట సెట్టి భార్యవచ్చి బండిదిగి కరదీపిక యెత్తినలుమూలలు సూచుచు రామీ ! యిక్కడ నెవ్వరు లేరేమి ? ఇంటిఁకి బోయినారేమో కదా యనుటయుఁ నా రామి యమ్మ గారు ! యింటికి వస్తే మనకు గనంబడరా ? మఱియొక చోట నున్నారేమో ? యనుటయు సెట్టిభార్య ఓసీ ? యీ దీపము దీసికొని నలుమూలలు చూచిరా. (అని పంపినది) మొదటి దీపముతో నాలుగు దెసలు పరీక్షించి యెవ్వరిం గానక రావిచెట్టు మొదట వేదికపై దొంగ నిద్ర బోవుచన్న తిలకం జూచి యెవ్వరు నీవని గట్టిగా లేపినది. అది కన్నులు నులుపికొనుచు లేచి నా పని మీకేమి ? మేము బాటసారులమని యుత్తరము చెప్పినది. ఇక్కడ మా సెట్టిగా రుండవలయు నేమైరో నీ వెఱుంగుదువా ? యని యడిగిన నత్తిలక యా గదిలో నున్నవాఁడని వ్రేలితోఁజూపినది. అప్పుడది యా గది తలుపులు తెరచి యొకమూల నక్కియున్న సెట్టింజూచి భయపడి అమ్మయ్యో ! యిందెవ్వరో యున్నారని కేకవైచి యీవలఁబడినది. యెవ్వరే? యెవ్వరే : సెట్టిగారేమో చూచితివా ? యని సెట్టి భార్య యడిగిన అమ్మా ! మన సెట్టిగా రట్లేల నక్కియుందురు ? దొంగవాఁని వలె నున్నాడని చెప్పినది.

సెట్టిభార్య దీపమెత్తి లోపలికిఁబోయి భిత్తి నంటుకొని శవములాగున నిలువంబడియున్న మగనింగని అయ్యో ! నీ కిదియేమి ప్రారబ్దము వచ్చినది ? కానిపనులు కిట్లు వచ్చితివి కాబోఁలు నిదియా తెలిసినది. తేలనిన నేమోయను కొన్నాను. కానిచో నీ యర్దరాత్రమును నీ యమ్మవారి గుడికి రావేల ? నీ కెన్నియేండ్లు వచ్చినను బాడు చేష్టలు మానితివికావు. పదపద అని మెడబట్టుకొని బైటకి గెంటివేసినది. ఆ సెట్టి మాఱు మాటాడక యాగెంటుతో మండపమున కవ్వలఁబడియెను. పిమ్మట నా కొమ్మ నరసిగా ! నరసిగా ! యెక్కడ నున్నావు వెధవా ! నీ విందులకు సహకారివై మాయ మాటలు చెప్పుచున్నావా ? యింటికిరా. నీ సంగతి : యని పలుకుచు సెట్టిభార్య సెట్టి బండియెక్కిన తరువాత దాను గూడనెక్కి, రామి వెనుక నడుచుచుండ నింటికి బోయినది.

ఆ విశేషము లన్నియుం జూచినది కావునఁ దిలక మిక్కిలి విస్మయముఁ జెందుచు నా సతీతిలకము మొగము దీపము వెలుఁగున గనంబడినది. పోలిక చూడ రాచ బిడ్డవలె, దోచుచున్నది. ఆమె స్తుతివచనంబులు విన యోగ్యురాలు కాని కులట కాదు. ఆమె నీ కోమటి శెట్టి మోహించి ద్రవ్యము కఱుచుపెట్టుచున్నాఁడు. బ్రాహ్మణుని పెండ్లాము రవ్వలజోడు వీని వలన లంచము గైకొని కైతవము పన్ని యామె