పుట:కాశీమజిలీకథలు -04.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

మూఁడు తేపలు పట్టుకొని క్షమించి విడిచిపెట్టితిని. ప్రతిదినము రాత్రుల నిందు సాంకేతికము జేసికొని వచ్చుచుండ నెన్ని నాళ్ళూరకుందును ? ఇరువురం బట్టుకొని లోపలఁబెట్టి గొణ్ణెము పెట్టితిని చూడుఁడు. వీనికిఁ దగిన శాస్తి చేయింపుడని వేఁడి కొనినది. అప్పుడు వాండ్రాగుడితలుపులు తెరచి యా ప్రాంతమున నిలుబడి విస్మయ స్వాధనశోక వివశయై పరమేశ్వరుని ధ్యానించుచున్న మహిళామణిం గాంచి బై టికి రమ్ము. రమ్ము. నీగుట్టు రచ్చయెక్కినది. తల వాల్చికొనిన బ్రయోజనములేదని పలికిన నులికిపడుచు నక్కలికి వాకిటకు వచ్చినది.

అప్పుడాగుడిలో నించుక చీఁకటిగా నుండుటచే సెట్టి చచ్చిపడియున్న వాఁడని తెలిసికొనలేక పరు డియున్నాఁడనికొని సెట్టి గౌరవమంతకుఁ బూర్వమె ఱిఁగి యున్న వారె కావున తలవరులు సగౌరవముగా సెట్టిగారూ ! రండి రండి. తెల్లవాఱినది మీవంటివా రిట్టిపనులకుఁ బూనుకొందురా ? యని పలికిరి. కాని సెట్టి లేవలేదు. అప్పుడు సెట్టిభార్య రామీ : యీపాటికి రమ్మనుము ప్రజల మొగము చూచుటకు సిగ్గుపడుచున్నాఁడు కాబోలు : సిగ్గుండిన నీలాటిపను లేమిటికిఁజేయును ? ఎక్కడనో మంచి తొత్తునే సంపాదించెనులే. రండా ! నీవిదివఱ కెందఱికొంపలు దీసితివి? అని మహిళా మణిం బొడుచుచుఁ బరుషములాడఁ దొడంగినది. అంతలోఁ దిలక యాచర్యలన్నియుఁ జూచుచున్నది. కావున మహిళ నిర్దోషురాలని తెలిసికొని జాలిపడి యచ్చటికి వచ్చినది.

ఆ లోపల రామి లోపలికిఁబోయి సెట్టినిలేపి, లేవకుండుటచే బిగ్గఱగాఁ బిలిచియుఁ బ్రతివచనంబుఁ బసయక విసిగి వాకిటకు వచ్చి అమ్మా ! సెట్టిగారు చాల భయపడినారు ఎంతపిలిచినను మాట్లాడుటలేదు. మీరేపోయి పిలువవలయునని చెప్పిన నప్పడఁతి భయమేమీ ? డబ్బున్నదిగదా యింతమేత పాఱవేసినచో నందఱు వ--లగుదురు. ఇఁక నెన్నఁడు నిట్టిపని చేయఁడని యిట్టు చేసితిని. అని పలుకుచు లోపలికిఁబోయి చేయిపట్టుకొని లెండి లెండి. అయ్యో : చీఁకటిలోఁ గిందబరుండ రేమి ? అవును. ఇంటిదగ్గర మూఁడు పఱుపులు వైచినను నొత్తుచున్నదని పలికెదరు. ఇక్కడిదియే సుఖముగానున్నది కాఁబోలు. కోపము వచ్చినదాయేమి ? పరిహాసమున కిట్లు చేసితిని. మగవారలుగదా ! మీ కేమితప్పు ? తలవరులు మిమ్మేమియుం జేయరు. రండి అని యూరక బ్రతిమాలఁ దొడంగినది.

అంతలోఁ గొంత వెలుగు వచ్చినది కావున ముఖవైలక్ష్యము స్పష్టముగాఁ గనంబడినది. నిదానించి చూచి అమ్మయ్యో ? సెట్టి కన్నులిట్లు తేల్ల గుడ్లు పడిన వేమి ? ప్రాణములున్నవియా ? యని యడలుచు నూపిరి పరీక్షించి గాలిం గానక గుండెలు బాదుకొనుచు అయ్యో : అయ్యో : మాసెట్టిని నీరంకులాడి చంపినఁదండో యని యఱచుచుఁ బెద్దధ్వనితో నేడువఁ దొడంగినది. అప్పుడు తలవరులు లోపలికిం బోయి పరీక్షించి సెట్టి చచ్చెనని నిశ్చయించి యాపీనుఁగును వాకిఁటికి దీసికొనివచ్చి