పుట:కాశీమజిలీకథలు -04.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోలిసెట్టి కథ

231

దారి యడిగి తెలిసికొని కొన్నిదినముల కతిప్రయత్నముతో నాపట్టణముఁ జేరినది. అది రేవుపట్టణము ద్వీపాంతరముల కరుగువా రందే యోడలెక్కి. పోవుచుందురు. పుష్పహాసుండు రేవానగరమున నిరువది దినంబులుండి యక్కడనోడయెక్కి యమరావతీపురి కరుగుదును. అని యుత్తరములో వ్రాసియున్న వాఁడు కావునఁ దిలక వారిజాడఁ దెలిసికొనుటకై యందుఁ బ్రవేశించినది.

ఆ బోఁటి వీటిదాపున కరుగువరకు సూర్యాస్తమయ మగుచున్నది. పట్టణములో జనసంచార మెక్కుడుగానుండును. ఈ రేయి నిందు నివశించి రేపు పోయెదంగాకయని నిశ్చయించి తిలక యాయూరి బయటనున్న గ్రామదేవత యాలయమున కెదుట రావిమ్రాను మొదట గుదురగు వేదిక పై వసియించి గమనశ్రమ వాపి కొనుచు శయనించినది. నాఁడు దూరము నడిచివచ్చుటచే మొదటఁ గొంచెముసేపు గాడముగా నిద్రపట్టినది కాని కడుపులో నాకఁలి యగుచుండుటచే నంతలో మెలకువ వచ్చినది. పిమ్మట నిద్రపట్టినదికాదు.

అది కృష్ణపక్షమగుట హృదయాంధకారమునకుఁ దోడుపడి బాహ్యతనుః పుంజంబు లక్కంజనయనకు భయము గలుగఁజేయఁ దొడంగినవి. అందు మనుష్య సంచారమేమియు లేకపోవుటచే క్రూరమృగ మేదియైనవచ్చి బాధించునేమో యని యడలుచు నప్పడఁతి గదివలె దొలువఁబడియున్న రావిమొదలులో దూరి కనులు మూయక తన యవస్థగుఱించి చింతించు చుండెను.

అట్టి సమయంబున నాముఖమండపములోని కొక పురుషుఁడు వచ్చి యగ్గి పుల్ల వెలిగించి నలుమూలలు పరిశీలించి చూచెను. ఆ వెలుఁగున దిలక వానింజూచినది. చెవులకు రవ్వల జోడును మొలకు బంగారుమొలత్రాడునుఁ జేతికి మురుగులును నుంగరములుం గలిగియున్నవి. శరీరచ్ఛాయ నల్ల నిదైనను మెఱుఁగుఁ గలిగి యుండుటచే నించుక చూడదగియేయున్నది. అన్నిటికి విపరీతమైన కడుపు. వానిం జూచిన నెట్టివారికి నవ్వురాకమానదు. అట్టియాకారముగల యాపురుషునిం జూచి యా చిన్నది వెరఁగుపడుచు నోహో ! యీతని వేషముఁజూడ భాగ్యవంతుఁడువలెఁ గనంబడుచున్నాడు. ఇంత ప్రొద్దుపోయిన తరువాత నీచీఁకటిలో నొక్కరుఁ డిక్కడికి రానేల ? యని యాలోచించుచున్న సమయంబున మఱియొకఁడువచ్చి మెల్లగాబాబూ ! సెట్టిగారూ ! అని పిలచెను.

ఆ మాటవిని యాసెట్టి ముందరికి వచ్చి యేమిరా ! నరిసిగా ! యింత యాలస్యము చేసితివి. అప్పి కనబడినదా ? యేమన్నది ? కార్యసాఫల్యమగునని చెప్పినదా యని యడిగెను.

నరసిగాడు - బాబూ ! నేనారింటిదగ్గరవెల్లి అప్పిని పిలవఁగా నా భీష్ముఁడు పో పో అప్పిపని నీకేల ? నీవెవ్వఁడవని కేకవేసెను.