పుట:కాశీమజిలీకథలు -04.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

విసరి గుర్రమునాపి దిగుదిగుమని పలికితిమి. మా మాటల కా బోఁటి జడియుచు నన్నలారా ! నామేన నున్న వస్తువు లన్నియు మీ కిచ్చి వేయుదుసు. నన్నేమియుం జేయక కట్టుబట్టతో విడిచివేయుఁడని ప్రార్ధించిన మొదట నంగీకరించితిమి.

ఆ చిన్నది గుఱ్ఱముదిగి వస్తువులన్ని యుఁ దీసి మా ముందర రాశిగాఁభోసి మఱల గుఱ్ఱమెక్కబోవు సమయంబు నడ్డు పెట్టి నిన్ను బోనీయము. మాలో నొకనిఁ బెండ్లియాడుమని చెప్పితిమి ఆ చిన్నది మాకంటెఁ జాలగడుసుది. అప్పుడు మమ్మందఱం జూచి నన్ను బెండ్లియాఁడువాఁ డెవ్వఁడని యడిగిన నేను నేనని తగవు లాడఁదొడంగితిమి. అప్పుడప్పడఁతి అదికాదు, నేనీ గుఱ్ఱమెక్కి యొక్క దండము విసరెదను. అది వేగముగాఁ బరుఁగిడి ముందెవ్వఁడు నాకుఁ దెచ్చి యిచ్చునో వాఁడే నాభర్తయని చెప్పిన నందఱము సమ్మతించితిమి. అప్పుడు బారెడు దండము నొక దానిఁగొని గుఱ్ఱమెక్కి అదిగో కాచికొనుఁడు వైచుచున్నానని గట్టిగా విసరినది. అది నూఱు బారల దూరమునఁ బడినది. దాని నిమిత్తము మేమందఱము పరుగిడితిమి. ఆసందున నా సుందరి గుఱ్ఱమెక్కి పాఱినది. మే మంతవడిగాఁ బరుఁగిడిపోయినను మాకు దొరికినదికాదు. వస్తువులు మాత్రము తెచ్చికొంటిమి. ఈ భటులు మమ్ముఁ బట్టికొని కొట్టిన దెబ్బలకు మితిలేదు. బాబూ ! యదార్ధము చెప్పితిమి రక్షింపుఁడని వేడుకొనిరి. అప్పుడా రాజు కనికరింపక బ్రహ్మచారితోఁగూడ నా ముచ్చులకు ద్వీపాంతర వాసశిక్ష విధించి యా యరణ్యము లన్నియు వెదకిరమ్మని రాజభటులం బంపి కూఁతురు జాడ నరయుచుండెను.

అని యెఱింగించి మణిసిద్ధుండు వేళమిగులుటయుఁ గథఁజెప్పుటఁ జాలించి తదనంతరోదంతంబు ప్రైమజిలీయం దిట్లు చెప్పఁ దొడంగెను.

నలువది మూడవ మజిలీ

పోలిశెట్టికథ

గోపా ! వినుమట్లు లలిత సఖురాలు తిలక గుఱ్ఱమునుండి పుడమింబడి యది యిసుకనేల యగుటఁ గొంచెము దెబ్బతగిలినను బెద్దతడ వొడలెరుంగక వివశయై యెట్టకే మై దెలిసి కనులు దెరచి చూచినంతఁ దెల్ల వాఱుచున్నది. అప్పుడు లేచి నలు దెసలుం బరికింపుచు, అయ్యో ! లలిత నన్ను విడిచి యేగినదా ? నా జాడఁ దెలియక యెందు విచారించుచున్న దోకదా ? దారిం దప్పితిమేమో, నాపడినది యెఱుంగక యేగెనని తలంచెదను. కానిమ్ము. అది మగనితోఁ గలిసికొనిన నాకదియే పదివేలుఁ అని తలంచుచు నందొక దారిఁబడి నడువసాగినది. పోవంబోవ మధ్యాహ్నమున కొకపల్లె గనంబడినది. అందొక గృహస్థునింట భుజించి తన కులశీలనామంబులు దెలుపక యందలి జనులవలన దూరపు సముద్రపు తీరంబుననున్న రేవా నగరమునకు