పుట:కాశీమజిలీకథలు -04.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోవిందుడను బ్రహ్మచారి కథ

229

యీ ప్రాంతమందలి గ్రామమున కరిగి యీవలయమును విక్రయించి సొమ్ముదెమ్ము. దాన యధేచ్ఛముగా వాఁడుకొనవచ్చునని చెప్పినఁ బరమానందమును పొందుచు వాఁడు నాఁడు. వేకువజామునలేచి దాపుననున్న యొకవీఁటి కరిగి యందాకడియ మంగడికిఁ దీసికొనిపోయి యమ్మకముఁ జూపుటయు గొప్ప వెలగల కడియము తక్కువ వెలఁ జెప్పుటఁ జూచి రాజభటులు వానిం బట్టుకొని నీకి కడియ మెక్కడిదని యడిగిరి. అతఁడు నా భార్యదేయని చెప్పిన నమ్మక నీవు దొంగవలె నున్నావని వానిం బంధించి సింధునారనగరమునకుఁ దీసికొనిపోయిరి. తిలక పన్నిన వ్యూహము వలన దొంగలు కోటగోడకు గొలుసువైచికొని లోపలదూరి రాజపుత్రిక నెత్తికొని పోయినట్లూహింపబడుచున్నది. కావున మిక్కిలి దుఃఖింపుచు నట్టి దొంగలం బట్టుకొనుటకై నలుదిక్కులకు రాజభటులఁ బెక్కండ్రఁ బంపియుండెను.

రాజభటులు గోవిందునిఁ గడియముతో నారాజునెదుటఁ బెట్టిన తోడనే కడియము గుఱుతుపట్టి నృపతి యపరిమిత దుఃఖముతో లలితం దలంచుకొనుచు గోవిందుం జూచి యోరీ! యీ కడియము నీ కెట్లువచ్చినదని యడిగిన నా వడుగు నా భార్యదేయని చెప్పెను. బ్రహ్మచారివి నీకుఁ బెండ్లా మెట్లున్న దనవుడు ఇంకను బెండ్లిఁ జేసికొనలేదు. పిల్ల నింటికిఁ దెచ్చికొని యుంటినని యేమేమో వెఱ్ఱిమాటలం జెప్పెను. అప్పుడు వానియిల్లు పరీక్షించుటకై కొందఱ దూతల నాపల్లె కుం బంపెను. వాండ్రు పరీక్షించి వచ్చి దేవా ! వీని యింటిలోఁ దల్లి తప్ప నెవ్వరును లేరు. పది దినముల క్రిందట నొకచిన్న దానిం దీసికొనివచ్చి యింటిలోఁ బెట్టెనఁట. యిప్పు డేమయ్యెనో మాకుఁ దెలియదని గ్రామస్థులు జెప్పిరి ! తల్లి నడిగిన నది నా కొడుకు లేని సమయముఁ జూచి గుఱ్ఱమెక్కి యెక్కడికో పాఱిపోయెనని చెప్పినది. ఇదియే యచ్చటి విశేషములని వానియెదుటఁ జెప్పుటయు నా బ్రహ్మచారి అయ్యో ! నా భార్య పాఱిపోయినదా ? యెంత మోసము ? నే నెట్లు బ్రతుకుదును ? అని యేడువఁ దొడంగెను.

వాని చర్యలన్నియుం బరీక్షించి యున్మత్తుండనుకొని యంతలో వస్తువు దొరకుటచే దొంగయే యనుకొని యేమిశిక్ష విధింపవలయునో యని యాలోచించుచున్న సమయంబున రాజభటులు గొన్ని వస్తువులతో మఱికొందఱ దొంగలం దీసికొని వచ్చి రాజునెదుటఁ బెట్టిరి. ఆ వస్తువులన్నియు లలిత వగుట రాజు వాండ్రనెల్ల గట్టిగా విమర్శించి యా చిన్న దాని మీ రెట్లు తీసికొనిపోయిరి ? ఇపుడెందున్నది ? నిజము చెప్పుడు లేకున్న మిమ్మునందఱ గట్టిగా శిక్షింతునని భయంకరముగాఁ బలికిన నా పాటచ్చరులు భయకంపితాంగులై యా నృపతి కిట్లనిరి.

దేవరా ! మీతో నిజము చెప్పుచున్నాము. వినుండు. మేము తూరుపు సముద్రప్రాంతమందలి యరణ్యములోఁ దిరుగుచుండఁ బదియారేఁడుల ప్రాయము గల యొక చిన్నది గుఱ్ఱమెక్కి వడిగా నెక్కడికో పోవుచున్నది. మేమడ్డయిపోయి కఱ్ఱలు