పుట:కాశీమజిలీకథలు -04.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అని బ్రతిమాలిన నమ్మానవతీవతంసంబు తదీయ గ్రామోక్తులకు మందహాసముఁ గావించినది అదియే యంగీకార సూచకమని యుబ్బుచు నా బ్రహ్మచారి తల్లి తోఁ జెప్పి పంచాంగము విప్పిచూచి పెదవి విరచుచు, అమ్మా ! యిది శూన్య మాసము. ముందు మాసములో మూఢమి వచ్చినది. ఆపైమాస మధికమాసమైనది. ఇఁక మూఁడు మాసములదనుక శుభముహూర్తములు లేవు. ఇదియు నా కర్మమే కాఁబోలునని వగచిన వారించుచుఁ దల్లి 'నాయనా! మంచి ముహూర్తముకానిదే పెండ్లి యాడఁగూడదు. ఇంతకాల మాగి యిప్పుడా తొందర ? మూడుమాసము లనఁగ నెంత ? కన్నులు మూసికొనిన రాఁగలవు. పిల్ల మనయింటనే యుండునుగదా' యని పలికి యోదార్చినది. మఱియు నా వాల్గంటి వారింట నుంట యెఱింగి -

సీ. పంచాంగమున్నదా • బాపఁడా ? యీవేళ
               వర్జమెప్పుడంచు • వచ్చునొకఁడు
    రమ్ము వేగము తద్ది • నమ్మఁట ననుఁగాపు
               పంపించెనని పిల్వ • వచ్చునొకఁడు
    నాకు శోభనపు ల • గ్నము మంచి దుంచఁగా
               వలెనంచు నడుగంగ • వచ్చునొకఁడు
    ఏదిచూతము లెస్స • యే ! మీగృహం బని
               పల్కి లోపలఁజూచి • వచ్చునొకఁడు

గీ. దుడుకుతనమున నందున్న • పడుచురెడ్డి
   కొడుకులెల్లరు నిత్యంబు కులుకుగబ్బి
   గుబ్బలాడిహొయల్ గనుం • గొనెడువేడ్కఁ
   గపట మూహించి వటుఁ • డల్కఁ గసరుచుండ.

ఆ యలజడి యంతయుంజూచి యా చిగురుఁబోడి యందుండుట కష్టమని నిశ్చయించి యొకనాఁడు బ్రహ్మచారిం జీరి యోయీ ! బ్రాహ్మణుఁడా ! మొన్న మఱ్ఱి చెట్టుక్రింద నా గుఱ్ఱమును విడిచివచ్చితిని. అది యా ప్రాంతమందే మేయుచుండును. తీసికొనివచ్చి యీ వాకిటఁ గట్టివేయుము. వెలగలదానిని విడువనేటికని చెప్పిన బ్రహ్మాండము ధారవోసినంత సంతోషింపుచు నతండు దల్లి యొద్దకరిగి అమ్మా ! ఆ చిన్నది నాతో మాటాడినది సుమీ ! అప్పుడే పనులకు నియోగింపుచున్నది చూచితివా? గుర్రమును దీసికొని రమ్మన్నదని చెప్పిన నామె నాయనా ! క్రొత్తగనుక రెండు దినములు సిగ్గుగా నూరకున్నది. మాట్లాడ కేమిచేయును ? పెండ్లాము మాటలు విని నన్ను మాత్రము వేరుబెట్టకుమీ యని పలికినది.

తరువాత నావడు గప్పుడేపోయి యా యరణ్యమంతయుఁ దిరిగి యా గుర్రమును దీసికొనివచ్చి వాఁకిటఁగట్టిపెట్టెను. అప్పు డా చిన్నది తన చేతనున్న రత్నకంకణముదీసి వానికిచ్చి యో విప్రుడా ! పాపము నీ యొద్ద సొమ్ములేనట్లున్నది.