పుట:కాశీమజిలీకథలు -04.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోవిందుడను బ్రహ్మచారి కథ

227

జేసి వేరొకతెరువుఁ గానక మంచిది మీ యింటికివత్తు పదమని పలికిన, వాఁడు మూపు లెగరవైచుచు నా చిన్న దానిం దనయింటికిం దీసికొనిపోయెను.

"అమ్మా ! యీ చిన్నది మహాలక్ష్మివలె మనయింటికి వచ్చినది. ఆఁకటికిఁ దాళలేదు పెందలకడ వంటఁజేసి పెట్టుమని" చెప్పిన వాని తల్లియుఁ ద్రుటిలో వంటఁజేసి యామెకు భోజనము పెట్టినది. పిమ్మట గోవిందుఁడు రహస్యముగాఁ దల్లి తో "అమ్మా ! యీ చిన్నదానికి దిక్కె వ్వరు లేనట్లున్నారు. నా పుణ్యము నేఁటికిఁ బండినదేమో విఘ్నేశ్వరునికిఁ దప్పక టెంకాయలు కొట్టవలయును సుమీ. మంచి మాటలు చెప్పి నన్నుఁ బెండ్లి యాడుమని బోధింపుము. ఇదియే పెండ్లియాడినచో మన మొక్క వస్తువు పెట్టనక్కరలేదు. అన్నియు దానిమేన నున్నవి. ఇంతకన్న మంచి సంబంధము మనకు దొరక' దని బోధించెను.

అమెయు నా చిన్న దానితో 'పొలఁతీ !' నీ పేరేమి ? మా పిల్లవాఁడు నిన్నుఁ జాల మెచ్చుకొనుచున్న వాఁడు. ఇదివఱ కెందఱో పిల్లల నిత్తుమని వచ్చిన సమ్మతింపలేదు. వాని తెలివితేట లెటువంటి వనుకుంటివి. పీటపైఁ గూర్చుండి పెండ్లి చేయించుచుండ నొరులు నోరెత్తఁగలరా? మాకు మూడుగ్రామము లున్నవి. బియ్యము, కూరలు బట్టలు సంవత్సరమునకుఁ జాలినన్ని దొరకును. నీవు వీనిం బెండ్లి యాడితివేని చాల సుఖపడుదువు. పొంగిన పాలమీఁది నీరుపోయనక్క ఱలేదు. నీ యిష్టమువచ్చి నట్లు మెలంగవచ్చునని యెన్నియో బోధించిన నామె మాటలు వినినంతఁ జింతాకుల స్వాంతమగు నా యింతికే నవ్వువచ్చినది.

వటపాదపారణ్యము దాపుననున్న పల్లె యదియని యటకు మనోహరుండు వచ్చునను తలఁచి లలిత యెక్కడికిఁ బోవుటకుం దోచక కొన్ని దినంబులు వారి యింటనే యున్నది. ఆ బ్రహ్మచారి మఱియొకనాడాఁ చేడియ నుద్దేశించి -

సీ. అవునషే మాటాడ • వదియేమి నీకునే
             ననుకూలవరుఁడఁగా • ననియ ? లేక
    కాపురంబిదిచక్క • గా లేదనియ ? కాక
             ధనధాన్యములు చాల • వనియ ? చెప్పు
    చేడెరో ? ననుఁ బెండ్లి యాడిన ఘనపురో
             హితురాల వగుదువే • ప్రతిదినంబు
    నాబ్దికంబులవచ్చు • నట్టి బియ్యము పిండి,
             కాయగూరలును గో • కలును రూక

గీ. అతివ ! నీయిచ్చవచ్చిన • యట్లుచేసి
   కొమ్మ యిఁకమీఁద నిలుదిద్దు • కొమ్మ కొమ్మ
   యరయ నీ చేతికడ్డు ర • వ్వంతలేదు
   దొరకనేరదు మంచి కా • పురము నీకు.

. .