పుట:కాశీమజిలీకథలు -04.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

కిరువదియేండ్లు వచ్చినవి. పెండ్లి కాలేదు. భార్యతోఁ బీటలపై గూర్చుండు భాగ్యమెట్టి పుణ్యము జేసికొన లభించునో ? అయ్యో ! యూరేగు మనసైన దీరినదికాదే. పేరులు సెప్పుమని పేరంటాండ్రు నిర్బంధింపఁ జిఱునగవుతోఁ బెండ్లి కూఁతురు చెప్పినంగాని చెప్పనవి వారి నూరించు సంతోష మెట్టి పుణ్యమున సంప్రాప్తించునో! ఆహా ! శోభన దినంబునఁ బేరంటాండ్రు నవ్వుచుండ శయ్యపై గూరుచుండి భార్యచే గంధము పూయించుకొనువానిదే జన్మ. సీ: నా జన్మము కాల్పనా, ఇఁక నాకీ పుట్టుగునఁ బెండ్లి కాదు. ఈ పౌరోహిత్యమున సంపాదించిన బియ్యము, కాయగూరలుఁ నంగ వస్త్రములు నేమిచేయుదును ? నా రవికెలు, చీరలు కట్టుకొని యానందించువారెవ్వరు ? అని విచారించిన విని వానితల్లి నాయనా నీకెన్ని యేండ్లున్న వని పెండ్లి కిఁ దొందర పడియెదవు ? నిన్నకాక మొన్నటివాఁడవు. కళ్యాణమువచ్చిన పెండ్లి యాగునా ? యని యోదార్చిన వాఁడిట్లనియె.

చాలు చాలు. మంచిదానవే. నాకంటెఁ జిన్నవారలు రెడ్డికొడుకులు, వాండ్ర భార్య లెంతయున్నారో చూచితివా ? పెక్కులేల ? రెడ్డికాపు పాలికాపు జానెడులేఁడు. వానికిసైతము పెండ్లియై భార్య కాపురమునకు వచ్చినది నేనామాత్రము నోఁచనై తినని నిత్యము విచారింపుచుండును. ఆ బ్రహ్మచారి నాఁడు జాముప్రొద్దెక్కిన తరువాత నాకులు కోసికొనిపోవుటకై యా మఱ్ఱిచెట్టు దాపునకువచ్చి ముందరను,

సీ. ముకురద్యుతికపోల • మకరికాలతలతోఁ
               గమ్మకస్తురిచిత్ర • కమ్ము చెదర
    వక్త్రగంధానుధా • విన్మిళిందముతోఁ
               గప్పుపెన్నిరికొప్పు • గంపమొందఁ
    గర్ణికాకుసుమ రిం . ఖస్మరందములతో
               నిడువాలుతమదోయి • నీరుచిలుక
    గళదనర్గళఘర్మ • కలెపరంపరలతో
              నరుత ముత్తెపునరుల్ • దొరసియాడఁ

గీ. దీనవక్షోరుహము లే • గొనుఘన ని
   తంబమలరం నడుగులు • దడబడంగ
   నిలిచి నలుదెసలీక్షించు • లలితఁగాంచెఁ
   బరమ సంతోషకలితుఁడై • బ్రహ్మచారి.

కనుంగొని మనంబునఁ బలుతెఱంగుల సంతసించుచు నమ్మించుఁ బోఁడిని సమీపించి యబ్బురపాటుతో "బోటీ ! నీ వెవ్వతెవు ? నీ పేరేమి ? యెందుండి వచ్చుచుంటివి ? మా గ్రామ మీ బ్రాంతమందే యున్నది. నేను బ్రాహ్మణుడను, బహ్మచారిని, నాకుఁ దల్లికాక దిక్కెవ్వరునులేరు. మా యిల్లీ ప్రాంతమం దేయున్నది. భోజనసదుపాయము గావింతు" మని పలికిన విని యక్కలికి యాకలిగొనియుండుఁట