పుట:కాశీమజిలీకథలు -04.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

సెట్టి -- ఓరీవెధవా ? దొడ్డిగుమ్మముదగ్గరకు వెళ్ళి పిలువమనిన వీధి గుమ్మముదగ్గరకు వెళ్ళినావఁటరా ? తరువాత.

నరసి - అప్పుడు పారిపోయి నేను వచ్చుచుండగా దొడ్డిగుమ్మమున అప్పివచ్చి నాతో శెట్టిగారిని మరిడమ్మ గుడిదగ్గి రుండమని చెప్పుము. నేను తీసుకొ'ని వచ్చుచున్నానని చెప్పినది.

సెట్టి – ( మేనుప్పొంగి) ఆమాట చెప్పినదికదా ! సరే ! ఆమనిషిని నీవు చూచినావురా?

నరసి - ఆయెర్రనావిడేనాఅండి ? చాలా చిక్కివున్నది బాబూ !

సెట్టి - అవును అబ్బా : చిక్కియున్నను దానియందము చెప్పనలవి కాదురా ?

నరసి – ఆవిడ ఆ భేమ్మడి పెండ్లామేనా అండి ?

సెట్టి - ఆయని పెండ్లామైతే యిన్ని చిక్కులు పడనేల ? మన యింటికే రప్పించుకొందును. కాదు వారింటికి వచ్చింది బంధుగురాలఁట దానికొరకు రెండునెలల నుండి ప్రయత్నముచేయుచున్నాను. ఇందు నిమిత్తమై ఆయన భార్యకు వేయి రూపాయలు వెలఁగల రవ్వలజోడు పంపినాను. ఇంకా చాలదనుచున్నది.

నరసి — ఆమెను మొదట మీరెట్లు చూచినారు బాబూ ?

సెట్టి - శివరాత్రినాఁడు రాత్రి కోటీశ్వరుని యాలయములో దేవతా దర్శనము చేయుచుండగాఁ జూచితిని. నాఁటినుండి యీలలు తీసి నేఁటికి వశపరచు కొనుచున్నాను. అలుకు డగుచున్నది. వచ్చుచున్నా రేమో చూడు.

నరసి - (చూచివచ్చి) బాబూ ! వస్తున్నారు.

సెట్టి - నీవు కొంచెము చాటుగా నుండుము.

నరసి - చిత్తము బాబూ ! (అని గుడివెనుకకుఁ బోవుచున్నాఁడు)

అప్పి - (ప్రవేశించి మెల్ల గా) శెట్టిగారూ !

సెట్టి - ఏమేవు. ఇక్కడ. ఇక్కడ. ఈలాగునరా తీసికొనివచ్చితివా ?

అప్పి - అబ్బా : మీ నిమిత్తమెన్ని పాట్లు బడితినండి యేది నాకు బహుమతి ?

సెట్టి - రానీ యింతలో తొందర పడియెదవేల ?

అప్పి - ఎప్పటిదప్పుడే. ఇప్పుడు నాకు పనియున్నది.

సెట్టి - (నాలుగు రూపాయలు చేతిలోపెట్టి) ప్రస్తుతమింతే ఇచ్చితిని. రేపు మాయింటికి రా.

అప్పి - చాలు. చాలు. నీబారీ తెలిసినది. ఇదియా ? ----------- అని మీదఁ బారవైచుచున్నది)