పుట:కాశీమజిలీకథలు -04.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అక్కడఁ గదలి రేవానగరంబున కరిగి యందాఱు దినంబు లుండునఁట. ఈ వ్రాతంబట్టిచూడ నతని చాతుర్య మంతయు స్పష్టమగుచున్నది సుమీ యని పలికిన విని లలిత యించుక సిగ్గుతో దీనికి నీవేమనియెదవని యడిగిన నది నీకిష్టమైన సమంజసమే యని యుత్తరముఁ జెప్పినది ఇష్టమైనను జరుగుట యెట్లనవుఁడు బుద్ధిమంతుల కలవి గాని పనులుండునా ? యని మఱలఁ బలికినది. మఱియెప్పు నడ నప్పుడే యని సాంకేతికముఁ జెప్పినది. ఇట్లు వారిరువురు సంభాషించు కొని యొరు లెఱుఁగకుండ నాఁడు ప్రయాణ సన్నాహముఁ గావించుకొనిరి. రాజ కన్యలకుఁ బ్రాయము వచ్చులోపల గుఱ్ఱములెక్కి తిరుగుట నేర్పుదురు గదా, నాఁడు గడియ యొకయుగములాగున వారికిఁ బ్రొద్దు జరిగినది.

లోక బాంధవుం డపరగిరిశిఖర మలంకరించుటయుఁ గ్రమంబునఁ కీఁకటులు కాటుకబూసినట్లు జగం బాక్రమింప నల్లనల్లన లోకులు గాలకృత్యంబులు నిర్వర్తించుకొని శయనమందిరంబునఁ బ్రవేశింప సంతంతఁ దమకృతమోహాతిరేకంబున నొడ లెఱుంగక పడియున్న కాళరాత్రియుం బోలె నారాత్రి నిద్రామోహంబున స్మారకము దప్పి పడియున్న జంతువితతి కలదగుట నిశ్శబ్దంబై భయంకర తమోమయంబై యొప్పుచుండ నారాజపుత్రిక గంటల గణించి యర్ధరాత్రి యయ్యెనని నిశ్చయించి మంచిమంచి రత్న భూషాంబరంబులు సంగ్రహించుకొని తిలకచే నమరింపఁ బడి యుంచిన శృంఖరానిశ్రేణిక నధిరోహించి యాకోటగోడ నవలీలఁ దాటి యవ్వలఁ బడినది.

అంతకుమున్న వాఱువముతో నచ్చేరువ నిలచియున్న తిలక యక్కలికిం బట్టికొని తనరాక నెఱింగించుటయు నమ్మించుఁబోడి "జాగేల వేగమ ముందెక్కుమని" చెప్పి తాను వెనుకనెక్కి కళ్ళెము చేతంబూని పత్రికలో వ్రాసిన మార్గము ననుసరించి గుఱ్ఱమును వడి వడిఁ దోలఁ దొడంగినది. తిలకకు గుఱ్ఱమునెక్కు నలవాటు లేకపోవుటచే వడిగాఁ దోలవలదని లలితను బ్రతిమాల డొడంగినది. కాని వెనుకఁ దమవారు వత్తురను వెఱపుచేఁ దిలక నొకచేతం బట్టుకొనుచు భయపడకుము. కాళులు బిగపట్టుమని పలుకుచుఁ దోలుచుండ అమ్మయ్యో, నే నిలువఁజాల. నాకన్నులు తిరుగుచున్నవి. వమనము వచ్చుచున్నది. నిలునిలుమని మొఱలిడ నాయువిద యొక చోటఁ దత్తడి నిలిపి వెరపుడిపి తిలకను వెనుకదెసఁ గూర్చుండఁ బెట్టుకొని మఱల నాతట్టున వడిగాఁ దొలఁదొడంగినది. తిలక కొంతసే పుగ్గబట్టుకొని అమ్మయ్యో ! ఇఁక నే నిలువఁ జాల నొడలు వివశ మగుచున్నది. నిలుపు నిలువు మని బ్రతిమాలు కొనుచు నంతలో ముర్చనోయెనది. ఆ సంగతి గ్రహింపక యూరకున్నది గదాయని లలిత తురగమును వేగముగాఁ దోలినది.

అంతలోఁ జేతులు పట్టువదలి తిలక జారి యొకచోట నేలంబడినది. కొంత దూరము పోయిన తరువాత నానాతి యా సంగతి తెలిసికొని యడలుచు నశ్వమును