పుట:కాశీమజిలీకథలు -04.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

గుడిలోకి వచ్చునేమో కనుక గ్రామస్తు లందఱు కాచికొని యుండవలయును. అని చాటింపరా!

గం - ఓయిబాబో! అన్నిమాటలు నాకు నోటపట్టునా తగ్గించి చెప్పండి.

బం — మఱేమీవద్దు లవంగి వచ్చువేళయైనది. అందఱు కాచుకొనియుండ వలయును. అని చెప్పగలవా?

గం – ఈమాటు చెప్పఁగలను. (అని యా ప్రకారము వీథుల వెంబడి చాటించుచున్నాఁడు.)

అట్లనేక ప్రకారములఁ జెప్పుకొనెడు ప్రజలమాట లాలించుచు నమ్మించుబోఁడులు తైర్థికులం గలసి నడుచుచుఁ గ్రమంబున విశ్వేశ్వరు నాలయంబున కరిగిరి. అందు బెక్కండ్రు రాజభటులు గాచియుండి లోనికిఁ బోవువారినెల్ల బరీక్షించుచు నలజడి లేకుండఁ గొంచెముగా జనులవిడిచి లోనివారు వచ్చినతరువాతఁ దక్కువారిం బోనిచ్చుచుండిరి. అప్పుడు సమయమరసి లవంగి చెలికత్తియ లిరువురు ముందు నడచుచు ద్వారపాలురతో 'అయ్యా! ఈతం డొక రాజపుత్రుండు. సమ్మర్ధము సైరింపలేఁడు. స్వామిని సేవించి వచ్చువఱకుఁ బెక్కండ్ర జనుల విడువకుఁడు. మీకుఁ బారితోషిక మిప్పింతు' మని చెప్పి లోపలకుం తీసుకొనిపోయిరి. లవంగి సఖులతోఁగూడ స్తుతిశ్లోకములు జదువుచు మేనుప్పొంగఁ బ్రదక్షిణములు చేయఁ దొడంగినది.

అప్పుడు కుందలతిక మెల్లగా బల్లవపాణి! ఇప్పటికి నీ కోరిక యీడేరినది. ఇంక మనల నాటంకము సేయువారుండరు. గుడిలోనికింబోయి యభిషేకము సేసికొని వేగఁబోవుదమురమ్ము. అడుగడుగునకు నాలస్యము చేయకుమని పలికిన విని యక్కలికి యిట్లనియె. 'మీ బుద్ధిబలమునఁ గార్యసాఫల్యమైనట్లె తలంచెదను. కాని మీరా ద్వారమునఁ జేయడ్డముగాఁ బెట్టికొని కాచియున్న పురుషునింజూచితిరా ? గర్భాలయములోనికిం బోవుటకు నతని యాటంకము గలుగునట్లు తోఁచుచున్నది. నేనదియే పరీక్షించి చూచుచుంటిని. ప్రతి మనుజుని బెద్దగా విమర్శించుచున్న వాఁడు. ఈసారి బడమరదెస కరిగినప్పుడు విచారింపు' డని పలికినది.

ఆ దినమున వీరుం డన్నిద్వారములయందు నితరులను గాపుపెట్టి తాను విశ్వేశ్వర మహాదేవుని గర్భాలయము పడమర గుమ్మమున నిలిచి వచ్చిపోవువారిం బరీక్షించుచుండెను. ఆ జవ్వనులు మువ్వురు నట్లు ప్రదక్షిణములుచేసి ముఖపంటపమునకుం బోయి యందు ఘంటానాదములు చేయుచు వీరునింజూచి బెదరుచు నల్లనల్లన గర్భాలయములోఁ బ్రవేశింపఁబోయిరి. అప్పుడు వీరుఁడు లవంగి చేయిబట్టుకొని నిలు నిలు యవనుండవోలె నుష్ణేషముతో స్వామియొద్ద కరుగుచుంటివేమి? నీ వెవ్వడవని యడిగెను. ఆ మాటలు విని చెలియకత్తియలు ముందరనిలిచి అయ్యా? ఈతండు నేపాళదేశరాజకుమారుండు. తలపాగయు నంగీలును దీసి బయటకువచ్చుట మా దేశా