పుట:కాశీమజిలీకథలు -04.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

రాజు — పోనీ. విద్యలమాట యటుండనిమ్ము . పుష్పహాసుం డెక్కునట్లు గుఱ్ఱ మెక్కి నడిపింపఁ గలవా ?

పుత్త్రు – అయ్యో ! గుర్రమే యెక్కలేనా ? నాతో సమముగా నీ పల్లెవాఁ డెక్కగలడా ?

రాజు - ఎవఁడురా ? అక్కడ మన పెద్ద గుర్రమునకు జీనుగట్టి తీసుకొనిరా?

పుత్త్రు - అబ్బా ! యీ కాలిలో నొప్పిలేకున్న నా ప్రజ్ఞఁజూపుదును గదా. బాబా ! యిప్పుడు వద్దు. మఱియొకప్పుడు చూతురుగాక. అప్పుడు సభ్యులు కడుపుబ్బులాగునఁ దలలువంచుకొని నవ్వుచు రాజు చూచునేమో యని వెఱచుచుండిరి. పుష్పహాసుండును నాపుకొనలేక పక్కున నవ్వెను.

రాజపుత్త్రు --- (కోపముతో) ఏమి నీ కండకావరము. ఏఁటిలో నీటికాకివలె మునుఁగుచుఁ జేపలంబట్టి బ్రతికెడు బెస్తవానికిఁ జదువుఁ జెప్పింపఁబట్టి గదా పోతరించి యట్లు నవ్వుట.

పుష్ప - (ఇంచుక యలుకతో) జాతము దైవాయత్తమైనది. దానిగుఱించి పలుమా రాక్షేపించినం బ్రయోజన మేమి ? పురుషకారమును గురించి మాటలాడ వలయు.

రాజు - (వారించుచు నుపాధ్యాయులం జూచి) దేశికోత్తములారా ! ఇంత కాలమునకు మా వానికి నేరిపిన విద్యయిదియా ?

ఉపా - దేవా ! మే మేమి చేయుదుము ? యువరాజుగారికి జదువు మనినఁ గోపము. ఊరకున్నఁ బరాకు. మందలించిన నభిమానము. గ్రహణశక్తి తక్కువ, యశ్రద్ధ పెద్దది. దబ్బరకు మేరలేదు చదువెట్లు వచ్చునో చెప్పుఁడు.

రాజు - చాలు చాలు మంచివిద్యనేర్పితిరి. అందఱుం బోవచ్చునని పలికి లజ్జావిషాదమేదురహృద యుండై లేచి నృపతి యరుగుచుండ సుందరకుండు బాబా ! యీ పుష్పహాసుఁడు మన రాజ్యము లాగికొని తానే యేలుకొనియెదనని యందరితోఁ జెప్పుచున్నాఁడట వింటిరా ? యని చెప్పిన, సీ! సిగ్గులేక ప్రేలెదవు. నీవంటి పరమ నిర్భాగ్యుఁడు క్షత్రియ వంశంబునం బుట్టిన తరువాత నెవ్వరేమి చేసినం జేయఁ గలరు. పోపొమ్మని పలికి లోపలికి పోయెను పుష్పహాసుం డింటికిం బోయి యా సభావిశేషము లన్నియుం దండ్రి కెఱింగించెను. రాజపుత్త్రుఁడు వానియందు బద్ధ మత్సరుండై యున్న వాఁడని యెఱింగి గుహుఁడు నాఁటంగోలెఁ బాఠశాలకుఁ పోవలదని కుమారునికిం జెప్పెను.

మఱి యొకనాఁడు దైవవశంబున రెండవ కంకణముగూడ వెనుకటివలె గుహునకు మత్స్యగర్భంబునం దొరికినది. దానిం గొడుకున కిచ్చి నాయనా ! దీనిం