పుట:కాశీమజిలీకథలు -04.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుష్పహాసుని కథ

213

పుష్ప - వట్టిది. దేవా ! అది స్వకపోలకల్పన. నేనాయన కన్న నధి కుండనా ?

రాజు - మీ యిద్దఱి విద్యాపరిశ్రమము చూతము. శాస్త్రములోఁ గొంచెము ప్రసంగముఁ జేయుఁడు.

పుష్ప - చిత్తము. ఏ శాస్త్రములోఁ బ్రసంగింతము.

రాజు - చిరంజీవి ! నీ యభినివేశ మెందు ? తర్కము యుక్తి యుక్తముగా నుండును. దానిలో నీవు మొదటఁ బూర్వపక్షముఁ జేయుము.

పుత్త్రు - సీ ! పాడుతర్కము దానిపేరు సెప్పిన నా కసహ్యము.

రాజు - పోనీ, వ్యాకరణమునఁ ! బ్రసంగింపఁ గలవా ?

పుత్త్రు – సందేహ మేలా ?

రాజు – ఏదీ. చక్కగా ననువదించి పూర్వపక్షము చేయుము.

పుత్త్రు - సరే. పుష్పహాసా ! నా యెదుటికిరా. “అత్తునకు సంధి బహుళము" అని చెప్పియున్నారుగదా ? మేనత్త మేనియత్త‌ యనినట్లే చింతాకు , చింతియాకు అని యేల చెప్పగూడదో చెప్పుము.

(అందఱు) పకపక నవ్వుచున్నారు).

పుష్ప - మిత్రమా ! బాలురు చదుకొనెడు తెలుఁగు వ్యాకరణము నడిగెద వేల ! పాణినీయ వ్యాకరణమం దడుగుము. ఇది పరిహాసముకాదు.

సుందరకుఁడు – ఇది మాత్రము వ్యాకరణము కాదా యేమి ? నా యిష్టమైనదానిలో నడిగెద, వానికి నీ యాజ్ఞ యేల ? తెలిసినఁ జెప్పుము. లేకున్న రాదనుము.

పుష్ప - దీనిలో నేమియున్నది ? బహుళ మనుటచేతనే చింతాకు, అనుచోట వైకల్పికము లేదని తేలుచున్నది.

సుంద — బహుళ మనఁగా నేమి ?

పుష్ప - ఒక్కొకచోటఁ గలిసి యొక్కకచోటఁ గలియనప్పుడు బహుళ మని ప్రయోగింపబడును.

సుంద – అది కాదు. నీకు దాని యర్థమే తెలిసినది కాదు. రెండు విధములుగా వచ్చునదే బహుళము.

పుష్ప - (తెల్లపోయి సభవంకఁ జూచుచున్నాడు.)

రాజు - చాలు చాలు. నీ ప్రసంగము వినసొంపుగానే యున్నది. నీ వక్తృత్వము తెల్ల మగుచున్నది. పరిహాసము మానుము.

పుత్త్రు - తండ్రీ ! నేడు నా మది వేడుకగా లేదు. అందుమూలమున నిట్లు పరిహాసముగా మాటాడుచున్నాను.