పుట:కాశీమజిలీకథలు -04.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

మందు మంచి నేర్పుకుదిరినది. ఇంతవఱకు వీఁడు మన బాఠశాలలోఁ జదువు చున్నాఁడా ? మన చిరంజీవితో సహాధ్యాయిగా నున్నవాఁడు గాఁబోలు చిరంజీవి యిట్లు గుఱ్ఱమెక్కఁగలఁడా యని యడిగినఁ గింకరుఁడు దేవా ! యువరాజుగారు గుఱ్ఱ మెక్కగా మేము చూడలేదు. పుష్పహాసుఁడు తఱచుగఁ గనంబడుచుండును. వీని కింకఁ జాలవిద్యలలోఁ బ్రవీణత గలదని చెప్పుకొనియెదరని పలికిన విని రాజు సరే నీపుపోయి పుష్పహాసుని సుందరకుని వెంటనే సభకుఁ దీసికొనిరమ్మని యుపాధ్యాయులతోఁ జెప్పుము పొమ్మని పలికి నగరికరిగెను.

రాజశాసనమువిని నాఁటిమధ్యాహ్న ముపాధ్యాయులు శిష్యులు నిరువుర వెంటఁబెట్టికొని యోలగంబున కరిగిరి. ఆ దివసమునఁ బుత్రు విద్యాపరిశ్రమముఁ బరీక్షింపఁ తలంచి పెక్కండ్రఁ బండితుల రప్పించి మంత్రిసామంతహితపురోహిత వితతి సేవింప నిండు కొల్వుండి యా భూపాలుండు పాఠశాలనుండి వచ్చిన కుమారుం గారవింపుచుఁ బుష్పహాసు నాదరింపుచు వారి నమస్కారంబులం గై కొని దీవించి యుచితాసనములఁ గూర్చుండఁజేసి తొలుతఁ గుమారునితో నిట్లనియె.

రాజు - వత్సా ! నేను రాజకార్యవ్యగ్రతచే నీవిద్యావ్యాసంగమును గఱించి యించుకయు విమర్శింపనై తి. ఏయేవిద్యలం జదివితివి ? ఏయేవిద్యలందుఁ బ్రావీణ్యము గుదిరినది ? విశేషించి శస్త్రాస్త్ర విద్యలయందు గజాశ్వారోహణలయం దెక్కుడు పరిశ్రమము జేసితివా ?

పత్త్రుఁడు – తండ్రీ ! నీ యొద్ద నబద్ధము చెప్పనేల ఈ యుపాధ్యాయులు పల్లెవానియం దెక్కుడు పక్షపాతము గలిగి నాకుఁ దిన్నఁగావిద్యలం గఱపినారుకారు. దానంజేసి మీతోనేమని వక్కాణింతును.

ఉపాధ్యాయుఁడు - (భయముతో) ఏమిరాజపుత్త్రా ! అసత్యములాడు చున్నావు? నీయెడ మే మేమికపటముఁజేసితిమి? నీకంటె వాఁడెక్కుడువాఁడా! రాజా ! మేమిరువురకు సమముగానే చెప్పితిమి.

రాజు - సరే పోనిండు. వీని కేయేవిద్యలం గఱపితిరి ?

ఉపా - అన్ని యుం జెప్పితిమి.

రాజు - పుష్పహాసా ! పెద్దవాఁడవై తివే. ఈ యుపాధ్యాయులు నీవు కోరిన విద్యలన్నియుం జెప్పిరా ?

పుష్ప - (లేచి నిలువంబడి) దేవర యనుగ్రహము గలిగియున్న గొఱంత యేల గల్గెడిని ? దయతో గురువులన్నియుం జెప్పిరి. చదివితిమి.

రాజు - సుందరకుఁడు నీతో సమముగాఁ జదివెనా ?

పుష్ప - చదివిరి.

రాజు - గరువులు నీ యెడఁ బక్షపాతముఁ జేసిరని చెప్పుచున్నాడే మో?