పుట:కాశీమజిలీకథలు -04.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుష్పహాసుని కథ

211

సంతసించితిమి. నీకెద్దియేని యభీష్టముండిన వక్కాణింపుము గ్రక్కునందీర్తు ననవుడు నాగుహుఁడు సామీ ! కోరికతోడనే మీ దర్శనమునకు వచ్చితినికాని మంచిసమయమైనదికాదు. నా యిచ్చిన వస్తువు దేవరకు విచారమేకాని, సంతోషము గలుంగఁ జేసినదికాదు. మఱియొకప్పుడు దర్శనము కావింతు నిప్పటికి సెలవియ్యుండని వేఁడిన నప్పుడమిఱేఁ డిట్లనియె. ఓహో ! యట్ల నవలదు. నీ విచ్చిన కంకణము మాకు హృదయస్థానమైనది. అట్టి సంతోషము మరియొక టేదియుం గలుగఁజేయనేరదు. నీకామితము తెలుపుము సంశయింపకుమని పలికిన గుహుండు, సామీ ! నా కీ కుఱ్ఱవాఁడు లేకలేక కలిగెను. మిక్కిలి గారాబముగాఁ బెనుచుకొనుచున్నాను. వీఁడేది కోరినను దెచ్చి యిచ్చుచుంటి. నిప్పుడు నా కలవికాని కోరికలు కోరుచున్నాఁడు, ఎట్లు తీర్తును ? వినుండు. తనకిప్పుడు గొప్పగొప్పసదువులు సెప్పింపు మని నిర్బంధించుచున్నాఁడు. అవి యేమియో నాకుఁ దెలియవు. చిన్నబడి గురువులు దనకుఁ బనికిరాఁరట. దేవరవారి పాఠశాలలోఁ జదువుకొనునఁట. వీనికిఁ జదువు చెప్పింప దేవరం బ్రార్థింపుచున్నానని కోరిన నవ్వుచు యాభూపతి యౌరా ! పల్లె పిల్ల వాని కెట్టి కోరికలున్నవి ! కానిమ్ము. వీని రూపమునకుఁ దగిన విద్య కావలసినదే; అవశ్యమట్లే చెప్పించెద. పాఠశాల కనుపుచుండుమని చెప్పి తన పుత్రునితో సమముగా వాఁడు కోరిన విద్య లన్నియుఁ జెప్పుఁడని యుపాధ్యాయుల పేర పత్రిక వ్రాసియిచ్చి యారాజు సభ చాలించి యంతఃపురమున కరిగెను.

గుహుఁడు పుత్త్రునితో నింటికిం జని మంచిముహూర్తము దెలిసికొని పుష్పహాసునిఁ బాఠశాల కనిపెను. అది మొద లా బాలకుండు ప్రతిదినము విడువక బడికిఁబోయి క్రమంబునఁ గావ్యనాటకాది గ్రంథముల తర్కవ్యాకరణాదిశాస్త్రములం జదివి సంగీతకళావైదుష్యము సంపాదించి యశ్వగజాందోళికారోహణక్రీడా వై దగ్ద్యము గలిగి శస్త్రాస్త్ర విద్యాపరిశ్రమ యందెక్కుడుగాఁ బనిచేయుచుఁ బడులలో నన్నిటిలో నఖండపాండిత్యము సంపాదించి యసమాన ప్రజ్ఞాదురంధరుండయ్యెను. పుష్పహాసుని విద్యాగ్రహణ సామర్థ్యమునకు మనీషా కౌశల్యమునకు నుపాధ్యాయులు మిక్కిలి యక్కజపడజొచ్చిరి. రాజనందనుఁడగు సుందరకుఁడు పుష్పహాసునితో నన్ని విద్యలుం బాఠము జెప్పుకొనియెనుగాని యొక్కదానియందైన నించుకయుఁ బ్రవేశము గలిగినదికాదు.

ఇట్లుండ నొకనాఁడు ధనంజయనృపాలుం డేమిటికొ రాజమార్గంబున నరుగుచుఁ దురంగమ మెక్కి యతివిచిత్రవేగ గమనంబున వచ్చుచున్న పుష్పహాసుం జూచి వెరఁగుపడుచు నీ యశ్వికుండెవ్వఁడని పరిచారకు నడుగుటయు వాఁడు 'దేవరా ! వీఁడు గంగయొడ్డుననున్న గుహుండను పల్లెవాని కొడుకు. వీని పేరు పుష్పహాసుఁడు. దేవరయే వీనికి విద్యఁజెప్పించుచున్నారు. మఱచితిరా ?' యని చెప్పిన నప్పుడమిఱీఁడు స్మరణమభినయించుచు నోహో ! వీఁడా ? యెంత వాఁడయ్యెను ? వీని కశ్వారోహణ