పుట:కాశీమజిలీకథలు -04.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలభాషిణి కథ

207

నీ కృత్యమనుటయు నది వల్లె యని పలికి సంవర్త వారి వాహ గర్జాసదృశముగా నట్టహాసముఁ జేయుటయు నా ధ్వని వినిన ప్రజలెల్లరు మూర్చ మునింగి పెద్ద తడవునకుఁ దెప్పిరిల్లిరి. అప్పు డతండయ్యో ? నీ విట్లు లోకపద్రవకరముగ నఱవకుము. వెఱపుగలుగచున్నది. నీ కంఠ ధ్వని ప్రళయ సమయ స్తనితమునకు మూఁడుమడుంగు లెక్కుడుగా నున్నది. కావున నోరు మెదల్పక నీ పనిఁగావించుకొని రమ్ము . పొమ్మని పలికిన నా రక్కసి యెక్కుడు జనంబున నరిగి తన్నుఁ జూచి ప్రజలెల్లఁజెల్లాచెదరై పాఱిపోవఁ జంద్రగుప్తుని కోట నవలీలం దాటి రాజమందిరములో నున్న యా నరేంద్రుంబట్టికొని పిడికిటం బెట్టి యడ్డమువచ్చిన వారి గొట్టుచుఁ బిమ్మట జెటసాలనున్న కీర్తికేతుని నిగళంబులు విడఁగొట్టి నెత్తిపై వేఱొక దెసం బెట్టుకొని విజయభాస్కరుని పాదమూలమునం జేర్చినది.

అప్పుడు భాస్కరుండు చంద్రగుప్తుం జూచి రాజా ! నిన్న నేమేమో బీరములు పలికితివఁట. ఇప్పుడేమనియెదవు ? మా తండ్రిని విడుతువే ? యనుటయు నా రాజు తలవంచుకొని యూరకొనియెను. పిమ్మటఁ గలభాషిణి వచ్చి తండ్రికి నమస్కరింపుచు జనకా ! యీయన మీ యల్లుఁడు సుమా ! తొలుత నన్ను దొంగల వలనఁ గాపాడిన మహాత్ముండితండే. దైవకృపచే నేనీ రాజపుత్రునే భర్తగాఁ బడసితినని యా వృత్తాంత మంతయుం జెప్పిన విని యా నృపతి యపరిమితానందముఁ జెందుచు నతనిం గౌఁగిలించుకొని మహాత్మా ! నిన్నెఱుంగక యవమాన పఱచిన తప్పుఁగావుము. నా కారీతినే సందేశముఁ బంపినచో నింత యేటికి వచ్చును ? ఇంతకు మత్పురాకృత సుకృతము ఫలించినది. నిన్నల్లునిగాఁ బడసితినని పెక్కు తెఱంగుల వినుతించెను. తరువాతఁ గీర్తికేతుండు విజయభాస్కరుని వాని తల్లిం జూచి యెఱింగి మిగుల నానందముఁ జెందుచుఁ దానువారికి గావించిన యవమతికి సిగ్గుజెంది యేమియుం బలుకక నమ్రవదనుండై యున్న, విజయభాస్కరుండు తండ్రికి నమస్కరింపుచు ప్రక్కనున్న తమ్ముని గ్రుచ్చియెత్తి తా నిల్లు విడిచినది మొదలునాఁటి తుదవఱకు జరిగిన కథ యంతయు వారికెఱింగించెను. కీర్తికేతుండును దనకుఁదాన నిందించు కొనుచుఁ బుత్రు చేయి పట్టుకొని తండ్రీ ! నీవే మా తండ్రి కీర్తిం నిలిపితివి. నేను పాపాత్ముండ రాజమ్మున కుర్హుండకాను. ఇఁక నీవే యేలికొనుమని పలుకుచు దనపాదంబులంబడియున్న జారుమతి లేవనెత్తి గౌరవించుచు ననునయ వాక్యములచే నాయింతి సంతాపము వాయ జేసెను. పిమ్మటఁ జంద్రగుప్తుఁడు మిగుల వైభవముతోఁ గలభాషిణికి భాస్కరునికిని వెండియుఁ బాణిగ్రహణ మహోత్సవము జరిగించెను. ఆ యుత్సవమునకుఁ జంద్రావలోకుఁడు యశస్కరుఁడు చతురంగ బలపరివృత్తులైవచ్చి పరిచారుకులవలె భాస్కరున నుపచారములు చేయదొడంగిరి.

ఆ యుత్సవ దినములలో నొకనాఁడు నిగమశర్మతండ్రి రాజపుత్రునొద్దకు వచ్చి మహాత్మా ! వల్లనాఁడు మా యింటబసఁజేసి మా దారిద్ర్యముఁ భోఁగొట్టదలంచి