పుట:కాశీమజిలీకథలు -04.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

ఆ మాట నేఁటి వఱకు నాకు జ్ఞాపకము రాలేదు. ఔరా ! దైవ మెట్టి సంఘటనలు గావింపుచుండెనో చూడుము. అని వెరఁగుపడుచు దాను సముద్ర మందిరము విడిచినది మొదలు నాఁటివరకు జరిగిన కధ యంతయు హేమప్రభకుఁ తెలియజేసి కలభాషిణియుఁ దల్లియు నున్న సత్రమందిరమునకుఁ దీసికొనిపోయి వారికిం జూపెను.

కలభాషిణియు హేమప్రభయుఁ జూచుకొని యొండొరుల రూప రేఖా విలాసములకు విస్మయ మొందఁజొచ్చిరి చారుమతి హేమప్రభను గాంచి మిగుల నానందించుచు నెక్కుడుగా గారవించినది నాఁటిరేయి తమ తమ మాటలం జెప్పుకొనుచుఁ బరమానందముతో వారు త్రుటిగా వెళ్ళించిరి. అమ్మరునాడు విజయభాస్కరుండు హేమప్రభతో యువతీ ! ఈ చంద్రగుప్తుండు మా తండ్రిని జెఱఁబెట్టెను. అతనితోఁ బోరు గావింపవలసియున్నది. ఇట్టి సమయమున మీరిందుండరాదు. సముద్ర మందిరమునకు బోయి యుండుడు. సంగరంబున విజయంబు గై కొని మిమ్ము వెండియుం బిలిపించెదనని పలికిన విని యక్కలికి యిట్ల నియె.

నాథా ! మీరతి ప్రయాసపడి బవరముఁ జేయనేల ? మీ దాయ చంద్రగుప్తుని బంధించి మీ పాదమూలమున నశ్రమంబునం జేర్చునట్లు నేను నియమించెద వినుండు. మా మందిరములో గిరిమస్తక యనుసార్ధక నామముగల రక్కిసియున్నది. దానిని జూచిన దేవతలు సైతము వెఱచుచుందురు. అది మేము చెప్పినట్లు చేయు చుండును. దాని యునికి చేతంగదా మా యవ్వకు వేల్పులు దాసులైరి. అద్దానినిప్పుడు రప్పించెదను. అది నీ పంచినట్టు చేసి విజయము గావించెడిని. మనము తలపువ్వు వాడకుండ నిందే యుండవచ్చునని చెప్పి యతం డొడంబడిన పిమ్మట దానిం దీసికొనిరా నా విద్యాధరి సముద్ర మందిరమునకుం బోయెను.

ఆ లోపల భాస్కరుండు "కీర్తికేతుండు తనకుఁ దండ్రి యనియు నతని సపుత్త్రకముగాఁ దీసికొని వచ్చిఁ తప్పుచేసితినని పలుకుచు నా చెంత విడువలయు ననియు నొక రాయబారము నంపెను. చంద్రగుప్తుడా మాట విని యకసక్కెము లాడుచు నిట్టి రాయబారము మఱియొక మారు పంపితివేని యపరాధముగా నెంచి శిక్షింతుము. ఇది మొదటి తప్పుగానెంచి మన్నించితిమని తిరుగ వార్త నంపెను. అంతలో హేమప్రభ గిరిమస్తకం దీసికొని వచ్చి యతని యెదుటం బెట్టెను. దాని కరచరణాద్యవయములు సామాన్యముగా నున్నవి. శిరమొకటియే గిలియంత యున్నది. అది యా శిరముతో వ్రేసినంత పర్వతములైనను నుగ్గయిపోవును. దాని వదనబిలము పెనుగుహవలె నొప్పుచుండును. అట్టి రక్కసిం జూచి భాస్కరుండు విస్మయ సాధ్వసంబులు మనంబున నావిర్భవింప దానికిఁ జేయవలసిన కృత్యమిట్లు బోధించెను.

గిరిమస్తకా ! నీ యాకృతిఁ జూచినంత నెంతవారికిని స్వాంతమున భీతి కలుగక మానదు. నీవు ప్రజల జోలికిం బోక యెదుర్కొనిన వీరభటులనైనఁ జంపక పరిభవించుచుఁ జంద్రగుప్తుని బంధించి నా యొద్దకుఁ దీసికొని రావలయు నిదియే