పుట:కాశీమజిలీకథలు -04.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలభాషిణి కథ

205

తలంచుచుఁ 'గొమ్మా ! పరపురుషుల నిట్లంటవచ్చునా ? దురితముగాదా ? నీవు వుత్తమురాలవని తలఁచి వచ్చితిని కాదే ?" యనుటయు నవ్వుచు నా జవ్వని యిట్ల నియె.

ప్రాణేశ్వరా ! నన్నన్యఁగా దలంచుచుంటివా ? కాను కాను. నీ దాసురాలను హేమప్రభను; దైవానుగ్రహ మిట్లు గలిగినదని పలుకఁగా, ఏమేమీ ! నీవు హేమప్రభవే ? ఎట్లు వచ్చితివి ? ఆహా ! యేమి చిత్రము ! నాకీ చీఁకటిలో నిచ్చటికి వచ్చుటకు బుద్ధి పుట్టించినవాఁడు పరమేశ్వరుఁడు కాడా? అయ్యారే ! యెంత చోద్యము అని వెఱఁగుపడుచుఁ గానిమ్ము. నే నిచ్చటికి వచ్చిన విధం బెఱింగింపు మనుటయు నా కలకంటి యిట్లనియె. నాధా ! మీ రరిగిన పిదపఁ బది దినములెట్లో గడిపితిని పిమ్మట క్షణమొక యుగమువలెఁ దోఁచినది. మీ మాటలఁదలచుకొనుచు మీ క్రీడలే చూచుకొనుచు మీ చర్యలే చెప్పుకొనుచు మఱికొన్ని దినములు జరిపితిని. మీరు వత్తునన్న గడవు దాటిన తరువాత విరహాగ్ని పాల్పడితిని. అట్లుండఁగా నొక బ్రాహ్మణ కుమారుండు యీ యుద్యాన వనములో నా చెలిక త్తెలకుఁ గనంబడెను. వానిని జూచి యెవ్వఁడవు ? ఏమిటికి వచ్చితివని వాండ్రడిగిరి. నేను విజయభాస్కరుని మిత్రుఁడను. అతండు తన భార్య హేమప్రభను దీసికొని రమ్మని నన్నుఁ బంపెను. అందులకై వచ్చితినని చెప్పెనట. ఆ మాట విని యా బోటులు సంతోషముతో వచ్చి నాకా తెఱంగెఱింగించిరి. ఇంతింతనరాని సంతోషముతో నేను వానిని రప్పించిభోజన భాజనాది సత్కారము లపూర్వములుగాఁ జేసి సంఖోపవిష్ణుండై యున్న తఱి దాపున నిలువంబడి సఖులచే నీ వృత్తాంతం బడిగితిని.

మీరీ పట్టణములో నున్నారనియు, నన్ను దీసికొనుటకై తన్ను బంపి రనియు, నెన్నియో గురుతులు చెప్పి నా రత్న కంకణముఁ జూపెను. నేను యదార్థ మని నమ్మి రెండుదినములతని నందాపి మిక్కిలి గౌరవింపుచు నేటి సాయంకాలము మీ దర్శన మగునని సంతోషముతోఁ జక్కగా నలంకరించుకొని యా మాయావితోఁ గూడ నా తటాకములో మునిఁగితిని. ఆ క్రూరుచ్చనికిఁ జేరవలయునని నాతో జెప్పుటచే నిట్లు తలంచితిని. వచ్చినది మొదటవాని చర్యలు వేరుగా నున్నవి నా ప్రాణవల్లభుం డేడి ? యెందున్నాఁడు ? చూపుమన నేనూరక తొందర సేయఁగ జీఁకటి పడువఱకు నిదిగో యిదిగో యని జరపి చివరకు స్వర్గస్తుం డయ్యెనని చెప్పుటయే కాక తన్ను బెండ్లి యాడుమని యడిగెను. తరువాయి మాటలుమీరు వింటిరిగద. ఇంతలో దైవము మిమ్ముఁ దెచ్చెను ఇదియే నా వృత్తాంతము. వాఁడెవ్వఁడు ? ఆ కంకణము వానికెట్లు వచ్చినదని యడిగిన నా రాజపుత్రుండు స్మృతి సభినయించుచు నిట్లనియె.

తెలిసినది తెలిసినది. వాఁడీ యూరువాఁడే కలభాషిణినివరించి తద్దాసీ మూలమున నా ప్రోయాలితో శ్రీ శైల ప్రయాణము గావించెను. దారిలోఁ గలభాషిణి నిట్లె బలాత్కారముగా బట్టికొన బోవగానప్పుడు నేనే యడ్డు పడితిని పిమ్మట నీ కథ మా తల్లితోఁ జెప్పుచుండగా వినెను కాఁబోలు. నా కంకణ మెట్లు సంగ్రహించెనో,