పుట:కాశీమజిలీకథలు -04.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

పురు - దుఃఖోపశమనములగు పలుకుల కులికెదవేల ? నన్నుఁ బెండ్లియాడుమని పలికినఁ గోపపడెదవా యేమి ?

స్త్రీ - (పెడమోముతో) సీ! మూర్ఖ! నా చిత్తవృత్తి నెరుంగక మాటాడు చుంటివి ?

పురు - నీవు కామాకులచిత్తవైతివని యెఱిఁగియె యిట్లనుచుంటి తదుప శమన వాక్యములఁ దప్పని యెంచెదవేల ?

స్త్రీ - చాలు చాలు. దాపునకు రాకుము. దూరముగా బొమ్ము.

పురు – (మోహావేశముతో) బోఁటీ! నన్నే మిటికి వే పెదవు? మదనుండు పదనిడిన యడిదమున నా యెడద నడుచుచున్నాఁడు. నీ యధరామృత మిచ్చి నన్ను బ్రతికింపుము (అని కౌఁగిలింపఁ బోవుచున్నాడు.)

స్త్రీ - హా ! దురాత్మా ! నన్నట్లు కపటమునఁ దీసికొని వచ్చి వంచింతువేఁ హా ! వేల్పులారా ! హా ! భాస్కరా ! హా ! సుధాకారా ! హా ! పుణ్యాత్ములారా ! నన్నొక నీచుఁడు బాధింపుచున్న వాఁడు. రక్షింపరే యని పెద్దయెలుంగున మొఱ పెట్టినది.

వారి సంవాద మాలింపుచున్న భాస్కరుఁ డప్పుడు అబలా ! వెఱవకుము. నే నిదిగో వచ్చుచున్న వాఁడనని పలుకుచు వడిగా నచ్చటికిఁ బోయెను. ఆ ధ్వని విని యా పురుషుఁడు పాఱిపోయెను. కనకమణి భూషా విశేషరుచి నిచయంబుల మిరుమిట్లు గొలుపుచు నా చీకటిలో మెఱయుచున్న యా చిన్న దానిని జూచి భాస్కరుండు వెరగు పడుచుఁ బడఁతీ నీ వెవ్వతెవు ? ఈ చీకటిలో నిచ్చట కెట్లు వచ్చితివి? నీ వృత్తాంతము చెప్పుమని యడిగిన నమ్మగువ తత్కంఠ ద్వని గురుతుపట్టి భాస్కరుఁడను సందియముతో నార్యా ! నా వృత్తాంతము చాలా గలదు. సావకాశముగా జెప్పెద. నీవుమదీయ శోకాంధకారము వాయజేయ నరుదెంచిన భాస్కరుఁడవని తలంచెద. ముందుగా నీ వృత్తాంతమించుక చెప్పి శ్రోత్రానందముఁ గావింపుమని సానునయముగాఁ బ్రార్థించుటయు నా రాజపుత్రుం డిట్లనియె.

యువతీ ! నీ మాట వ్యర్థమేలయగును నా పేరు భాస్కరుండే యందురు. నేనొక రాజపుత్రుండ. హేమప్రభయను విద్యాధరిం బరిణయంబై యాయింతి యిచ్చిన కంకణము పాఱవేసికొని తత్సమాగమ శూన్యుండనగుటచే నున్మాదముఁ జెంది యీ చీఁకటిలో నిచ్చటికి వచ్చితిని. నా రత్న కంకణ మెందుఁ బడినదో తెలియదు. అది నీ కిందు దొరకెనేని నా కిమ్ము. అని విచారింపఁ దొడంగెను.

అప్పుడా చిన్నది హా ! మనోహరా ! హా ! పురుషప్రవరా ! యని పలుకుచు నతని కంఠము బిగ్గఁ గౌఁగిలించుకొన్నది. అత్తఱి రాజపుత్రుఁడు కోపించుచు, సీ ! యీఁయాడు జాతికి వివేకమింతయు నుండదుగదా ! కామాసక్తునిగా దలఁచి యా చిన్నది నన్నుఁ గౌఁగిలించుకొన్నది నా చిత్తశుద్ధి యెఱుంగదు. బుద్ధిఁజెప్పవలయునని