పుట:కాశీమజిలీకథలు -04.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

రహస్యము లన్నియు నందుఁ దెల్లముగాక మానవు. వీఁటిలో నేదియైన వింతపని రాత్రి జరిగినదో లేదో తెల్ల వాఱక మున్నె యా సత్రములో వ్యాపించి యుండును.

ఆ రాజపుత్త్రుడా సత్రములో విచిత్ర చారిత్రము లాకర్ణింపుచు వింతలం జూచుచు నలుమూలలు దిరుగుచుండ నొక దండ గూర్చుండి యాత్మీయకథానుగుణ మైన మాటల బాటసారులు కొందఱిట్లు సంభాషించుకొనిరి.

విదేశీయుఁడు - బ్రాహ్మణుఁడా ! మీ దేగ్రామము ?

బ్రాహ్మణుఁడు - మాది యుజ్జయిని.

విదే - ఉజ్జయిని యన సాహసవిక్రమార్కుని పట్టణము కాదా ?

బ్రాహ్మ - అవును.

విదేశీ - అమ్మహారాజు కుశలియై యున్నవాఁడా ?

బ్రాహ్మ - అతం డుండిన మాకీకర్మమేమి ? స్వర్గస్తుఁడయ్యెను.

విదే - శివశివా ! యెంతమాట వింటిమి. ఆహా ! అమ్మహారాజు వితరణాది సుగుణంబుల ననంతుఁడైనఁ గొనియాడఁ గలడా? మా దెసనతని వాడుక యెక్కుడుగా వ్యాపించి యున్నది.

బ్రా - మీ దే దేశము?

విదే - దక్షిణాది. అనంతశయనము.

బ్రా - మీ దేశ మొక్కటియేనా ? చతురంబోధిపరీతం బగు ధరాచలం బంతయు నతని వాడుక మ్రోసియున్నది గదా ?

విదే - ఆయనకు సంతానమున్నదియా ?

బ్రా - పాలసముద్రములో హాలాహలము పుట్టినట్టతనికిఁ గీర్తికేతుండను కుమారుం డుదయించె వాని నపకీర్తికేతుండనియే చెప్పఁదగినది. ఆ పాపాత్ముండే మమ్మిట్లు బాధింపుచున్నాడు.

తండ్రి యనంతరము సింహాసనమెక్కి తండ్రిచేసిన దానధర్మములన్నియు మానిపించి తండ్రి నాక్షేపించుచు నప్పుణ్యాత్ముఁడు మా కిచ్చిన యగ్రహారములకు బన్నులం గట్టెను. దేవక్షేత్రముల లాగికొనియెను. సత్రములఁ దీసివేసెను. యాచించుట యపరాధమని యర్థులఁ జెఱసాలఁ బెట్టించెను. ఇంతకన్నఁ దానమేమి యున్నది ?

విదే - ఆహా ! అతం డంత పుణ్యాత్ముఁడా ? తరువాత ?

బ్రా - సతీసుత రత్నములు తన చిత్తమునకు వ్యతిరేకముగా దాన ధర్మములు చేసిరని వారి నిష్కారణ మడవికిఁ బంపి చంపించె ఇంతకన్నఁ గ్రూరుం డెందైనం గలడా ?