పుట:కాశీమజిలీకథలు -04.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలభాషిణి కథ

199

“వత్సా ! యీరాచపట్టి దృఢవ్రతయనియే చెప్పగలను. పదిదినములనుండి నేను జూచుచుంటిని. సంతతము నీగుణములే యడుగుచుండును. నీరూపమే ప్రశంసించుచుండును. నీయౌదార్యమే కొనియాడుచుండును. అట్టి యభిప్రాయము లేదేని యిన్ని యిడుమలు గుడువనేల ? తండ్రి చెప్పిన వడుపునం బెండ్లి యాడి సుఖింపరాదా ?" యని యెన్నియో చెప్పిన నవ్వుచు నతండు దారిలోఁ బరీక్షించిన విషయమంతయు రహస్యముగాఁ దల్లి కెఱింగించి పెండ్లి యాడుట కంగీకరించెను.

పిమ్మట యశస్కరుండు మిగుల సంతోషింపుచుఁ బెండ్లి పెద్దయై యా క్షేత్రంబున మల్లి ఖార్జునమహాదేవుండు సాక్షిగా వారికి వివాహముగావించెను. అతండు వివాహసమయమున వర్గత్రయ ముచ్చరించునప్పుడు భాస్కరుఁడు విక్రమార్కుని మనుమడని విని యింతింతరాని సంతసముఁ జెందుచు నెల్లరకుఁ దత్ప్రసిద్ధి వెల్ల యగునట్లు వాని సుగుణములన్నియు బలుమారు గై వారము గావించెను. భాస్కరుండా లోపలనే తల్లి కిఁ బ్రభావతివృత్తాంత మెఱింగించె నట్టి సమయమున బూఁబోణి యా రహస్యమాలించియున్నది కావున నారాజపుత్త్రు కరముననున్న రత్నకంకణమెట్లో సంగ్రహించి తన వెనువెంటఁ దిరుగుచున్న మదనకేతునకిచ్చి యా రహస్యమంతయుఁ చెప్పి పో పొమ్ము. కలభాషిణకన్నఁ జక్కని చిన్నదానిం గూర్చితిగదా ! నీ ఋణము దీర్చుకొంటి నేనును బోయి వత్తునని చెప్పి తా నెచ్చటికో పోయినది.

పిమ్మట యశస్కరుఁడు వారి దమ వీటికి రమ్మనియు రాజ్యమేలుకొమ్మనియు బ్రతిమాలికొనుటయు రాజపుత్త్రుండు దేవా ! నాకు మీరాజ్యమందించుకయు నభిలాషలేదు. దైవానుగ్రహము గలిగిన మా తాతపీఠమే నే నధిష్టించెదను. అదియునుంగాక యిక్కలభాషిణి తన గ్రామమునకు రమ్మని వేఁడుకొనుచున్నది. తండ్రి రాజ్యమునకాయుపతియే కర్త్రియగుచున్నది. నా నిమిత్తమామత్తకాశిని యైహికసుఖముల నేవగించి జోగురాలై తిరిగినది. మీ రెఱింగినదేకదా ? తొలుత మే మాపురమున కరిగి పిమ్మట మీ పట్టణమునకు వచ్చి విందులారగింతుము. అట్లు చేయుట కాజ్ఞయిమ్మని వినయపూర్వకముగాఁ బ్రార్థించి తదనుజ్ఞవడసి కతిపఁ ప్రయాణముల భార్యయు దల్లియు సేవింప జంద్రప్రస్థపట్టణమున కరిగెను.

అందుఁ గలభాషిణినిగురించి ప్రజలు తండ్రియు నెట్లుచెప్పుకొనుచున్నారో యని తొలుతఁ దమ్మెఱింగింపక రాజపుత్రుఁడు వారితో గూడ నొక సత్రములో బసఁజేసెను. ఆ సత్రమున పలుదేశములనుండి వచ్చు పోవు వారికి నివసించుటకుఁ భుజించుటకును దగిన సదుపాయములు గలిగియున్నది. అందొకమూల వివాహములు, నొకమూల సంతర్పణములు, నొకమూల నుపన్యాసములు, నొకమూల బురాణములు, నొకమూల నృత్యగాన ప్రసక్తియు నహోరాత్రము లేకరీతిగా జరుగుచుండును. అందాకర్ణించిన బెక్కు దేశముల వారలు వినంబడుచుండును. పట్టణములోని