పుట:కాశీమజిలీకథలు -04.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

జేసికొనియున్నదఁట. ఆ వార్త తరువాత నాకుఁ దెలియవచ్చినది. ఆ సతీతిలకముం బెండ్లి యాడి రాజ్యము నీవు పాలించుకొనుము. ఇదియే నా ప్రార్ధన యని యెంతయో బ్రతిమాలికొనియెను. కాని యతం డంగీకరింపలేదు.

అప్పుడు చారుమతి భాస్కరా ! నీచే దొంగలవలన రక్షింపఁబడిన చిన్నది కలభాషిణి నిజము దెలిసికొని నిన్నేకాని పెండ్లియాడనని శపధము జేసికొనియున్నదఁట. ఇంతలో నీవు సముద్రములో మునిఁగితివని యారాజు మఱియొకనికిఁ బెండ్లి జేయఁ బ్రయత్నింప సమ్మతింపక జటావల్కములఁ దాలిచి శ్రీశైలమునకుఁ బాఱిపోయివచ్చినది. దారిలో నన్నుఁ గలిసికొని తనవృత్తాంత మడిగిన నాకుఁ జెప్పినది. నా వృత్తాంతము సైతము దానికిఁ జెప్పితిని. ఒండొరులయవస్థ కిరువురము దుఃఖింపుచు నిచ్చటికిఁ జేరితిమి. నాఁటినుండియు నన్ను విడువక నాతోఁ దిరుగు చున్నది నేఁటిసాయంకాలమున నెవ్వడో చిన్న వాఁడు యోగులకు రత్నములు బంచి పెట్టుచున్నాఁడని యెల్ల రు జెప్పుకొనగావిని నీ వెనుకటిమాట జ్ఞాపకమువచ్చుటచే శోకమాపఁజాలక యాబాలికకు జెప్పకయేవచ్చి యీతీర్ధములోఁబడితిని. ఆ చిన్నది కడు నుత్తమురాలు పతివ్రత. నీవు దానిం బెండ్లి యాడి సుఖింపుమని పలుకుచుండగనే కలభాషిణి యచ్చటికివచ్చి యామెం గౌఁగిలించుకొనుచు "అత్తా ! ఆశ్చర్యములు వినంబడినవి యధార్థమేయగునా ? నీవు నాతోఁజెప్పక యెట్లు వచ్చితివి ? నీకుమరుఁడు నిన్నుద్దరించెనఁట. భాస్కరుఁడే ? మదీయ హృదయజల భాస్కరుం డతండేనా ?" యని యడిగినఁ జారుమతి గారవింపుచు నెడమసందిటం బట్టికొని కుడిసందిటఁ గుమారుం జేర్చుకొని యల్లన నిట్లనియె.

వత్సా ! కలభాషిణి యిదియే సుమీ ! నీనిమిత్త మెట్టివేషము ధరించెనో చూచితివా ? దీని నీవు పరిణయమాడవలయును ననుచుఁ గలభాషిణీ ! వీఁడే నీభర్త. నీయదృష్టమే వీని నిట్లు కాపాడినది. నీవు ధన్యురాలవు. వీఁడు నిన్ను బెండ్లియాడఁ గలఁడని పలికినది. అప్పుడు కలభాషిణి లజ్జావదనయై బొటనవ్రేలు నేల వ్రాయుచుఁ బ్రహర్షసాగరమున మునింగి యభీష్టదేవతలఁ బ్రార్దింపుచుండెను. అమ్మా! యా చిన్నది తండ్రిమాట మన్నింపక స్వతంత్రించి యిల్లువిడిచి యొక్కరితవచ్చి దేశాటనముఁ జేయుచున్నదిగదా ? ఇది సతీధర్మమేమో చెప్పుము. స్త్రీస్వభావమెవ్వఁడు గ్రహింపఁగలఁడు ? ఈయువతి యే యూహతో నిల్లువెడలినదో నీవు చెప్పగలవా ? పరులు శంకింపకుందురా పరీక్షించి కాని పరిణయమాడుట కంగీకరింపనని రాజపుత్రుఁడు పలికిన విని యాకలికి యులికిపడుచు నిట్లనియె.

అత్తా ! యీమెచిత్తంబన్యాయత్తంబు కాదని పావకుస్పృశించెదను. త్రికరణంబులచేత భాస్కరుఁడే పతియని తలంచియుంటి. ఇందులకు భాస్కరుఁడే సాక్షి. పరీక్షించియే చేసికొనవచ్చునని యించుక వెఱపు గదురఁబలికిన విని చారుమతి.