పుట:కాశీమజిలీకథలు -04.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలభాషిణి కథ

197

సుమీ ! తత్పాపపరిహారమునకే రాజ్యము విడిచి విరక్తుండనై తీర్థాలు తిరుగుచుంటిని. ఏమి చేసినను నా హృదయపరితాపము చల్లారకున్నది. భవదీయ దయామృతము నాపైనించుక ప్రసరింపఁజేసితివేని చల్లాఱునేమో ? నా రాజ్యమంతయు నీకిచ్చివేసితిని. నీ యిష్టము వచ్చినట్లర్దులకుఁ బంచి పెట్టుకొనుము. నన్నే నీ కుమారునిఁగా జూచికొను మని యనేక ప్రకారముల బ్రార్దించి యామె శోకము నిబ్బడిగావించెను. అప్పుడు భాస్కరుఁడు వారిరువురం గుఱుతుపట్టి సంతోషశోక విస్మయరసావేశ హృదయుండై పరమేశ్వరుని ఘటనావై చిత్ర్యమునుఁ బెక్కుగతులఁ గొనియాడుచుఁ అమ్మా ! విచారింపకుము. నేను నీపుత్రుండ భాస్కరుండ నన్నిటు దైవమే సంఘటించెనని పెద్దయెలుంగున నుచ్చరింపుటయు నాయిల్లాలు దిగ్గునలేచి యేమేమీ ? నీవు నాముద్దులపట్టివి భాస్కరుండవే ? ఆహా ! యెట్టిమాట వినంబడినది. ఇది కల గాదుగదా. తండ్రీ ! నీవు సముద్రములో మునింగితివని వింటేనే ? యది యసత్యమా యేమి ? యని యనేకప్రకారములఁ బలవరింపుచు నతనిం గుచ్చియెత్తి యక్కునం జేర్చుకొని శిరము మూర్కొని లాలింపుచు నానందసాగరమున మునిఁగినది. పిమ్మట యశస్కరుఁడు భాస్కరుని చేయిపట్టుకొని పుణ్యాత్మా ! యీ పాపమతి యెవ్వఁడో యెఱుంగుదువా ? వినుము

మ. కరుణాబంధరు ధైర్యమందరు శుభాకారున్ సదాధారునిన్
     బరమోదారుఁ బరాంగనావిముఖు నాపద్బాంధవు నిన్ను ని
     ష్ఠురము ల్పెక్కువచించి దోషమతి వంచుంజంపఁగా బుచ్చుము
     ష్కరుఁడ న్మూడుఁడ ద్రోహు డన్ ఖలుఁడనేగష్టుండనో భాస్కరా.

అని మఱియు మహాత్మా ! నీవు పరోపకారమునకై సముద్రంబునం బడి మునిఁగిపోయితివని వూదూతలు చెప్పిరి. అది యసత్యమాయేమి ? నీ వెట్లు బ్రతికి వచ్చితివి ? నీ వృత్తాంతముఁ జెప్పుమని యడిగిన భాస్కరుం డా రాజసత్తముని నవ్వృత్తమున కచ్చెరువందుచు దేవా ! సముద్రములో మునింగినను గిరినుండి పడినను వహ్నిఁజొచ్చినను అకాలమున మృతిరాదుగదా ! అట్టి నిశ్చయజ్ఞానము గలిగియుండినచో విచారమేలగల్గెడిని ? ఆపదలు సుఖమునకును సుఖమాపదలకును నొక్కొక్కసారి కారణమగుచుండును. నా వృత్తాంతము చాలయున్నది సావకాశముగాఁ నెఱింగించెద. మిమ్మిందు గనుంగొంటి నింతియ పదివేలు. నాకతంబున నీవు రాజవిరక్తుడవైతివని మిక్కిలి పరితపించుచుంటి. నే సుఖినైతి నీవింకఁ బోయి రాజ్యము జేసికొమ్మని పలికిన నానృపతిలకుం డిట్లనియె.

మహాత్మా ! నీ సుగుణంబులఁ గొనియాడ నాదిశేషుండు చాలఁడనిన నే నెంతవాఁడ ? ఇట్టి నిన్నూరక దండించిన నేను రాజ్యార్హుండ నెట్లగదును ? నా రాజ్యము నీయదియెకాని నాదికాదు. నీవే యేలికొనుము. మఱియు నీవొక రాజపుత్రికను చోరులనుండి రక్షించితివఁట. ఆ చిన్నది నిన్నే కాని పెండ్లి యాడనని శపధముఁ