పుట:కాశీమజిలీకథలు -04.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలభాషిణి కథ

195

నుంటివి. రూపముఁ జూఁడ ద్రిలోక మోహజనకమై యున్నది. ఇట్టి ప్రాయమునఁ దగిన వరుని వరించి యైహిక సుఖంబు లనుభవింపక యుత్కృష్ట వ్రతంబులం బూని జోగురాలవై తిరుగుచుంటివేమి ? స్వర్గమునమాత్ర మేమియున్నదనుకొంటివి. అక్కడికిఁ పోయినను శృంగారచేష్టలే. యౌవన విలాసములే. ఇంతకన్న మఱేమియునులేదు. ఇక్కడ వృద్ధులై వ్రతములంబూని పిమ్మట స్వర్గమునకుం పోయి క్రొత్తదేహములం దాల్చి యందు వెండియుఁ గ్రీడింపుచుందురు. ఇక్కఁడజేయు పనియే యక్కడను జేయుచుందురు. నీ విక్కడ విడిచి యక్కడిదానిం గోరనేల ? నేను నవరస రసికుండ. నన్ను బరిగ్రహింపుము. స్వర్గసౌఖ్యంబులన్నియు నీ కిందు జరగఁజేసెదనని చెప్పుచుండఁగ నయ్యిందువదన వానికేమియుఁ బ్రత్యుత్తర మీయక పూవుఁబోడీ ! పూవుఁబోఁడి ! యని పిలిచినది. అది యా ప్రాంతమందె యుండి మాటాడినదికాదు.

అప్పుడతండు బోఁటీ ! నా మాట లేమియు నుత్తరమిచ్చితివి కావేమి ? పూఁబోఁడి యేమిటికి ? నిన్ను ద్యానవనములోఁ జూచినది మొదలు నా మదనవేదన యేమని చెప్పుదును? నేటికి సమయము దొరికినది. నా మాట కంగీకరించిన సరే లేకున్న బలాత్కారముగానైన నా యభీష్టముఁ దీర్చుకొనక మాననని పలుకుటయు నక్కుటిలకుంతల చటులముగాఁ జూచుచు ఛీ ! నీచా ? నా చిత్తమరయ కూరక ప్రల్లదములఁ బ్రేలెదవేల? నా మనోహరుఁడు భాస్కరుండు పరలోకగతుండైన నొరుల వరింతునా ? పాపాత్మా | యిట్టియూహతో నా వెనువెంటఁ దిరుగుచుంటివా ? పోపొమ్ము. నీ మాటలు నా చెవి కెక్కవని పలికినది.

అప్పుడు వాఁడు కానిమ్ము నీకడ్డుపడువారెవ్వరో చూతునుగాక మంచి మాటలచే బోటులు వశమగుదురా? యని పలుకుచుఁ దదీయ జటాకలాపముచేతఁ బట్టుకొని మోము చుంబింపం బోయిన నయ్యువతీమణి విదళించుకొనుచు అయ్యో ! పూవుఁబోఁడీ యీ దుర్మార్గుఁడు నన్ను బాధింపుచున్నాఁడు. రమ్మురమ్మని పెద్ద కేక పెట్టినది. ఆమాట వినియునది వచ్చినదికాదు. అప్పుడు భాస్కరుఁడా ప్రాంతపాదపము మాటుననుండి యంతయు వినుచున్న వాఁడు కావున ఖడ్గము కేల నుంకించుచు వెఱవకుము వెఱవకుము నేనిదే వచ్చుచున్న వాఁడనని పలుకుచు నొక్కగంతున నచ్చటికి వచ్చి నిలిచెను. అతనింజూచి యా బ్రాహ్మణబ్రువుఁడు పారిపోయెను.

అంతలోఁ బూవుబోణివచ్చి అమ్మా ! యేమియేమి ? యట్లడలుచున్నావని పలికిన నయ్యువతి నయ్యో ? నీ వెందుఁ బోయితివి ? మనతో వచ్చుచున్న నీచుఁ డేమి చేసెనో చూచితివా ? యీపుణ్యాత్ముఁడు రక్షించెను. దుర్జనుల సహవాసము కూడదని పెద్దలు చెప్పియుండలేదా? యని యతని చర్యలఁ జెప్పి భాస్కరుని వినుతించినది.