పుట:కాశీమజిలీకథలు -04.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమప్రభ కథ

191

నీయుఁడవు గావున మా గృహంబునకు విచ్చేయవలయునని చెప్పిన నితండు నవ్వుచు నిది మీ గృహము కాదా ? ఇంతకు ముందే వచ్చితిమని యుత్తర మిచ్చెను.

అప్పు డొక పుష్పమాలిక హేమప్రభ నతని కంఠమునందు వేయించినది. అతని చేత మఱియొక దండ నయ్యండజయాన మెడలో వేయించినది. అంతలో సఖురాండ్రందఱు నచ్చటికి వచ్చి పూవులం జల్లుచు వధూవరుల నాశీర్వదించిరి మాలో వివాహ పద్ధతు లివియేయని యాతనికిం దెలియఁజేసిరి. ఆ సమయంబు నజలోర్మిశిఖరశీకర నికరంబులును, తరులతా ప్రవాళ కుసుమంబులును గాలిచే వారి సమీపమునఁ బడి జలవనాదిదేవతలు వధూవరులపై నభినందించుచు జల్లు సేసలువలె విలసిల్లెను పిమ్మట వారిని భోదిసంపదలకు సంకేత స్థానమువలె నొప్పుచున్న యొక కేళీగృహంబునకుఁ దీసికొని పోయి పుష్పశయ్యం గూర్చుండఁబెట్టి మంగళగీతములం బాడుచు నిరువురకు మనోహరోత్సుకత్వము గలుగఁ జేసిరి. కొంత తడవు సఖులెల్ల విచ్చలవిడి శృంగార చేష్టలఁ గావించిరి. పిమ్మటఁ గాంతిమంజరి బాస్కరునితో రాజపుత్రా ! యిది నీ భార్యయైనది. యిటు పిమ్మట నీ యిష్టము వచ్చినట్లు చేసికొనుము. మే మందరముఁ బోవుచున్నార మని పలుకుచు దలుపు బిగించి సఖులతోఁ గూడ యవ్వలికిఁ బోయిరి. తదనంతర మా రాజుపుత్రుఁ డయ్యోపారత్నమునకు సంతోషము గలుగ జేయుచుఁ గొన్ని దినములు గడపి యొకనాఁ డతండు కాంతా ! నే నెంతకాల మిట్లు పరోపకార విముఖుండనై యిందుండుదును! పామరుండువోలె నిధువనక్రీడయే జన్మకు సార్థకమని యూహింపవలయునా? భూలోకమునకుం బోవు తెఱవుఁ జూపెద నని ప్రతిదిన మూరింపుచుంటివి. నా వృత్తాంత మంతయు వినియుంటివి గదా? నా తల్లి నా కొఱకెంత చింతించుచుండునొ ! ఆమెం జూచిరావలదా? యని యడిగిన నా జవ్వని నవ్వుచు నిట్లనియె.

ప్రాణేశ్వరా ! నీవు నా కిందుఁ గావించినది పరోపకారముకాదాదీననెక్కుడు పుణ్యము గలుగకపోదు. వినుము. నీ తల్లిం జూడక పోవుటచే నీ యుల్లము తల్లడిల్లు చున్నది. నా తల్లియు నట్టిదని యేల తలంపవైతివి ? నిష్కారణము దాని నేమిటికి వధించితివి ? అది నీ కేమి యపకారముఁ జేసినది ? ఆ పాతక మనుభవించుటకే మరి కొంతకాలము నీకీ బంధనము విధించితి నని యుత్తరముఁ జెప్పినది. అను నగు. నీ తల్లి నా కొక్కనికే యపకారముఁ జేయలేదు. జగంబునకే శత్రురాలు అబ్బా ! ఆ రండగాంచిన జీవహింసలకు మేరయున్నదా ? ఆ వృత్తాంతము వినియే లోకకంటకురాలని పరిమార్పితిని. ఇట్టి బంధనములు పెక్కులను భవించవచ్చును. ఈ పరిహాసములకేమి ? కాని నాకుఁ దెరు వెఱింగింపుమని యతండు తొందర పెట్టెను.

మఱియొక నాఁ దచ్ఛేడియ మోహనరత్న ------------ కంకణ మొకటి యతని చేతం దొడిగి యొక సరస్సు చెంతకుఁ దీసికొనిపోయి ఆర్య పుత్రా ! నీవు తలంచుకొని యీ తటాకంబున మునింగితివేని నీ యిచ్చ వచ్చినచోటికిఁ బోవుదువు.