పుట:కాశీమజిలీకథలు -04.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

డెవ్వఁడో పరికించితివా ? వసంతుఁడు రూపముగైకొన యిందు విహరింపవచ్చెననితోచు చున్నది. కానిచో నివ్వనాంతరమునకుఁ బురుషేతరు లెట్లువత్తురు ? నీ వరిగి వాని వృత్తాంత మరిసి రమ్మని పంపిన నది వోయి యా రాజకుమారునికి నమస్కరింపుచు నార్యా ! నీకు స్వాగతమౌఁగాక నీవు కంతుఁడవా ? వసంతుఁడవా ? జయంతుఁడవా ? నీ వృత్తాంతముఁ జెప్పుము. నీ వీ రహస్యగృహంబున కెట్లు వచ్చితివి ? పేరేమి ? యెవ్వని కుమారుండ ? వని యడిగిన నతండు సంతసించుచు -

బోటీ ! నీ మాటలచే మాకుఁ బ్రమోదము గలిగినది. నేను నీ వనినవారిలో నొక్కండనుగాను. విక్రమార్క చక్రవర్తి ప్రసిద్ధి మీరు వినియే యుందురు. ఆయన మనుమఁడను. నా పేరు విజయభాస్కరు డందురు. సముద్రంబున నౌకాయానంబున నరుగునప్పుడు లోహధ్వజము బయలు వెడలుటయు నయ్యుత్పాతంబు ప్రజలనంటకుండ నేను సముద్రములో నురికితిని దానంజేసి యిక్కడకు రాఁదటస్థించినది. ఇదియే నా వృత్తాంతము. అనుటయు నది యా వృద్ధ రాక్షసిని సంహరించినవాఁడవు నీవేకావా ? యని యడిగిన నేనేయని యొప్పుకొనియెను.

నిష్కారణము నామె నేమిటికి వధియించితివని యడిగిన నతండు లోక కంటకురాలగుటఁ బరమార్చితినని చెప్పెను. అప్పుడది పోయి హేమప్రభ కావృత్తాంత మంతయు జెప్పి ఆహా ! విక్రమార్కుని కీర్తి విద్యాధరులు సంతతము గానము చేయు చుందురు అతండు మంచి ధర్మాత్ముఁడు సాహసవితరణాది గుణంబుల దేవగణంబులకు సైత మచ్చెరువు గలుగఁ జేసెను. ఈతఁడతని మనుమఁడు. అట్టియెఁడ రూపంబున నసామాన్యుఁడు గదా ? బ్రహ్మ వీని నీనిమిత్తమే తీసికొని వచ్చెనని తలంచెదను. ముసలి దాని చావుచూడ దీనికే కారణము. అని పలుకుచు స్ఫురణమభినయించి.

సఖీ ! యీతండు నీభర్తయగుటనిక్కువమే. జ్ఞాపకమువచ్చినది. మీయవ్వ జాతకములో నట్లున్నది ఎవ్వాడు నీకు మారకుఁడో యాతండే నీమనుమరాలికి మనోహరుఁడని వ్రాయబడి యున్నది. చదువునప్పుడా మాట దాటించి చదివితిని. అని చెప్పిన విని హేమప్రభ నవ్వుచు నీ కట్టి నమ్మకము కలిగి యుండిన నీ కార్యము సంఘటింపుమని పలికినది.

అప్పుడు కాంతిమంజరి హేమప్రభను వెంటఁ బెట్టుకొని యా చిన్న వాని యొద్దకరిగి సఖీ ! యితండు విక్రమార్కుని మనుమఁడు విజయభాస్కరుం డనువాఁడు. గుణంబుల నతనికన్న నధికుండు. వీని చరిత్ర యంతయు వింటిని. ఇప్పుడు మన యింటి కతిధిగా వచ్చెఁ గావున సత్కరింపుమని పలుకుచు నార్యా ! యీ చిన్నది మా కందఱకు హృదయ స్థానమైయున్నది. దీని పేరు హేమప్రభ యండ్రు. ఇది విద్యాధర చక్రవర్తి యగు విశ్వావసునికి మనుమరాలు. దేవవ్రతుని కూఁతురు. దీని మాతృ సంప్రదాయము రాక్షసజాతిలోఁ జేరినను దీని గుణంబులట్టివిగావు నీవు పూజ