పుట:కాశీమజిలీకథలు -04.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమప్రభ కథ

189

తదీయ రూప విభ్రమవిలాసంబు లరసి రాజకుమారుండు మోహపరవశుండై అయ్యారే ! యీచిన్నదానిరూపము జగన్మోహనముగా నున్న యది. నిష్కాముఁడనగు నాచిత్తమునే వికారమునొందింపుచున్నది. ఓహో ! సౌందర్యమునం దెట్టిశక్తియున్నది. యేమోయనుకొంటిని. ఇది యంగీకరించెనేనిఁ బెండ్లియాడి గార్హ్యస్థ్యము నడుపుదునుకదా ? యని యూహింపుచు సీ ? నాకిట్టిబుద్ధియేమిటికిఁ బుట్ట వలయును ? అవ్వెలఁది యనుమోదింపనిచో నాబుద్దివ్యభిచరిం నట్లౌనుగదా ? ప్రమాద మూహించితినని పశ్చాత్తాపముఁ జెందుచు వారేమిచేయుచున్నారోయని వెనుక వెనుకఁ బోయి చూచుచుండెను. హేమప్రభ సఖులతో జ్వాలాముఖియొద్దకరిగి చచ్చియున్న యారక్కసిం జూచి వెఱచుచు శోకగద్గదకంఠియై అమ్మయ్యో ? మా యవ్వఁనెవ్వడో కుత్తుక నుత్తరించెను ఇఁక నాకు దిక్కెయ్యది ? యెట్లు బ్రతుకుదాన ? నేమి సేయుదు ? నని పెద్దయెలుంగున నురస్తాడనము గావింపుచు నేడువఁ దొడంగినది. సఖురాండ్రందఱు గన్నీరు విడువజొచ్చిరి.

కాంతిమతి ? అయ్యో పాపము నాతో నిన్నుఁ జూపించుమని యడిగినది తనకు మరణ మాసన్న మైనదని యెఱుంగును సుమీ ! దీని నిట్లు ఖండించిన వారెవ్వరో యరయ వలయు. మనల నేమిచేయునో ? నీవు ధైర్యముగా నుండి ముందరి కార్యమాలోచించుమని యోదార్చుచు హేమప్రభకు శోకోపశమనముఁ గావింప జొచ్చినది. హేమప్రభ కాంతిమంజరితో 'సఖీ ! నీ వన్నట్లు దీనిం జంపినవా రెవ్వరో యరయ వలయు. నిష్కారణ మిట్లేల నీల్గెడిని ? నఱకఁ బడిన కంఠము గనంబడు చున్నదిగదా ? మన మందిరము నలుమూలలు వెదకి యుద్యాన వనముఁ జూచి రండని సఖుల కందఱకు నియమింపుము. నే నిందే యుండెదనని చెప్పినఁ గాంతిమతి సఖులఁ వెంటబెట్టుకొని యా మందిరము లన్నియు వెదక మొదలు పెట్టినది ఆ మాటలు విని నంతనే భాస్కరుఁ డమ్మవారి చాటునకుఁ బోయి డాఁగియుండెను. ఆ కాంతలా నిశాంతమంతయు వెదకి వచ్చిన తరువాత భాస్కరుఁడా దారులన్నియుఁ గుఱుతుఁ జూచుకొని మెల్లగా నమ్మవారి ప్రక్కనున్న గుమ్మము దెఱచికొని యుద్యానవనము లోనికిం బోయెను.

శీతల జల పూరితములై కనకమణి సోపాన విరాజితములగు వాపీరూప తటాకముల చేతను సకలరుకుసుమ కిసలయ ఫలవిసర మనోహరంబులగు వివిధతరు లతావితానముల చేతను శోభిల్లుచున్న యయ్యుద్యానవనముఁ జూచి యారాజ కుమారుండు మారవిలాసములు మాననమున మొలకెత్తుచుండ విస్మయముఁ జెందుచు నందందు విహరింపుచున్న సమయంబున హేమప్రభ సఖులతో స్నానముఁ జేయనొక తటాకమునకు వచ్చి యా ప్రాంతమం దా రాజపుత్త్రుంగాంచి హర్షవిస్మయ వ్యాకుల చిత్తయై కాంతిమంజరి కిట్లనియె.

సఖీ ! యా పాదపము దాపునఁ బూవులఁ గోయుచున్న పురుష సింహుఁ