పుట:కాశీమజిలీకథలు -04.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

హింసించి యిప్పుడు తనకు మారకము వచ్చినదని విని యెంత విలపించుచున్నదో ? యెదరి బ్రాణములుం దనప్రాణములవంటివని యేల తలంపరాదో ? యిన్నీచం జరి మార్చిన లోకోపకారమగును. అట్టి సాధనమేమియుఁ గనంబడకున్నదే ? కానిమ్ము. ఇది యిప్పుడు నిద్రఁబోవుచున్నది. పరిచారికలు దూరముగా నెక్కడికోపోయిరి. యీ మందిరము నలుమూలలు దిరిగి చూచెదంగాక యని యందు వెడలి మఱియొక గది దగ్గిర కరిగినంత వంటశాల గనంబడినది. అందు ననేక నరకళేబరరుధిరాప్లుతమైన ఖడ్గ మొండు గనంబడినది.

ఆ రాజపుత్రుండా కరవాలము హస్తంబునబూని సాహసముగా నారక్కసి పరుండియున్న మందిరములోనికింబోయి యోసీ ! పాపాత్మురాల ! దయావిహీనవై కోట్ల కొలది ప్రాణంబుల నీకత్తిచేఁ బొఁగొంటివి. యిప్పుడీ కత్తియే నీపాలిటికి మిత్తి యైనది. లెమ్ము, లెమ్ము కాచికొనుమని పలుకుచు నదిలేచి పరికించునంతలో దాని యుత్తమాంగమును గదళీకాండంబు చందంబున ఖండించి శరీరముతో వేఱుచేసెను. పిమ్మటఁ జప్పుడు కాకుండ నా గది తలుపునకు గొణ్ణెమువెట్టి యందలి విశేషము లరయుచుఁ బోవఁబోవ నొకచో బార్వతీమందిరము గన్నులపండువుగావించినది. రత్న శోపానశోభితంబై మణిశిలాభిత్తి మండితంబై రత్నచిత్రతోచ్ఛ్రయ ధ్వజంబై యొప్పు నక్కాత్యాయనీ మందిరముఁజూచుచు విస్మయముజెందుచు నతం డద్దేవికి మ్రొక్కి వినుతించుచున్నంతలో నాప్రాంతమందెద్దియో రొదయగుటయు నతండెవ్వరో వచ్చు చున్నారని తలంచి యందొకమూల నడంగి యుండెను.

అప్పు డమ్మవారి ప్రక్కనున్న కవాటముదెఱచికొని యిందీవరంబులంబోలు వాలుగన్నులును పద్మమువంటి మొగంబును మృణాళనాళంబులబాలు బాహువులు మృదుశరీరమును బుష్పములవంటినవ్వునుం గలిగిమూర్తీభవించిన సరోజనియో యన స్త్రీసహస్రంబులు సేవింప నొక చక్కనిచిన్నది యక్కడికివచ్చి కాత్యాయని కెదురుగా సఖులతోఁగూడఁ గూర్చుండి తంత్రీనాదములతోఁ గంఠనాదముల మేళగించి యమ్మవారిం గీర్తించుచుఁ గొంతసేపు హాయిగాఁ బాడినది.

తరువాతఁ గాంతిమంజరి లేచి కాత్యాయనీమహాదేవీ ! చిరకాలమునుండి నా సఖురాలు నీపాదసేవఁ జేయుచున్నది. దానికిఁ దగిన మగనింగూర్చితివికాదుగద ? నీయనుగ్రహ మెప్పటికివచ్చునో తెలియదని ప్రార్థించినది ఆ మాటలువిని హేమప్రభ "సఖీ ! మాజరఠరాక్షసి బ్రతికియుండఁగా నాకు వివాహముకాదు. నీకేమిటికి వెఱ్ఱి పడియెదపు ? పిమ్మటఁగాని అమ్మవారికి దయరాదు." అని పలికినది. అప్పుడు కాంతిమంజరి “సఖీ ! నీతోఁ జెప్పమఱచితిని. ఇందాక మీయవ్వనాచేఁ దన జాతక ఫలములఁ జదివించుకొని మారకము వచ్చినదని విచారింపుచు నిన్నుఁ దీసికొని రమ్మన్నది. పాపము పోయి చూతము వత్తువా ?" యనుటయు ననుమోదించి యా హేమప్రభ యా దెసకుఁబోయెను.