పుట:కాశీమజిలీకథలు -04.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమప్రభ కథ

187

యడిగిన నది యిట్లనియె. నా కూఁతనికిని పాడుపోలికయే వచ్చినది. అది విద్యాధరుని వరించి యీచిన్నదానిం గన్నది. అందుమూలముననే దేవతల పోలిక వచ్చినది. దాని యభిలాషయు నట్లేయున్నది. కాని నేను బ్రతికియుండఁగా నితర జాతివారికిఁ బెండ్లిచేయనని చెప్పుచు భుజించి లేచినది.

అప్పుడు పరిచారిక లిరువురు దానిని శయనగృహంబునకుఁ దీసికొనిపోయి తల్పంబునం బరుండఁబెట్టిరి. అప్పుడది యయోముఖితో ఓసీ ! నీవిప్పుడు పోయి హేమప్రభ నడిగి నా జాతకమును దీసికొని రమ్ము. సమయమరసి యడిగిన నది యియ్యక మానదు. ఈపాటికి నాటలు చాలించునని చెప్పిన నదిపోయి యా చిన్న దానిం బ్రతిమాలికొని యాపుస్తకమును సంగ్రహించుకొని వచ్చినది. జ్వాలాముఖి పండుకొని అయెముఖితో ఓసి ! నా కీ జాతకమును మయుఁడువ్రాసి యిచ్చెను. దీని ప్రకారము ఫలము గనంబడుచున్నది. నవగ్రహముల దశలు నాకిరువదిమాఱులు తిరిగినవి. వీని నొక్కసారి చక్కగాఁ జదివి వినిపింపుమని కోరిన నది తనకు జదువురాదని చెప్పినది.

అప్పు డది యాపుస్తకము విప్పిచూచి అయ్యో ? నేను బెద్దదాననై పోయితినిగదా ? అక్షరములు గనంబడుటలేదు. కన్నులకు బొరలుగ్రమ్మినవి కాబోలు నిది యెవ్వరు చదువఁగలరని యడిగిన నయోముఖి అమ్మా ! మన హేమప్రభకుఁ గాక యీభాష యెవ్వరికిఁ దెలియ దని చెప్పినది. దాని నెట్లయిన నొకసారి యిక్కడికిఁ దీసికొని రమ్మని చెప్పిన నదిపోయి హేమప్రభ సఖురాలిఁ గాంతిమంజరి యను దాని దీసికొని వచ్చి అమ్మా ! యిదిగో దీనిం జదువుటకై హేమప్రభ కాంతిమంజరిం బంపినది. ఆ పుస్తకము దీని చేతికిమ్మని చెప్పినది. కాంతిమంజరి యాపుస్తకమును గై కొని తత్ఫలంబులన్నియు వరుసగాఁ జదివినది. కోట్లకొలది యది గావించిన జీవహింసలన్నియు నప్పుడు తెల్లమైనవి. మఱియు లోహధ్వజమువలన వచ్చిన మానవుఁడు తనకు గనంబడినప్పుడు మారకము జరుగునని వ్రాయంబడియున్నది. ఆ మాటలువిని యది యడలుచు అయ్యో ! నే నీ యనుమానముచేతనే జాతకమును దెమ్మంటిని. నాకు మారకము వచ్చినది కాఁబోలు. సాధనమేమి అయోముఖీ ? నన్నెట్లుకాపాడెదవు కాంతిమంజరీ ? ఇఁక జాలు నీవుపోయి మా హేమప్రభ నిటు రమ్మను. అని యూరక దుఃఖింపుచుండ వారింపుచు నయోముఖి యిట్లనియె అమ్మా ! లోహధ్వజమువలన వచ్చిన మానవుఁడు గనంబడినప్పుడుగదా నీవు విచారింపవలసినది ? ఇప్పు డట్టివాఁడు రానిదే చింతించెదవేటికి ? అది మరియొకప్పుడుగాని యిప్పుడు కాదని యోదార్చినది.

గూఢస్థానమునవసించి యా సంవాద మంతయును విని విజయభాస్కరుండు ఔరా ! ఇది నేను స్వర్గమనుకొంటిని. కాదు మయుండు సముద్రమధ్యంబున నీ గృహంబు నిర్మించి దీని కిచ్చినట్లు తెల్లమైనది. అబ్బా ! యీరండ అనేక కోటిజీవముల