పుట:కాశీమజిలీకథలు -04.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

తోచుచున్నది. వేయి సంవత్సరములనుండి జరుగుచున్న పని నేఁడేలతప్పును? నిజము జెప్పు మనుటయు నేనేమియు నెఱుగనని ప్రమాణముఁ జేసినది.

అప్పుడా రక్కసి తొందరపడుచు నోసీ ? శూలనఖ యెక్కడనున్నది ? ఇటు రమ్మనుమనుటయు నది దానిం దీసికొనివచ్చి యెదుర నిలఁబెట్టినది. శూలనఖా ! నీవరిగి నా మనుమరాలినిటు తీసికొని రమ్మని చెప్పిన నదిపోయివచ్చి అమ్మా ! ఆమె ఇప్పుడు సఖులతోఁ గూడి యుద్యానవనములోఁ గ్రీడింపుచున్నది. నామాట వినిపించు కొన్నదిగాదు. గట్టిగాఁ బిలిచినంత సఖులచే మొత్తించినది. దెబ్బలుపడి వచ్చితినని చెప్పినది.

అప్పు డా రక్కసి అబ్బా ! వృద్ధులమాటలు పిల్లవాండ్రు వినిపించు కొనరుగదా ? దీనికి నాయందుఁ బెంచిన విశ్వాస మించుకయును లేదు. నామాటకు దేవేంద్రుఁడు సైతము వెఱచువాఁడు. నా యాహారవిషయమై యించుకయు విమర్శింపదు. సంతతము సఖులతో గ్రీడింపుచుండును. అయోముఖీ: నీవై నం బోయి నాజాతకముండు పుస్తకము దానిపెట్టెలోనున్నది. యిమ్మని యడిగి తీసికొని వత్తువే ? అని చెప్పినది.

అదియుం బోయి వచ్చి అమ్మా ! ఇప్పుడు మన హేమప్రభ పెండ్లియాట లాడుచున్నది. మాటాడినదికాదు. వేళదాటినది. నీవు భుజింపుము. తరువాతఁ దీసికొనివత్తును. నీయొద్దఁ జనువుచే వచ్చినదికాదు. లేకున్న నీయాజ్ఞకుఁ ద్రిలోకాధి పతియైన జేతులుగట్టుకొని యెదుర నిలువఁబడడా ? యని చెప్పినది. అదియు దా మాటకు సమాధానపడి భుజింప మొదలు పెట్టినది. అట్టి సమయమున నయోముఖి అమ్మా ! హేమప్రభకు మంచిప్రాయము వచ్చినది. వివాహము గావించితివికావేమి ? ఇప్పు డిరువురు సఖురాండ్రకు వధూవరుల వేషమువైచి వివాహముగావింపుచుఁ దత్క్రీడాలాపముల ముచ్చటగాఁ జూడఁదొడంగినది. ఇదియే మంచి సమయము. ఆమెకుఁ దల్లివైన దండ్రివైన నీవేకదా ? యని యడిగిన నాజ్వాలాముఖి యిట్లనియె.

ఏకార్యములోను నాతో నది యేకీభవించదు. అది సంతతము రాక్షసజాతిని నిందించుచు మనుష్యులనైన దేవతలనైనఁ బెండ్లియాడెదనని చెప్పుచున్నది. మన కాహారమైన మనుష్యులును శత్రువులైన దేవతలును బనకిరారని నేనెంత చెప్పినను సమ్మతింపదు. ఏమి చేయుదును? లేకున్న నీపాటికి నెవ్వనికో యొక గొప్పరాక్షసునికిఁ గట్టి పెట్టక పోవుదునా ? దాని ఖర్మమట్లున్నది. పోనిమ్ము. పెంచిన మోహమున నింతగాఁబరితపించుచున్నదాన. రాక్షసులందముగాఁ నుండరఁట. చిన్నముక్కులు చిన్నకన్నులు చిన్నముఖములు చిన్న పండ్లు చిన్ననోరులు గలిగిన మనుష్యులేమి యందముగా నుందురో తెలియదు అని పలుకుటయు నయోముఖి అమ్మా ! నీ మనుమరాలు మనుష్యులనేపోలినదేమి రాక్షసుల యందమువచ్చినది కాదేమని