పుట:కాశీమజిలీకథలు -04.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

యున్మత్తుని క్రియ శోకింపుచుండఁ బ్రధానులు వారెంపుచు వై రాగ్యోపదేశముఁ గావించిరి. ఆ రాజు మంత్రి వాక్యముల నెట్టకేఁ దెప్పరిల్లి యవ్వార్త భాస్కరుని తల్లికిం జెప్పవలదని యెల్లరకుం బోధింపుచు మితిలేని ద్రవ్య మామెయొద్దకు బంపెను గాని యా సాధ్వీరత్నము వాని నేమియుఁ గైకొనక కుమారుని రాక యభిలషించి కాలము గడుపుచుండెను.

రాజు విరక్తుఁడై భాస్కరుని గుణములం దలచుకొని పరితపించుచుండ నొక నాఁ డిరువురు దూత లెద్దియో పత్రికం దీసికొనివచ్చి యిచ్చిరి. యశస్కరుఁ డది విప్పి చదువుకొని నిట్లున్నది. మహారాజా ! నాకు లేక లేక యొక పుత్త్రిక గలిగినది. దానిం బండ్రెండేండ్ల ప్రాయంబునఁ జోరులెత్తుకొనిపోయి యమ్మవారికి బలియిచ్చుచుండ నొక రాజకుమారుఁడు రక్షించి మా వీటికిఁ దీసికొనివచ్చి యొక బ్రాహ్మణుని యింట దిగవిడిచి యవ్వలికిఁ బోయెను. ఆ బ్రాహ్మణ పుత్రుఁడు తానా బాలికను దొంగలవలన విడిపించితినని చెప్పుచుఁ తనకుఁ బెండ్లిచేయమని కోరెను. నే నతని మాటలలోఁ బరస్పర భేదముల నరసి చేసిన ప్రతిజ్ఞకు భంగమైనను నిజము దెలిసికొనుటకై కొన్నిదినములు గాలహరణముఁ జేసితిని. ఇంతలో నా దొంగ లతని సకుటుంబముగా నెక్కడికో తీసికొనిపోయిరి. తండ్రియొక్కఁడు మిగిలియుండి విచారించుచు నొక్కనాఁడు వచ్చి యదార్ధము నాతోఁ జెప్పెను. అప్పుడు నేను సంతసించుచు నా చిన్నవానిని గుఱుతులుచెప్పి తీసికొనిరండని తగినదూతలను నానా దేశములకుఁ బంపితిని.

వారి జాడ యేమియుం దెలియలేదు. మఱియు విమర్శింప నా చిన్నవాఁడు. మీ యాస్థానములోఁ గొల్వుచేయుచున్నాఁడని తెలిసినది. వానిఁగాని పెండ్లియాఁడనని నా కూఁతురు కలభాషిణి శపథముఁ జేసికొనియున్నది. వానిపేరు భాస్కరుఁ డని వింటిమి. అతండు సుగుణంబుల పుంజమని చరిత్రవలనం దెలియుచున్నది. అతండు నా యల్లుఁడు కావున నీ పత్రికం జూచిన తత్‌క్షణము తల్లితోఁ గూడ వాని భద్ర దంతావళ మెక్కించి యిక్కడికిఁ బంపవలయును. ఇదియే మాకు బదివేల యుపకారములు. ఇట్లు విధేయుఁడు. అని యున్న పత్రికం జదువుకొని యశస్కరుఁడు శోకోపహతస్కుండై అయ్యో ? అట్టి సుగుణోత్తంసునిఁ బరాసుం గావించితినిగదా ? యిప్పు డీ యుత్తరమున కేమని ప్రత్యుత్తర మిత్తును? ఈ వార్త విన్నచో నా కలభాషిణి పతివ్రతయైనచో నితరుం బెండ్లియాదు. దుఃఖాక్రాంతస్వాంతయై యత్య యంబు నొందెడిని పురుషహత్యయు స్త్రీహత్యము బ్రహ్మహత్యయు నన్ను బాధించెడివి. యిఁక నే బ్రతుకనేల ? చత్తుమన్నను నరకమున బాదపడవలసి వచ్చును. నన్నీ పాతక మెట్లుపాయున నియనేక ప్రకారములఁ దలంచుచువారి కేమియుఁ బ్రత్యుత్తర మీయక రాజ్యము మంత్రుల యధీనముఁజేసి జటావల్కలముల ధరించి యా రాజు తీర్థాటనము గావింపఁ జొచ్చెను.