పుట:కాశీమజిలీకథలు -04.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యశస్కరుని కథ

183

యుపకారమునకు మ్రొక్కుచున్నవాఁడనని యనేక ప్రకారముల నతనిం దలంచుకొని యున్మత్తుని క్రియఁ బలవింపఁ జొచ్చెను.

అందున్న సామంతరాజులెల్ల నతని నోదార్చుచు విజయభాస్కరుని తక్షణము తీసికొనిరమ్మని మఱికొందఱు రాజభటులను బంపి యా వార్త రాజున కెఱింగించిరి. అప్పు డా రాజు రౌద్రావేశముతో మంజువాణిం జంపించి యుప్పు పాఁతరవేయించి చారుమతియొద్ద కరిగి నమస్కరింపుచుఁ దల్లీ ! నే నీ కుమారుని నిష్కారణము శిక్షించిన పాపాత్ముండ. నా యపరాదములసైచి నీవు నా యింటికి వచ్చి రక్షింపుము. నా రాజ్యమంతయు నీ పుత్త్రున కిచ్చివేసితిని, అతనిం దోడ్కొనరా దూతలం బుచ్చితిని. శీఘ్రముగా రాఁగలండు నీయిచ్చవచ్చినట్లు ధన మర్దులకుఁ బంచిపెట్టుము. నే నీపాదసేవకుండనై యుండెద నని యెంతయో బ్రతిమాలెను.

చారుమతి కుమారుండు వచ్చువఱకుఁ గోటలోని కరుగుటకు సమ్మతించినది కాదు. యశస్కరుఁడు భాస్కరునిరాక నరయుచున్నంత నతనిం దీసికొని పోయిన దూతలు వచ్చి నమస్కరింపుచు రాజునకిట్ల నిరి. దేవా ! మే మా చిన్న వానినిఁ బ్రవహణ మెక్కించి ద్వీపాంతరమునకుఁ దీసికొని పోవుచుండఁగా సముద్రములో నొక చోట లోహధ్వజము బయలు వెడలినది దానింజూచి నావికులు తొందరపడుచు నందున్న వారితో నిప్పుడు గాలివాన రాఁగలదు ఈకలము లోహధ్వజమునకుఁ దగిలి మునిఁగి పోవును. మీలో నొక్కఁడు బలిగా సముద్రములోఁ బడెనేని నీ యుత్పాతము తగ్గిపోవును లేకున్న నందఱము మృతినొందుదుము. బలవంతముగాఁ దోయఁగూడదు. ఇందుఁ బరోపకారపారీణు లెవ్వరైన నుండిరేని బయలు పడవలయును అని యందంద చాటింపఁ దొడంగిరి.

ఆ మాటలు విని నేను బడియెదనని పలికినవాఁ డొక్కఁడును లేఁడు ఎవ్వనికి వాఁడే మిగులవలయుననియు మఱియొకఁడు పడి యందఱిని రక్షింపవలయు నని నీతులు చెప్పుచుందురు. ఆ వార్త ముఖాముఖిగా మన భాస్కరుఁడు విని యుబ్బుచు లేచి మీరందఱు సంతోషముగా నుండుఁడు. నేనిందుఁబడి మిమ్మురక్షించెద నింతకన్న నాకుఁ గావలసినది లేదు. అస్థిరమువిడిచి స్థిరము సంపాదించెదను. నా శరీరము జన్మజన్మమునకు నిట్లే పరోపకారముగా విడువఁబడునుగాక యని పలుకుచుఁ జేతులు జోడించి మందహాస శోభితవదనారవిందుండై సముద్రములో దుమికి మునిఁగి పోయెను.

అంతలో నా గాలివాన తేలిపోయినది. కావలసిన కార్యము గంధర్వులే తీర్చినారు గదా యని మేము సంతోషింపుచుఁ దిరిగి యింటికి వచ్చినారము. ఇదియే మా వృత్తాంతమని నుడివిరి. ఆ మాటలు విని యశస్కరుడు గోరుచుట్టుపై రోఁకలి పోటన్నట్లు పరితపించుచు మీకు మీము పంపిన దూతలు గనంబడలేదా? యని యడిగిన నెవ్వరు గనంబడలేదని వారుత్తరముఁ జెప్పిరి. యశస్కరుఁడు భాస్కరునిఁగుఱించి