పుట:కాశీమజిలీకథలు -04.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

నంత విమర్శించి నిజముఁ దేల్చెదనని యొడంబడి యట్టి యధికార పత్రికంగైకొని యప్పుడే యంతఃపురమున కరిగి మంజువాణియున్న గదులన్నియు విమర్శింపగా సుముఖుఁడు వ్రాసిన యుత్తరములు కొన్ని దొరికినవి. తరువాత నా యువతి మంజువాణిని వితర్క పూర్వకముగా నా చిన్న వాఁడు గావించిన కృత్యముల నడిగి శంకించుచు నా మాటలలోఁ బరస్పర విరోధములు నిరూపించి యామె చెప్పినదంతయుఁ దప్పని యామెచేతనే యొప్పించినది. తరువాత మదనమంజరికను దాని చెల్లె లిని వితర్కించి సాక్ష్యము పుచ్చుకొన్నది. అందొకరిమాట కొకరిమాట సరిపడినదికాదు. నిజ మంతయుఁ దెలిసికొని రాజునొద్దకుఁబోయి యా యిల్లాలు దేవా ! నిక్కము దొరకినది. నేఁ జెప్పిన మాటయే సత్యము నన్ను మన్నింతురేని యదార్థముఁ జెప్పింతునని పలుకుటయు నా రాజు తొందరపడుచు దల్లీ ! వేగముగఁ జెప్పి నా మనస్సంశయము పోఁగొట్టుమని ప్రార్ధించెను. అప్పుడు మదనమంజరికను రప్పించి ఓసీ ? నీవు రాజు నెదుట నిక్కము వక్కాణింపుము. నాకుఁ దెలిసినది. నీవు చెప్పకున్న నేను జెప్పెదను పిమ్మట నిన్ను దండింపఁజేసెదను. ఇప్పుడే చెప్పెదవే నిన్ను విడిపించెదనని బెదరించిన లఘుహృదయ యగు నాదాది భయపడి జరిగిన యదార్థమంతయు రాజు నెదుట బూస గ్రుచ్చినట్లు వక్కాణించినది.

ఆ కథ యంతయు విని యా రాజు కరవాలఖండితమగు కదళీ పాదపంబు చందంబున నేలంబడి పెద్దతడ వొడలెఱుంగక యెట్టకే చేష్టగలిగి గుండెలు బాదుకొనుచు హా ! గుణనిధీ ! హా ! దయాళూ ! హా ! ధర్మశీలా ! నీవంటి సద్గుణరత్నము నా వంటి నీచమతి చెంత నేమిటికి గౌరవముఁ జెందెడిని ? అయ్యో ? నిన్నూరక శిక్షించిన నా పాతకమున కంతమున్నదియా ? ఆహా! నీ సౌశీల్యముఁ గొనియాడ శేషునకైన శక్యమా ? నిన్నుఁ గ్రూరాత్మా ! యని నిందించిన నా నాలుక వేయిముక్కలైనది కాదేమి? యురిశిక్ష విధింతు నన్నను మొగంబునఁ జిఱనవ్వు వెలయించితివి. నీ విరక్తి యెవ్వరికిఁ గలదు ? నీ విషయపరాఙ్ముఖత మహర్షులకు సైతము గలదా ? ఆ ద్రోహురా లంత కపటముఁ బన్నిన నీవుచేసి నట్లొప్పుకుంటివి కాని కాదనవైతివి. అయ్యారే! నీ భూతదయకు మేర యున్నదా? భవదీయవితరణాది గుణంబు లాబ్రాహ్మణుఁడు పొగడెనేమో యనుకొంటిని. నీ గుణంబులు దలంచుకొని నీ తల్లి విలపించు చున్నది. నీ యట్టి పరమధర్మ స్వరూపుని శిక్షించితిని. నేను మూఢుఁడ. మహా ద్రోహుఁడ, క్రూరుఁడ, పాపుఁడ. నాకీ నరకము చాలదు. నేనిప్పుడు బలవంతముగా మృతినొందెదను. నా దేహము కాక గృధ్రములు సైతము ముట్టవు. రక్షకపురుషుల వెంటఁ బెండ్లికి బోవునట్లు పోయితివిగదా. సీ! యా యధమురాలి నిప్పుడేమి చేయుటకుం దోచకున్నది. అప్పుడు నిజమంత చెప్పితివేని నీయెదుట నుప్పుపాఁతర వేయక పోదునా ? మహాత్మా ! నిన్నుప్పుపాతర వేయింతునని పలికిన పలుకులు దలంచుకొనిన నా గుండె పగిలిపోవుచున్నది తండ్రీ ! యేమిచేయుదును. తల్లీ నీవు నాకుఁ గావించిన