పుట:కాశీమజిలీకథలు -04.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యశస్కరుని కథ

181

మానుని సకుటుంబముగా సభకు రప్పించి యా చిన్నవాని గుణములు మీ యెఱింగి నంత యదార్ధము వక్కాణింపుడని యడిగిన నయ్యజమానుం డిట్ల నియె.

మహారాజా ! ఆ చిన్న వాఁడును దల్లియు వచ్చి సంవత్సరము క్రిందట మా యింటిలోఁ బ్రవేశించినారు అప్పటినుండియు వారి మే మెఱుంగుదుము. వారి చర్యలుచూడ రాజకుటుంబములోనివారివలెఁ గనంబడుచున్నారు ఆ చిన్నవాని సుగుణంబులు లెక్కింప సహస్రముఖుండైన శేషునికిసైతము శక్యముకాదని నా యభిప్రాయము. అట్టి ధర్మశీలున కిట్టివాడుక యేమిటికి వచ్చెనో తెలియదు. మీ రిచ్చు జీతములో షోడశాంశమైన వాఁడు తనకుఁగా నుపయోగించుకోలేదు. సంతతము నర్దులకుఁ బంచిపెట్టువాఁడు. మీరిచ్చునది పదిదినములకైన జాలునదికాదు ముందరి నెలజీత మిప్పుడే నిరూపించి యుంచువాఁడు. తాను భోజనముఁ జేయుచున్నను అన్నమని యఱచిన వానిమాటవిని లేచి యోపినంతఁబెట్టి యాఁకలిదీర్చువాఁడు. వాని తల్లి యొకనాఁడు రాత్రి నాలుగుసారు లన్నమువండి యర్థులకుం బెట్టినది. అబ్బా ! ఆ దయాళుత్వము నేను జెప్పఁజాలను. చీమను ద్రొక్కిన బ్రహ్మహత్యఁ జేసినంత పశ్చాత్తాపమును జెందును. పరస్త్రీల నెన్నఁడును గన్నెత్తి చూడలేదని నేను బ్రమాణము చేయఁగలను. మీ యొద్ద దాచనేల? నా కూతుండ్రును కోడండ్రును బలుమాఱు వాని నంధుడనియు మూఢుఁడనియు బరిహాసమాడిరని రహస్యముగా నా భార్య నాకుఁ జెప్పినది అట్టి ధర్మాత్ముఁడు పుడమిలోలేఁడు. సేవకవృత్తిలో నుండబట్టి వానిపేరు ప్రసిద్దికి వచ్చినదికాదు. వానికి రాజ్యమేయున్న బలి శిబి విక్రమార్కాది ధర్మాత్ములు వీని పాదాంగుష్టమునకు బోలుదురే. ఆహా ఆ మహాత్ముఁ డిట్టి యపవాదము వహించుట కేదియో కారణముండకపోవదు. వానికిఁగల భూతదయ యింతని చెప్పఁజాలను. అందలి సత్యాసత్యంబులు విమర్శింప మీరే యర్హులు. ఇదియే మేమెఱింగిన వృత్తాంత మని యా బ్రాహ్మణుఁడు వక్కాణించెను.

ఆ మాటలే యతని భార్యయుఁ గొడుకులు గోడండ్రు కూతుండ్రునుఁ జెప్పిరి. అప్పుడు రాజు మిక్కిలి దుఃఖింపుచు రాత్రి భర్తతో వాదించిన కాంతా రత్నమును రప్పించి నమస్కరింపుచుఁ దల్లీ ! నీవు నిన్నరాత్రి నీ భర్తతో నన్న మాటలు నేను విన్నాఁడను. నేను దప్పు శిక్షఁ జేసితినని పలికితివి. నాకును నను మానముగానే యున్నది నీ కిప్పుడు ధర్మాధికార మిచ్చితిని. అందలి నిజానిజంబులఁ దెలిసికొని యపరాధుల దండించి నన్నీ యాపదనుండి దప్పింపుము. నిజము దేలిచితివేని యా చిన్న వానిని గ్రమ్మఱ నిచ్చటికి రప్పింతునని చెప్పిన విని యామె యిట్లనియె.

దేవా ! మీరు సకలధర్మ స్వరూపులు. మీకంటె నే నెక్కుడుగా ధర్మ వివేచనము సేయఁగలనా? యేకాంతముగా నింటిలో నాడికొనిన మాటలు సభకెక్కునా ? అయినను మీరు నన్నుఁ బెద్దఁజేసి యింతగా మన్నించుచున్నారు. కావున నా యోపి