పుట:కాశీమజిలీకథలు -04.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

వని యెఱుంగక నీ మాటల నమ్మి శుద్ధాంతమునఁ గాపు వెట్టిన నెట్టిపని జేసితివి ? క్రూరాత్మా ? రాజపత్ని నీకుఁ దల్లిగాదా ? అయ్యో ? కడుదయాళుండనని పలికితివే ? నా యంతవాని నీ మంత్రినెట్లు చంపఁ జేతులాడెనురా ? యని యనేక ప్రకారముల నిందింపుచు శాస్త్రవేత్తల రప్పించి వాని వృత్తాంతమంతయుఁజెప్పి వీనికేమి శిక్ష విధింపవలయు? నని యడిగిన వారు గాత్రము తున్కతున్కలుగా గోసి యుప్పుపాతర వేయవలయునని చెప్పిరి. ఆ మాటలు విని రాజు తిరుగనించుక విమర్శించి తదాకార చేష్టలఁ బరీక్షించి అన్నా ! వీని ముఖమున నించుకయు వికారము గనంబడదు అపరాధముఁ జేయని వాడుంబోలె గన్పట్టుచున్నాఁడు. ఉరిశిక్ష విధించిన వెరచినట్లు కనంబడఁడు. దీనిలోఁ నేదియో మర్మమున్నదేమో కదా ! పోనీ నే నెఱుంగననియుం జెప్పకున్నాఁడేమి? నిరపరాధుని శిక్షింతునేని నరకము పాలగుదునని తలంచుచుఁ జిన్న వాఁడా ! నీవు చేసిన తప్పునకు విద్వాంసులు చెప్పిన శిక్ష శాస్త్రచోదితమై యున్నది. అట్టి దాని ననుభవింతువా ? యనుటయు నతండించుకయు విచారింపక పూర్వముద్యోగ మిచ్చినప్పుడుబోలె సంతోషముతో మందహాసముఁ గావించెను. ధైర్యమునకు సభాసదు లెల్లరు ఆశ్చర్యపడఁ జొచ్చిరి.

అప్పు డారాజు హృదయంబునఁ బలుతెఱంగులఁ దలంచుచు నురిశిక్షకు సమ్మతింపక ద్వీపాంతర వాసశిక్ష విధించి తన యంతఃపురమున కరిగెను. రాజభటు లారాజపుత్రుని నిగళంబులం గట్టివైచి వీధులన్నియు నూరేగింపుచుఁ దల్లి యొద్దకుఁ దీసికొని పోయిరి. అంతకు ముందుతద్వృత్తాంతము విని విచారింపుచుఁ జారుమతి కుమారుం జూచి నాయనా ! నీ కిట్టియపవాద మెట్లు వచ్చినది ? కలయందైనఁ బరకాంత వార్త స్మరింపని నీవు రాజపత్నిం బట్ట గమకింతువా ? అయ్యో ? పరుల నిమిత్తము ప్రాణమును దృణముగా నెంచి విడుచువాఁడవు. మంత్రినెట్లు చంపుదువు ? తండ్రీ ! నీ వజాతశత్రుఁడవే ? యట్టి నీయం దీయపరాధ మెవ్వరు మోపిరి ? నీయం దెవ్వరు వై రముఁ బూనిరి ? తప్పుజేసిన వాఁడుంబోలె నీ వేమిటి కూరకుంటి ? వని యనేక ప్రకారముల విలపింప రాజుపుత్రుండు నవ్వుచు నిట్ల నియె. అమ్మా ! నేను బలుమాఱు బోధింపుచుండ నేమిటికి మఱచెదవు ? ప్రారబ్ధంబు భోగింపక తీఱునా ? యొరుల నిందించెద నేమిటికి ?

శ్లో॥ యత్కర్మబీజముప్తల యేనపు రానిశ్చితం స తద్భుజై
     పూర్వ కృతన్యహి శక్యో విధినాపి నకర్తుమన్యధా భావః

శ్లో॥ తస్మాధ్యత్రయధాయద్భవితవ్యంయన్యడై వయోగేన
     తత్రతధాతత్ప్రాప్తోవివశోసానీయలేత్రనభ్రాంతిః

పూర్వజన్మంబున నాటిన సుకృతదుష్కృత రూపమగు కర్మమను బీజము వృక్షమై ఫలియించును. దాని ఫలమునే జనుండు భక్షింపుచుండును. అట్టి పూర్వ కృత్యమును మార్పుటకు బ్రహ్మ దేవునకై నను శక్యము గాదు ఎక్కడ నెవ్వన కెంత