పుట:కాశీమజిలీకథలు -04.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

లేకపోవుటచే మానితివి. సత్యమేయని యేమేమో పలుకుటయు నతం డమ్మా ! నాకు నీమాటలకేమియు నర్దముకాలేదు. నేను గలయందైన నసత్యమాడను. పెండ్లింజేసికొన లేదు. తెల్ల వారుచున్నది. లోపలికి దయచేయుమని పలికెను. అంతలోఁ దెల్లవాఱినది. కావున నందుండుటకు వీలులేక మంజువాణి లోపలికిఁ బోయినది.

అతనిరూపమే తలంచికొనుచు విరహాతురయై క్షణ మొక యుగములాగున గడపినది. మఱునాఁడు రాత్రి దిరుగా వచ్చి చిన్నవాఁడా ! నీతో నిన్ననొకమాటఁ జెప్ప మఱచితిని. నామాట పాటించురా ? మఱియొకటి వినుము. నీవు రాత్రియెల్ల మేల్కొని యుందువు నీకు నిద్రరాదాయేమి ? నిన్నుఁజూడ నాకు జాలి పొడముచున్నది. నీవొకసారి పండుకొనుము. నీకాపు నేఁగాచెదను. అవును. మన్మధుఁడు రాత్రుల నిద్రఁ బోవడఁట. నీవు నట్టివాఁడవే కావున నిద్రఁ బోకుంటివి. తెలిసినదని పలికిన నతండు అమ్మా ! నాకట్టిపోలికల నేమిటికి దెచ్చెదవు. నాతోఁ జెప్పవలసిన మాట యేదియో చెప్పిపొమ్మనుటయు నత్త్విని యిట్లనియె.

సౌమ్యా ! మఱేమియు లేదు. యౌవనము ద్రువమైనదికాదు గదా ? ఇట్టి ప్రాయమంతయు రిత్తచేయుచున్న వాఁడ వని విచారముగానున్నది. ఇఁక సుఖమెన్నఁ డనుభవింతువు ? నీకుఁ జక్కని కాంతంగూర్చెద ననుమోదింతువే ! యనిన నతండు అమ్మా ! నాకట్టి యభిలాషలేదు. పెండ్లియాడనని జెప్పలేదా ? ఆమాటకై తిరుగానింత శ్రమపడి రానేల ? యౌవనమునఁ జేయఁదగిన కృత్యంబులు వేనవేలున్నయవి. అవి యన్నియుం దీర్చుకొన్నఁ జాలదా ? పెండ్లి యేటి ? కని పలికెను.

అప్పుడా మంజువాణి భాస్కరా ? నీవేమియు నెఱుఁగనివాఁడవు. కావున నిట్లనుచున్నాఁడవు మహర్షులు సైతము వివాహమాడి యానందమనుభవించిరి. నీవు కోరిన నేయింతి యంగీకరింపదు ? ఆహా ! నిన్నుఁ జేపట్టిన జవరాలిదిగదా భాగ్యము ? అయ్యారే ! నీయిట్టి సొగసుకాఁడు మగఁడుగా నుండిన యింతికి సామ్రాజ్యమేల ? యని యూరక పొగడుచుండిన వారించుచు నతండిట్లనియె. అమ్మా ! మేదోమాంస రుధిరాస్థిమయంబై హేయంబైన యీకాయంబు నింత గొప్పగా వర్ణించెదవేల ? నీమాటలేమియు నామది కింపుగాలేవు నీవు రాజపత్నివి. కావున నేమనుటకుం గాదు. నాకు వివాహమునందభిలాష లేదు. నీవు వెళ్ళిపొమ్మని పలికెను.

అప్పు డామంజువాణి లోపలికిఁ బోయి మదనమంజరిక యను సఖురాలిం జీరి తన హృదయాభిలాషయెఱింగింపుచు నిట్లనియె వాల్గంటీ ప్రాణమువంటిదానవు కావునఁ జెప్పుచుంటిని. మనవాకిటఁ గావున్న చిన్నవానిం జూచితివా ? కాముఁడు గీముఁడు వాని గోఁటికిసాటిరాఁడుగదా ! బ్రహ్మ వానికిఁ ద్రిలోకమోహజనకమగు సౌందర్య మొసఁగి తగిన రసికత్వ మొసంగఁ డయ్యెను. ఏమి చేయుదును ? సిగ్గు విడిచి యభిలాష వెల్లడించినను వాని హృదయము గఱగినదికాదు. శృంగార మెఱుఁగునో యెఱుఁగడో తెలియదు ! వాని కదియే కలిగినచో బంగారమునకు సౌరభ