పుట:కాశీమజిలీకథలు -04.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంజువాణి కథ

173

ఆమె పుట్టినింటి కరిగి వచ్చితిని. ఆమెతోఁ గొన్ని వార్తలం జెప్పవలసియున్నది. నన్ను లోపలికిఁ బోనీయుఁడని వేఁడికొని యందులకు దృష్టాంతముగాఁ గొన్ని పత్రికలం జూపించుటయు రాజపుత్రుండు నమ్మి వాని లోపలికిం బోనిచ్చెను. అప్పుడా సుముఖుం డపరిమిత సంతోషముతో లోపలికింబోయి విరహ వేదనముచే బాధపడుచున్న మంజువాణిం గాంచి మేనం బులకలుద్బవిల్ల దానుబడిన యిడుమ లన్నియుం జెప్పుచు నామెతో నా రాత్రి గడిపెను. అంతలో వేకువజా మగుటయు మంత్రి యధా ప్రకార వేషముతో నరుగఁబోయెను. రాజపుత్రుండు చేయిపట్టుకొని సూర్యోదయము వఱకు నీవు పోవుటకు వీలులేదు. నిన్నుఁ బోనీయను. నిలుమని యదలించిన భయపడి యతండు వెనుకకుఁ బోయి యామాట మంజువాణి కెఱింగించెను. అప్పుడు మంజువాణి యాలోచించి మేలిముసుఁగు వై చికొని ద్వారముదాపునకుం బోయి రాజ పుత్రుంగాంచి విస్మయము జెందుచు సౌమ్యా ! యిది నాసఖురాలు అవసరమైన పనికిం బంపుచుంటిని. తెల్ల వాఱినఁ గార్యము మిగిలిపోవును. నేను రాజుపత్నిని, మంజువాణి యనుదాన. నామాట నీవించుక పాటింపవలదేయని సానునయముగాఁ బలికిన విని యతండు మఱుమాటాడక యతనిం బోనిచ్చెను.

తరువాత నాయువతీమణి రాజకుమారుని సౌందర్యాతిశయమును జూచి మోహించి అయ్యారే ! వీని రూపమద్భుతముగానున్నది. ఇట్టి సౌందర్యవంతుని సేవకునిఁగా జేసిన పరమేష్ఠి నిందాపాత్రుఁడుగాడా ? వీఁడు నన్ను మన్నించినఁ బంచశరుఁబరచరుగాఁ జేసికొననా ? పెరటిలోనున్న మాణిక్యంబును దెలిసికొనలేక గాజుపూసకై విదేశమున కరుగుచుంటినే ? వీనిం జూచిన నెట్టిపూఁబోడియు విరాళం గుందక మానదుగదా ! ఇట్టి సొగసుకాని నంతఃపురమునఁ గాపు పెట్టిన యీరాజు కంటె నవివేకి యెందైనంగలడా ? పాలకుండుండ మార్జాలమును గాపుపెట్టినట్లున్నదని యనేక ప్రకారములఁ దలంచుచుఁ బంచశరకరబెద్దహృదయయై యోరచూపుల నతనిం జూచుచు నట్లనియె.

చిన్న వాఁడా ! నీవెవ్వని కుమారుండవు ? పేరేమి ? నీకు వివాహమైనదా ? నీభార్య నీయందమునకుఁ దగియున్నదా ? లేదా ? చెప్పుము అని యడిగిన నతండు తలవాల్చుకొని యిట్లనియె. అమ్మా ! నేనొక పేదకుటుంబము వాఁడను. నాపేరు విజయభాస్కరుఁ డందురు నేనే సేవకుఁడనైయుండఁ బెండ్లి యాడి భార్యనెట్లు పోషింతును ? నాకుఁ బెండ్లికాలేదని యుత్తరముఁ జెప్పెను. అప్పు డబ్బిబ్బోకవతి మేనుబ్బ నవ్వుచు అయ్యో ! నన్నమ్మా యని పిలుచుటకు నేనంత పెద్దదాననుకాను. రాజుగారికి మూడవ భార్యను. నీకుఁ బెండ్లి కాలేదని విని నామది విచారముగలుగు చున్నదిగదా ! నీయౌనమిట్లు రిత్తసేయుట న్యాయమా ? నీమాట చోద్యముగా నున్నది. సేవకుఁడ వగుటచేఁ బెండ్లి మానితివా ? చాలుఁ జాలు దబ్బఱలాడుచుంటివి. మేము నీ భార్యను జూతుమని యట్లనలేదు గదా ! అవును. నీ కనురూపయగుమగువ