పుట:కాశీమజిలీకథలు -04.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

నీ వెవ్వని కుమారుండవు ? నీ నివాసదేశ మేది ? యేమి పనికై యిక్కడకి వచ్చితివి ? నీ వృత్తాంతము జెప్పు' మని యడిగిన నతం డిట్ల నియె. దేవా ! నేను క్షత్రియజాతి వాఁడను. ఒక కారణంబునఁ దండ్రి కెడమై తల్లి తో వచ్చితిని. నా పేరు విజయభాస్కరుడండ్రు. జీవనాధారము దొరకక తిరుగుచున్న వారము. నీచపు పనులకు నా బుద్ధి చొరదు. నీవు సాధుచిత్తుండవని నిన్ను సేవింపవచ్చితిని. నాకు నెలకు నూరుమాడలు వేతన మిత్తువేని నీ యొద్ద నుండెదను.

మీరు చెప్పిన పనుల నమ్మకముగాఁ జేసి దయాపాత్రుండ నగుదునని చెప్పిన యా రాజు వాని మాటలు విని సంతసించుచు సప్పుడే వాని కట్టి యధికార పత్రికి నిచ్చి చేయఁదగిన పనుల ఱేపు నియమింతునని చెప్పి యప్పటికిం బంపెను.

రాజపుత్త్రుఁ డింటికిం బోయి "అమ్మా ! యీ రాజు కడు మంచి వాఁడు. గుణసంపన్నుండు నా కోరిన వేతన మిచ్చుటకు సమ్మతించెను. దీనం గాలక్షేపము కాఁగలదు. ఓపిన కొలఁది పరుల సంతసపరుపు" మని చెప్పి తల్లికి సంతోషము గలుగఁజేసెను. అతండు మఱునాడు సభకుఁబోయి నేఁ జేయఁదగిన పని నిరూపింపు డని యడిగిన నాకా కాలోచించి యేదియుం జెప్పుటకు సమాధానము లేక యూరక యా స్థానమునం గూర్చుండమని నియమించెను. ప్రతిదినము రాజపుత్రుండు సభకు వచ్చి పనియేమని యడుగుచుండ నేమియుం జెప్పక తన యెదుట గూర్చుండఁ బెట్టు కొనుచుఁ గొన్ని దినములు గడిపెను.

మంజువాణికథ

ఆ రాజు వాని ముఖలక్షణములఁ బరీక్షించుచు సత్యవచనుండనినిశ్చయించి వాని రాత్రులయం దంతఃపురముగాచునట్లు నియమించెను. రాజపుత్రుండు రాజు చెప్పిన చొప్పున ఖడ్గపాణియై రాత్రియెల్ల నిద్రఁబోవక యంతఃపురము గాచుచుండెను. అతని యనుమతి లేక చీమయైన లోపలికిఁ బోవుటకు వీలులేదు. రాజుగారి మూడవ భార్య మంజువాణి యను చిన్నది సుముఖుండను మంత్రిని వరించి యున్నది. రాజు గారొక్క భార్యయొద్దకు మూఁడుదినముల కొకసారి బోవుచుందురు. గావున నతండు రాని రాత్రుల సుముఖుండు రహస్యముగా మంజువాణి యంతఃపురమునకరుగుచుండెను. అయ్యంతఃపుర మా రాజపుత్రుండు గాచుచుండుటచే వాడుక ప్రకార మా మేడకుఁ బోవుటకు మంత్రికి వీలుపడినదికాదు. రాత్రియెప్పుడుపోయి చూచినను రాజపుత్త్రుఁడు ఖడ్గపాణియై యిటునటు తిరుగుచుండును. దానంజేసి సుముఖుండు దీనముఖుండై యేమియుం దోపక యెప్పుడైన నిద్రఁబోవునేమో యని యా యుతఃపురమున వేచి యుండెను. ఇంచుకయు నవకాశము దొరికినది కాదు.

మఱియొకనాఁడు సుముఖుండు పెద్దయుం బ్రొద్దు చింతించి దాసీ వేషము వైచికొని మొదటి యామముననే పోయి అయ్యా ! నేను మంజువాణికి మిత్రురాలను,