పుట:కాశీమజిలీకథలు -04.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంజువాణి కథ

175

మబ్బి నట్లుండును గదా ! వానిం గూర్చునుపాయ మరయుము. నీవు మిగుల బుద్దిమంతురాలవని చెప్పినవిని యా మదనమంజరిక యిట్లనియె. సఖీ ! నీవింత బేల తనముగా మాటలాడుచున్నావేమి ? మాటలకు వశముకానివారు క్రియలకు లోఁబడుదురు. వానితో నీ వన్ని పలికితివిగాని తటాలునఁ గౌఁగిలించితివేని యంగీకరింపకుండుటకు నతండు శుకుఁడా ? భీష్ముఁడా ? హనుమంతుఁడా ? పిమ్మట మదనుండే వాని కన్నియు నుపదేశించును. ఱేపైన నట్లుచేయుమని యుపదేశించినది.

అమ్మఱునాఁ డచ్చేడియ చక్కగా నలంకరించుకొని హంసగమనంబున సల్ల న నతనియొద్దకు వచ్చి మేనఁ జెమ్మటలు గ్రమ్మఁగంపముతో నతని నంటబోయి యంతలో సిగ్గున నిలువంబడి చిన్నవాఁడా ? నేనొక్కమాటఁ జెప్పుచున్నాను వినుము. నీవు మిగుల దయాళుండవని యెల్ల వారు చెప్పుచున్నారు. నేను మదనగ్రహ పీడితనై యున్నదాన. భవదీయ పాదమూలంబు శరణంబుఁ జొచ్చితిని. పరిష్వంగ మొసంగి కాపాడుము. లేకున్న బ్రాణంబులు విడుచుచున్న దాన నని పలుకుచుఁ దన మాటలకేమియు నుత్తరమీయక యథోముఖుండై యెద్దియో ధ్యానించుచున్న యా చిన్నవాని గౌఁగిలించుకొనినది.

అప్పు డతండు బలవంతముగాఁ గౌఁగిలి విడిపించుకొని రౌద్రావేశముతోఁ గత్తిఁ దీసి ద్రోహురాలా ? యేమి చేసితివి ? నా యభిప్రాయము గై కొనక వేగిరింతురా ? స్త్రీలకు శీలము లేకున్న దండింపఁదగినది. అందు రాజుభార్యవై నీచ కృత్యముల కుద్యోగింపుచుంటివి. నిన్ను శిక్షింతును. జూడుమని వ్రేయఁబోవుటయు నయ్యువతి 'చంపుము చంపుము. నీకృపాళుత్వము వెల్ల డియగునులే' యని పలికి మెడి యొగ్గినది. అప్పు డారాజపుత్త్రుండు చేతులురాక కత్తి నేలఁబాలువైచి 'సీ ! యీరాజు నన్నుఁ దగనితావునఁ గాపుపెట్టెను. ఇందుండరాదని' పలుకుచు నందువెడలి యవ్వలికిఁ బోఁదొడంగెను. అట్టి సమయమున మంజువాని లేచి యాకత్తిదీసికొని యహంకారముతో నతనిపై విసరినది. తాను వలచిన సమ్మతింపనప్పుడు స్త్రీలకుఁ గలుగు కోపమునకు మితిలేదుగదా ? తానొకటి దలఁప దైవమొకటి దలంచును. అంతకుఁ బూర్వమే మంత్రి స్త్రీవేషము వైచుకొని రాజకుమారుఁడు నిద్రఁబోవు నేమో సమయ మరసి లోపలికిఁ బోవలయునని యందొకచో బొంచియుండెను. విసరినకత్తి రాజకుమారునికిఁ దగులక యందు డాగియున్న మంత్రికిం దగిలి కంఠ ము త్తరించినది. ఆహా ! ఎంతచోద్యము ! ఆ ప్రక్రియ యేమియు రాజకుమారుం డెఱుంగఁడు కోటదాఁటి యయ్యర్ధరాత్రంబునఁ దిన్నగాఁ దన యింటికిఁబోయెను.

మంజువాణి దాసీముఖమున నావృత్తాంతమంతయు దెలిసికొని భయాక్రాంత స్వాంతయై పరితపించుచు నా యాపద దాటింపుమని మదనమంజరికను బ్రార్థించినది. అప్పు డాదాది చేయఁదగిన కృత్యమంతయు బోధించి ఆమంత్రిశవమును మూటగట్టి తీసికొనిపోయి కందకములోఁ బాఱవైచినది. అంతలోఁ దెల్లవారుసమయ