పుట:కాశీమజిలీకథలు -04.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమవిగ్రహము కథ

167

వచ్చిన రాజభటులతో నాకుమారు బ్రహ్మరాక్షసుని కుపహారముగా నిచ్చుచున్న వాఁడ. విగ్రహముతోగూడ నా గ్రామములు నాయధీనము సేయుఁడని కోరుటయు వాండ్రు 'అయ్యా ! మీరు పుత్త్రునితోఁగూడ నీ రాత్రికి మా రాజధానికి రండు. మానృపాలుం డంతయు నక్కడ సమర్పించు'నని చెప్పి యా విప్రునిచే నొడంబడిక పత్రికల వ్రాయించి పుచ్చుకొని యా విగ్రహముతోఁగూడ హేమకూటమునకుఁబోయి యా వృత్తాంతము రాజున కెఱింగించిరి.

అతండు ప్రహర్ష సాగరంబున మునుంగుచు వారిరాక కెదురుచూచు చుండెను. దేవభట్టు భార్య చారుమతిని గమనశ్రమ వాయువరకుఁ గొన్నిదినములు మాయింట నుండవలయునని ప్రార్థించినది. విజయభాస్కరుఁ డట్లు చేయుటయే యుచితమని తల్లికి బోధించెను. ఆమెయు మిక్కిలి డస్సియుండుటంజేసి యందుల కంగీకరించినది. నాడు దేవభట్టు భార్యాపుత్త్రులతో హేమకూటనగరంబునకుఁ బయన మగుచుండ రాజపుత్త్రుఁడు దల్లితో 'అమ్మా ! నాకిందేమియుఁ గాలక్షేపము గనంబడలేదు. వీరితోఁగూడ రాజధాని కరిగి వింతలంజూచి వచ్చెద నీవు భద్రముగానుండు మని పలికిన జారుమతి “నీవు దుడుకువాఁడవు. పట్టణములకు బోఁదగదు. అదియునుం గాక నేనొంటిగ నుండజాల"నని యడ్డు చెప్పినది. అప్పుడా రాజపుత్రుండు తల్లి గడ్డము పట్టుకొని అమ్మా ! నాకు బట్టణముఁ జూడవలయునని చాల వేఁడుకగా నున్నది ఒక్కసారిచూచి వెంటనేవత్తును. నా మిత్రుఁడు గుణసాగరుఁడుగూడ వచ్చు చున్నాఁడు. ఇందేమియుం దోచదు. పోనిమ్మని బ్రతిమాలిన నారాజపత్ని యెట్టకే ననుమోదించి దేవభట్టు భార్య కప్పగించుచు అమ్మా ! వీఁడు కడుదుడుకువాఁడు. సాహసము మెండు. చొరవ యధికము. వైరాగ్యము పెద్దది కనికరించి వీని వెంటబెట్టుకొని రమ్మని పలికిన విని యామెహృదయము ఝల్లుమన నేమియుం బలుకక యూరకున్నది. అప్పుడు రాజపుత్రుఁడే వారిపయనమునకు వేగిరపెట్టఁ దొడంగెను. ప్రయాణసమయమందు రాజపుత్రుఁడు తల్లితో “అమ్మా ! నీవు నావిషయమేమియుఁ జింతింపకుము వెనుకటి పద్యమే జ్ఞాపక ముంచుకొనుము.

క. గిరియెక్కిపడిన ధరసా
   గరమున మునిఁగినను బావకముజొచ్చిన భీ
   కరఫణులతోడ నాడిన
   మరణ మకాలమునరాదు మహినెవ్వనికిన్.

అని యుపదేశించియు రాజుపుత్రుఁడు వాలితోఁగూడ హేమకూటమున కరిగెను. అందు దేవభట్టు రాజపుత్రుని వెంటఁ బెట్టుకొని చంద్రావలోకుని యాస్థానమునకు తన్నెఱింగించి వీఁడు నాపుత్రుఁడు. వీని నుపహారముగానిమ్మని తీసికొని వచ్చితి నని చెప్పినంత-