పుట:కాశీమజిలీకథలు -04.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

చ. వనజదళంబులందెగడు • వాలుకనుంగవ పేరురంబు చ
    క్కని నునుచెక్కు లందమగు • కంఠము సన్నని కొను సింహసం
    హననము దీర్ఘ బాహువుల • మానుషతేజము గల్గు రాజనం
    దనుఁ గని మేదినీపతి మ • నంబున విస్మయ మందెనెంతయున్.

ఆహా ! యీబాలునిఁ జక్రవర్తికడుపున బుట్టింపక పేదపాఱుని కుమారునిగాఁ జేసిన విధి నిందాపాత్రుఁడుగాడా ! ధన మెట్టి నీచపు పనులనై నం జేయించును. ఇట్టి సుందరాకారుని ద్రవ్యాశచేతనేకదా బలియిచ్చుట. కిట్టు వీరు తీసికొని వచ్చిరి ? కానిమ్ము. ఆవితర్కిముతో నాకేమిపని ? యని తలంచుచు శుభసమయుబున నా కుమారునికిఁ దలయంటి గంధమాల్యానులేపనాదులచేతను గనకమణిభూషణాంబరంబు లచేతనలంకరించి సపితృకముగా భద్రదంతావళపై నెక్కించి పటహభేరీమృదంగాది వాద్యములతో వారాంగనానృత్యగాన వినోదములతో నూరేగింపుచు సామంతమంత్రి హితపురోహితసహితుండై యాభూపతి యమ్మహారణ్యమున కరిగ పరివారమునెల్ల నా రావిమ్రాఁకున కల్లంత దూరములో నిలిపి తానును బ్రాహ్మణదంపతులు పుత్రుఁడు పురోహితుఁడు మాత్ర మారాక్షసనివాసమున కరిగి యాయశ్వద్దము మొదట వేఁడి గల్పించి సమంత్రకముగా నందగ్ని వేల్చుటయు నధ్యయనము జపించుచు నట్టి హాసముతో జ్వాలాముఖుం డందు వచ్చి నిలుపఁబడెను.

అప్పు డారాజు చేతులుజోడించుచు మహాత్మా ! మీతో నుడివినవడుపున మితిదాటకుండ నుపహారము దీసికొనివచ్చితి నంగీకరించి నన్నుఁ గృతార్థుంగావింపుఁ డని వేడికొనియెను జ్వాలాముఖు డాబాలక శిఖామణింగాంచి సంతసించుచు శిరః:కంపమున నంగీకార సూచనఁగావించుటయు నన్న రేంద్రుండు కరవలంబు ఝళిపించుచు నారాజపుత్రు ధాత్రీతలమున నడ్డముగాఁ బండుకొమ్మని నియమించి కాళులు దేవభట్టు పట్టుకొనియుండ నతనిభార్యను జేతులు బట్టుకొమ్మని యాజ్ఞాపించెను. అట్టిసమయమున విజయభాస్కరుండు గన్నుల నానందబాష్పములుగ్రమ్మ మందహాసశోభితవదనార విందుఁడై యాహా ! యిప్పుడు నేనీ దేహదానమున కధికమైన సుకృతము సంపాదించుకొనుచుంటిని ఉపక్రియాసహితం బను స్వర్గంబులు మోక్షంబును నాకక్కఱ లేదు. పరోపకారార్ధమై వెండియు నాకిట్టిదేహమే కావలయును. జన్మజన్మలకు నిట్లే యొరులకుప కారము సేయుచుండెదఁగాక యని సంకల్పించుకొనుచుండెను.

అప్పుడారాజు కరవాలమెత్తికుత్తుకపై నేయగమకించు సమయంబున జ్వాలాముఖుండు వారిముఖవిలాసముల నిరీక్షించి వలదు వలదు. ఏయకుమేయకుము. ఈకుమారుండు వీరి కుమారుండగునో కాదోయను సందియము గలుగుచున్నది. పుత్రఁడేయైనచో వీరించుకయైన విచారింపకుందురా ? వీరి హృదయములు సంతోష భరితములై యున్నట్లు కనంబడుచున్నవి. ఇందలి నిక్కువమరసి చెప్పుమని పలికెను.