పుట:కాశీమజిలీకథలు -04.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

దీసికొనివచ్చి డిండిమముతో నూరేగింపుచుండిరి. దేవభట్టు తన వాకిటఁ బెద్దతడవు నిలిపి యావిగ్రహమును దనభార్యకుఁ జూపెను. దానిం జూచిన సన్యాసులకుఁగూడ నాస గలుగకమానదు. ఆమె చూచియుఁ గుమారు నియ్య నిష్టములేక లోపలకుఁబోయి తలుపు వైచికొనియెను అప్పుడు దేవభట్టు భార్యను బ్రతిమాలుకొనుచుండగా గుణసారుఁడు తండ్రితో రహస్యముగా విజయభాస్కరుం డాడినమాటలన్నియుఁ జెప్పి యిట్లనియె. తండ్రీ ! నాకుపకారముఁ జేయుతలంపుతో నతం డీపని కంగీకరించెను. దీనవచ్చు లాభములో సగబాలు నాకియ్యవలయును. పిమ్మట నా సోదరులు కలహముఁ జేయుదురు ఇప్పుడే చెప్పుచున్నాడనని పలికిన విని సంతోషించుచు దేవభట్టి ట్లనియె. గుణసారా ! నిజముగా నతం డీపని కొప్పుకొనెనా ? పరిహాసమున కనెనేమో ? నా యెదుటఁ జెప్పింపు మనుటయు నతండు విజయభాస్కరుం దీసుకొని వచ్చిన వానితో దేవభట్టు 'చిన్నవాఁడా ! మా గుణసారునితో నేమో పలికితి వఁట. ఆ మాట యదార్థమే ?' యనుటయు రాజపుత్రుఁడు 'సందేహమేలా ? యదార్థమే. మీ పని మీరు కావించుకొనుఁడు. మా తల్లి కిఁ దెలియనీయకు' డని యుత్తరము సెప్పెను. బాలకా ! నీకట్టి వైరాగ్యము గలుగుటకుఁ గారణ మే మనపుఁడు నా భాస్కరుఁడు బ్రాహ్మణుఁడా ! నీ కా ప్రశ్నలతోఁ బనిలేదు. నే నాడి తప్పెడువాఁడనుగాను. మీ ప్రయత్నము చూచుకొనుఁడని చెప్పిన సంతసించుచు దేవభట్టు భార్యతో రహస్యముగా విజయభాస్కరుని మాటలన్ని యుంజెప్పి ఇఁక నీవు విచారింపనక్కరలేదు. పాపము వాఁడు మనవానికన్న వెఱ్ఱివాఁడు ! ప్రోడయైనచో నిట్టిపనికనుమోదించునా ? దీనిలో వానికేమి లాభమో తెలియదు. తన తల్లి కైన నేమియు నిమ్మని చెప్పలేదు. మన గుణసారుఁ డేమోయనుకొంటిని. మంచినేర్పరి యయ్యెంగదా ! వాని చెవిలో నేదియో యూది సమాధాన పఱపించెను. మనమీ రహస్యమెవ్వరికిం జెప్పవలదు మన వారినే యిత్తుమని యిక్కడఁ జెప్పుదము. అక్కడ వీఁడే మావాఁడని వారికిఁ జూపవచ్చును. ఇందులకైన నొప్పుకొనియెదవా ? యని చెప్పిన నామె నాలుక కఱచుకొనుచు నిట్ల నియె.

అయ్యో ! మనమెట్లు చింతింతుమో, వానికొఱకు వానితల్లి యట్లు చింతింపదా ? పుత్రశోక మందఱికి సమానమేకదా ? అదియు నాకు సమాధానము లేదని పలికిన విని యతండు నోరు మొత్తుకొనుచు నీవంటి మూఢురా లెందైనం గలదా ? పోనీ, నీ కుమారుని సమ్మతించితివికావు. మేమెవ్వరినైనం దెచ్చుకొనినను నీయడ్డమే రావలయునా ? నీ వొడంబడవేని యీ జన్నిదములు దెంపి నీమెడకుఁ జుట్టి సన్యాసము పుచ్చుగొని పోవుచున్నాను. చెప్పుమిదిగో త్రెంపుచున్నాను. చూడు మని యజ్ఞోపవీతములు సవరించుటయు నామె యేమియు మాటాడక మీ కర్మము నా కేమియుం దెలియదు. మీ యిష్టము వచ్చినట్లు చేసుకొనుఁడని లోపలికిఁ బోయినది.

అదియే సమాధాన వచనముగా నిశ్చయించి యా దేవభట్టు నిగ్రహముతో