పుట:కాశీమజిలీకథలు -04.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమవిగ్రహము కథ

165

మైన నిచ్చి నిన్నుఁ గాపాడెద నని యభయహస్త మిచ్చుటయు నతండు డగ్గుత్తిక యడంచుకొని యిట్లనియె.

వయస్యా ! నా యందు మావారి కెవ్వరికిని నిష్టములేదని నిన్న నీతోఁ జెప్పితినిగదా ? యిప్పుడీ క్రొత్తమాట వినుము. ఎవ్వఁడో రాజు వేటకుఁ బోయి యడవిలో నొక బ్రహ్మరాక్షసుని రావిచెట్టుక్రింద భార్యతోఁ గ్రీడించెనఁట. కోపించి యా బ్రహ్మరాక్షసుఁ డా రాజుం జంపబోయి యతండు వేడుకొన బ్రాహ్మణ కుమారుని దీసికొని బలియిచ్చినచో రక్షించెదనని చెప్పన నొప్పుకొని యప్పుడమి టే, డింటికివచ్చి బంగరుబొమ్మఁ జేయించి యూరూరఁ ద్రిప్పుచున్నాఁడఁట. నూరు గ్రామములతో నది వచ్చునని మా తండ్రి నన్ను బలియియ్యఁ దలఁచికొని రాత్రి మా తల్లి తోఁ బ్రస్తావించెను. ఆమె సమ్మతించినదికాదు. ఎట్లైన మగవాని మాట సాగును" అని యా కధ యంతయు సవిస్తరముగాఁ జెప్పి 'యసఘా ! నిన్నుఁ జూచినది మొదలు నాకు నీతో మైత్రిసేయవలయునని యభిలాషఁ గలుగుచున్నది. నాకుఁ దల్లిదండ్రులు లేరు. నీవే తల్లి యుఁ దండ్రియు. నీ వెంట నేనును వత్తును. నన్నుఁ దీసికొనిపొమ్ము. పోదము లెమ్ము తెల్లవాఱినచో నన్ను బలవంతమున నాపుదురు.' అని పలుకుచు బ్రతిమాలిన విని రాజపుత్త్రుం డిట్లనియె.

గుణసారా ! నీవు విచారింపకుము. నీ కభయహస్త మిచ్చియుంటినికాదా ? ఇప్పుడు పారిపోవనేల ? నీ నిమిత్తము నేనా బ్రహ్మరాక్షసుని కుపాహారముగాఁ బోయెద. నీవు సోదరులతోఁగూడ భాగ్యవంతుఁడవై సుఖింపుము. అదియే నాకుఁ బదివేలు. అని పలికిన విని యతండు వెఱఁగందుచు 'అయ్యో ! నీవు మాత్రము నా వంటి వాఁడవుకావా ? మీ తల్లి వినినఁ గోపింపదా ? నీ మాట యేమియు నాకు నచ్చలే" దని పలికిన భాస్కరుం డిట్లనియె. మిత్రమా ! ఆడితప్పిన దానికంటెఁ బాతక మెందైనఁ గలదా ? శరీర మెప్పుడైన నాశనము నొందునదే వ్యర్థముగాఁగాక గృధ్రములపాలు సేయుటకంటె మీ వంటి దీనుల కుపకారముగా విడుచుట యాధిక్యము గాదా ?

"ప్రతిక్షణ వినాశియై యధ్రువఁ బగు నీ శరీరముచేత ధ్రువంబగు ధర్మం బెవ్వఁడు సంపాదించుకొనఁడో వాఁడే మూర్ఖుడు" అని యార్యులు చెప్పుచున్నారు. ఇప్పుడు నీ కభయమిచ్చి యెట్లు మానుకొందును ? మా తల్లి కెఱిఁగింపవలదు. ఆ రాజు పరమ మూఢుఁడు తాను బ్రతికి యేమిచేయగలడు ? ఎన్నాళ్ళు జీవించును. ప్రజల దురాశపాలుఁ జేసి ఘోరకృత్యములు జేయించునా ? కొంచమైన భూతదయ యుండవలదా ? ఛీ ! యట్టివాని రాజుగాఁ జేసిన పరమేష్ఠిం దిట్టవలయుసని యా రాజును నిందించుచు ఈ మాట మీ తండ్రితో రహస్యముగాఁ జెప్పిరమ్మని నియోగించెను.

అంతలో దెల్ల వాఱుటయు నాసువర్ణవిగ్రహ మాయగ్రహారమునకుఁ