పుట:కాశీమజిలీకథలు -04.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అయ్యో ! ధనమునకై పుత్రులఁ జంపువా రుందురా ? ఆ ప్రధాని మంచి యూహయే చేసెను. కాని యందుల కెవ్వరు ననుమోదింపరనుకుందును. ఏమో ! లోకములో నెంతవారైన నుందురుగదా ? యనుటయు దేవభట్టు ఏమే ! నేనొక్క మాటఁ జెప్పెదను. కోపము సేయవుగదా ! నాకిప్పు డరువదియేండ్లు వచ్చినవి. సుఖమను మాట యెఱుఁగను. పాపము నీవును నాతో దరిద్రపు కాపురము సేయుచు సుఖపడి యెఱుంగవు. పుణ్యాత్ములనఁగా ధనవంతులే సుమీ ? నూఱుగ్రామము లనఁగా దెలియునా ? అతని రాజ్యములో నాలుగవవంతు అట్టి యైశ్వర్యము పూర్వ పుణ్యపరిపాలకంబును గాక లభించునా ? ఏమనియెదవు ? నిజము చెప్పుమని భావగర్భితముగాఁ బలికిన నా యిల్లాలు గ్రహింపక "అవును అట్టి భాగ్యము పట్టుట దుర్ఘటమే" యని ప్రత్యుత్తరముఁ జెప్పినది. సాధ్వీ ! లోకములో బుత్త్రులనగా నెవ్వరో యెరుఁగుదువా ? పూర్వభవమున శత్రువులే యిట్లు పుట్టుచుందురు. అందులో మన గుణసారుని వంటివాఁడు పరమ శత్రుండు. రామ ! రామ ! యొక్క ముక్క యైన రాదుగదా ? నలుగురిలో వీఁడు నా కొడుకని చెప్పుకొనిన సిగ్గగుచున్నది

కుపత్త్రత్వంబుకంటె నపుత్త్రత్వమే శ్రేష్ఠమని పెద్దలు చెప్పుదురు. దెలిసినదా ! యేమనియెద ? వని యడిగినప్పటికిని గ్రహింపక యామె నేనేమనియెదను ? చదువుకొనవలసినదె. వాని కర్మము ! మన మేమిచేయుదుము ? పోనిండని యుత్తరముఁ జెప్పినది అప్పుడతండు "అయ్యో ! నా మాట దీని కర్దమైనదికాదు. ఇంత కన్న నేమి చెప్పుదును ? ఇఁక దాపనేల ? తెలియువఱకుఁ జెప్పవలసినదే. యేమనునో ? సమ్మతించునా ! ఏమో ధనముగదా ! యని తలంచుచు “అదికాదు. నా మాట నీకుఁ దెలియలేదుకాఁబోలు. మన పసవును వీరికిత్తమా ? యని యున్నది. ఏమనియెద" వనుటయు "మీ మాటలే నాకుఁ దెలియవు. వారికిఁ బశువేల ? మనుష్యుఁడు కావలయునని మీరు చెప్పలేదా ?" యని యామె పలికినది. దేవభట్టు పక పక నవ్వుచు ఓసీ! మూర్ఖురాలా! ఇంత తెలిసికొనలేక పోయితివేమి ? పశువనఁగా బశువు గాదు. విద్యలేనివాఁడే పశువు. అందువలనఁ బశువంటే మన గుణసారుఁడు. వాని నియ్యగూడదా ? యని నా యభిప్రాయమనుటయు నామె యురము పైఁ గర మిడికొని "అయ్యో! అయ్యో! యెంతమాట పలికితిరి. మీకు నోరెట్లాడెను. ధన మేమి చేసుకొనియెదరు? అది యెవ్వరికొఱకు ? చాలుఁ జాలు. ఎవ్వరును వినలేదుగదా" అని వెరఁగుపడఁ జొచ్చినది.

తలిదండ్రుల సంవాదమంతయు విని గుణసారుండు ఘోరముగా నేడ్చుచు నా రాత్రియెల్ల నిద్రబోవక తెల్లవారకమున్న లేచి విజయభాస్కరుని దూరముగాఁ దీసికొనిపోయి నమస్కరించుచుఁ జెప్పుటకు మాటరాక వెక్కి వెక్కి యేడువఁ దొడంగెను. వాని దైన్యముఁ జూచి రాజపుత్రుండు చింతించుచు మిత్రమా ! గుణసారా! నీ వేటికిట్లు చింతించెదవు ? నీకు వచ్చిన యాపదయేమి ? నాతోఁ జెప్పుము ప్రాణ