పుట:కాశీమజిలీకథలు -04.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రావలోకుని కథ

163

రాజా ! నీ వినయంబున మా కించుక యనుగ్రహము గలిగినది. పదియాఱేఁడులు ప్రాయముగలిగి వివేకవంతుండై యొప్పు బ్రాహ్మణకుమారుం దీసికొనిరమ్ము . వాని చేతులు దల్లియుఁ గాళ్ళు దండ్రియుం బట్టుకొనియుండఁ దదీయగాత్రంబు ఖండించి నీవు నాకు నర్పింపవలయు నిప్పని నేఁటి కిరువదవనాఁడు కావలయునిందింత దప్పితవేని నిన్నుఁ బుత్రమిత్రకళత్రాదులతో నాశనము నొందించెదను సుమీ ! పొమ్ము వేగము రమ్మని యానతిచ్చి యా బ్రహ్మరాక్షసుఁ డంతర్దానము నొందె.

అప్పుడా రాజు “అయ్యో ! ఈ వేఁటకు నేనేమిటికి రావలయును ? వచ్చితిఁబో యీ చిన్న దానిం జూడనేల ? చూచినంతనే కోరనేల ? కోరియు నింటికిఁ బోకుండ నింతలోఁ దొందరపడనేల పాండునృపాలుండువోలె శాపదగ్దుండనైతిని గదా ? ఇంతలో నితండు నుడివినట్టి బ్రాహ్మణ కుమారుండు నాకెట్లు లభించెడిని ? ఇది నామరణమునకే వచ్చినది. కానిమ్ము . ఏమిచేయుదు" నని యనేక ప్రకారములఁ బశ్చాత్తాపముఁ జెందుచు నయ్యిందువదనతోఁ గూడ గుఱ్ఱమునెక్కి సత్వరముగాఁ దనపురంబున కరిగెను. మంత్రులును బౌరులు సామంతులు నూతన వధూయుక్తుఁడై యరుదెంచిన చంద్రావలోకునింగాంచి పరమానందమును జెందుచు ననేక మహోత్సవములు గావించిరి. అవి యా రాజున కేమియు సంతోషము గలుగఁజేసినవి కావు. మఱునాఁ డాఱేఁడు మంత్రులతోఁ దన వృత్తాంతమంతయుం జెప్పి దుఃఖించుటయు నందు సుమతియను ప్రధాని రాజు నోదార్చుచు -

హేమవిగ్రహము కథ

"దేవా ! విత్తంబునకు సాధ్యముగానిది లేదు. ప్రపంచమంతయు ద్రవ్యముతో వశమగును. తగిన ద్రవ్యము వ్యయపెట్టితిమేని యట్టి బ్రాహ్మణ పుత్రులు నూర్గురుఁ దీసికొని రాఁగలనని పలుకుచు నతని యనుమతి వడసి యప్పుడే స్వర్ణకారుల రప్పించి యిరువది బారువల బంగారముతో నొకవిగ్రహముఁ జేయించి యందు ననర్ఘములగు నవరత్నములు స్థాపింపఁజేసెను. ఆ విగ్రహము గన్నులకు మిఱుమిట్లు గొల్పుచున్నది. దాని కుడిహస్తమందొక దానపట్టము వ్రాసియుంచిరి. తనకుమారుని బ్రహ్మరాక్షసునికి బలియిచ్చువారికి నూరు గ్రామములతోగూడ నీ హేమవిగ్రహము నిచ్చుచున్నాము. అని యా దానపట్టములో వ్రాయఁబడియున్నది. మంత్రి యా కాంచన విగ్రహమును నగ్రహారములలో నూరేగింప నియమించెను. ఆ మాటలే డిండిమముతోఁ జాటించుచు నా విగ్రహము నట్లూరేగించుచున్నారు. నిన్న నా యగ్రహారములో నీ చరిత్ర యంతయు సవిస్తరముగా వక్కాణింప విని వచ్చితిని. ఆ యగ్రహారములో నెవ్వరు సమ్మతింపరైరి. మన యూరురమ్మని నేను జెప్పివచ్చితిని. ఱేపు ప్రొద్దుటి కిచ్చటికి వత్తురు. నీవునుం జూతువుగదా ? తరువాత నేమి యూహలు పుట్టునో యని యా వార్త యంతయుం జెప్పిన నప్పడతి యిట్లనియె.