పుట:కాశీమజిలీకథలు -04.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

కృత్యంబులు నిర్వర్తించికొని యమ్మించుబోడితోఁగూడ గుఱ్ఱమునెక్కి యరుగఁబోవ నెంచు సమయంబున నయ్యశ్వత్థపాదపాగ్రంబునుండి.

సీ. మెఱపుతీగెలఁబోలు • కఱకువెండ్రుకలతోఁ
               గజ్జలశ్యామలాం • గంబుతోడ
    నంత్రమాలాకృతో • ద్యత్కిరీటముతోడ
               దంష్ట్రాకరాళవ • క్త్రంబుతోడ
    నురుకేశరచితయ • జ్ఞోపవీతములతో
              గరదీప్తసరమస్త • కంబుతోడ
    ఘనపావకార్చులఁ • గ్రక్కునాలుకతోడ
              రూక్షంబులగుమిట్ట • గ్రుడ్లతోడ

గీ. దతకపాలాత్తరక్తంబు • ద్రావికొనుచు
    నట్టహాసంబుతోడ నా • ట్యంబు సేయు
    చాశ లద్రువంగఁ • జనుదెంచె నధికకోప
    దక్షుఁ డగునట్టి యొక బ్రహ్మ • రాక్షసుండు.

అట్లు వచ్చి యానృపాలు వీక్షించి యోరీ | పాపాత్మా ! నేను భేతాళుని ప్రధాన కింకరుండ జ్వాలాముఖుండను బ్రహ్మరాక్షసుండ నీ యశ్వత్థంబు మదీయ నివాస దేశము. దీనిచెంతరా దేవతలు సైతము వెఱచుచుందురు. అట్టి నా యునికి పట్టునకు వచ్చుటయేకాక చేడియతోఁగూడి రమించితివి. ఇంతకన్న నపరాధ మేమి యున్నది ? రాత్రి నీవు గావించిన యవినయంబునకు ఫలం బనుభవింతువుగాక కామోపహతచేతస్కుండవగు నీహృదయంబు భేదించి రక్తంబు ద్రావెదఁ జూడుమా యని బెదరించుటయు నమ్మేది నీ విభు డతం డవధ్యుండని యెఱింగి గజ గజ వడంకుచుఁ జేతులు జోడించి సవిననయముగా నిట్లనియె. మహాత్మా ! నేనెఱుగక చేసిన యపరాధము మన్నింపఁ వేడుచున్నాఁడను. నీ యాశ్రయమున కతిథిగాఁ జనుదెంచితిని. నిన్నే శరణుజొచ్చితిని. రక్షింపక తీరదు. శరణాగతరక్షణంబు సకలధర్మ శ్రేష్ఠంబని పెద్దలు వాక్కాణించుచుందురు. మీ రెఱుంగనిదేది ? వినుండు,

శ్లో॥ చతుస్సాగరపర్యంతాం యోదద్యాధ్వసుధామిమాం,
      యశ్చాభయంచ భూతేభ్యస్తయోరభయదోధికః !

చతుస్సముద్రముద్రితమగు భూమియంతయు దానమిచ్చినవానికంటె నభయదాన మిచ్చినవాఁడే యదికుఁడని శాస్త్రములు ఘోషించుచున్నవి. మఱియు నీవు గోరితివేని నాసనమగు నుపహారము నీకుఁ దీసికొనివచ్చి యర్పించెదను. న న్ననుగ్రహింపుమీ యని యనేక ప్రకారములఁ బ్రార్దించిన నాలించి యా బ్రహ్మరాక్షసుఁ డించుక శాంతుండై యిట్లనియె.